Video Viral : తమిళిసైకి అమిత్ షా క్లాస్!
ABN , Publish Date - Jun 13 , 2024 | 05:05 AM
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై జరిగిన ఒక ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళిసై
ఏదోటి మాట్లాడి కొత్త పంచాయితీ పెట్టొద్దని వారింపు
వేలు చూపిస్తూ గట్టిగా మందలించిన వీడియో వైరల్
చెన్నై/అమరావతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై జరిగిన ఒక ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన తమిళిసై.. వేదికపై కూర్చున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్‌షాకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే అమిత్‌షా ఆమెను వెనక్కి పిలిచి, వేలు చూపిస్తూ గట్టిగా మందలించడం కనిపించింది. ఈ సమయంలో తమిళిసై నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదు. దాంతో ఆమె ఆయన మాటలకు ‘సరే’ అన్నట్లుగా తలూపుతూ, వేదికపై వున్న వారికి నమస్కరిస్తూ తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ తమిళనాడు శాఖలో చిచ్చు రేగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షులు తమిళిసై, పొన్ రాధాకృష్ణన్, ఎల్.మురుగన్ తదితరులంతా ఓటమి పాలయ్యారు. తమిళిసై మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో అన్నామలై వ్యూహరచన సరిగ్గా లేదని, అన్నాడీఎంకేతో పొత్తు ఉంటే తమ పార్టీ విజయం సాధించేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తమిళిసైని అమిత్‌షా హెచ్చరించి ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.