Share News

Vande Bharat: మొన్న అటల్ వంతెన, నిన్న అయోధ్య, నేడు వందే భారత్.. నాణ్యత లోపాలకు కేరాఫ్‌?

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:21 PM

ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించిన అటల్ వంతెనకు పగుళ్లు రావడం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టర్మినల్ 1 విరిగిపడటం, అయోధ్యలో నీరు లీక్ కావడం, బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలడం.. ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

Vande Bharat: మొన్న అటల్ వంతెన, నిన్న అయోధ్య, నేడు వందే భారత్.. నాణ్యత లోపాలకు కేరాఫ్‌?

ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించిన అటల్ వంతెనకు పగుళ్లు రావడం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టర్మినల్ 1 విరిగిపడటం, అయోధ్యలో నీరు లీక్ కావడం, బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలడం.. ఇలా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వీటికి తోడు తాజాగా మరో ఘటన బయటపడింది.

దేశంలో రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో తెచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లలో (Vande Bharat) నీటి లీకేజీలు అవుతున్నాయి. ఓ రైలు కోచ్‌లోని రూఫ్ నుంచి నీరు కారగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.


సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మధ్య నడిస్తున్న వందే భారత్‌ రైలు నంబర్ 22416లోని ఒక కోచ్‌ పైకప్పు నుంచి నీరు కారింది. దీంతో సీట్లు తడిచిపోయి, ఫ్లోర్ అంతా నీరు నిండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కున్నారు.

వందే భారత్ రైలు నిర్వహణ తీరు, కోచ్‌ నాణ్యతపై నెటిజన్లు మండిపడ్డారు. షవర్‌తో నడిచే రైలు అని ఇంకొందరు చమత్కరించారు. ట్రైన్లోనే కూర్చొని స్నానం చేసుకోవచ్చని వ్యంగ్యంగా స్పందించారు. తాజా ఘటనతో.. టికెట్టు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ వందే భారత్ రైళ్ల తయారీలో నాణ్యత పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


స్పందించిన రైల్వే శాఖ..

వందేభారత్ రైల్లో వాటర్ లీకేజీపై నార్తన్ రైల్వే స్పందించింది. పైపుల్లో బ్లాక్‌ కారణంగా నీరు లీక్‌ అయిందని, సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. ప్రయణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 03 , 2024 | 08:21 PM