Share News

Nipah Virus: విజృంభిస్తున్న నిపా.. అసలేంటీ వైరస్.. ఎలా వస్తుంది.. దీని లక్షణాలేంటి?

ABN , Publish Date - Jul 21 , 2024 | 07:18 PM

కొవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. నిపా వైరస్ పంజా విసురుతోంది. ముఖ్యంగా.. కేరళ రాష్ట్రంలో ఇది తీవ్ర కలకలం రేపుతోంది. కొవిడ్ కంటే ప్రమాదకరమైనదిగా..

Nipah Virus: విజృంభిస్తున్న నిపా.. అసలేంటీ వైరస్.. ఎలా వస్తుంది.. దీని లక్షణాలేంటి?
Nipah Virus

కొవిడ్ (Covid-19) ప్రభావం పూర్తిగా తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. నిపా వైరస్ (Nipah Virus) పంజా విసురుతోంది. ముఖ్యంగా.. కేరళ రాష్ట్రంలో ఇది తీవ్ర కలకలం రేపుతోంది. కొవిడ్ కంటే ప్రమాదకరమైనదిగా పరిగణించే ఈ వైరస్ బారిన పడి 14 ఏళ్ల బాలుడు మృతిచెందడంతో.. అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బాలుడితో కాంటాక్ట్ అయిన 214 మందిని పరిశీలించగా.. 60 మందిని హైరిస్క్‌ కేటగిరీగా గుర్తించి ఐసోలేట్‌ చేశారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. మూడు కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించే విషయంపై ఆలోచనలు చేస్తున్నారు. అసలు ఏంటీ వైరస్? ఇది ఎలా సోకుతుంది? దీని లక్షణాలు ఏంటి? అనేది ఈ ఆర్టికల్‌లో మనం తెలుసుకుందాం పదండి.


నిపా వైరస్

తొలిసారి ఈ వైరస్‌ని 1999లో గుర్తించారు. ఇది ‘ఫ్రూట్ బ్యాట్’ అనే గబ్బిలాల్లో ఉంటుంది. వాటి నుంచే ఇది మానవులకు సోకుతుంది. ఆ గబ్బిలాలతో మనుషులు కాంటాక్ట్ అయినా, వాటి లాలాజలం లేదా అవి వాలిన ఆహారాల (పండ్లు, ఇతర ఫలాలు) ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఒక్కసారి ఇది మనిషికి సోకితే.. వారి ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ పందులు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు వంటి జంతువుల్లోనూ ఉంటాయని తేలింది. ఈ వైరస్ సోకినప్పుడు తొలుత జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 5 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఆపై మెదడు దెబ్బతిని, శ్వాస సమస్యలు ఎదురై.. రోగి 24 నుంచి 48 గంటల్లోనే కోమాలోకి వెళ్లిపోతాడు.


చికిత్స ఏంటి?

ఈ వైరస్‌కు ఇంతవరకూ కచ్ఛితమైన వైద్యం లేదు. ఈ వైరస్ సోకిన రోగిని ఐసోలేషన్‌లో ఉంచి, తగినంత నీరు అందిస్తూ, ఆయా లక్షణాలకు చికిత్స అందిస్తారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. ఫ్రూట్స్ బ్యాట్స్, పందులతో కాంటాక్ట్ తగ్గించాలి. ముఖ్యంగా.. వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో పాక్షికంగా వండిన పండ్లను తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 2017లో ఈ వైరస్ కారణంగా కేరళలో 17 మంది మృతి చెందడంతో.. అక్కడ ప్రభుత్వం దీని వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 07:18 PM