Share News

Phone Radiation: మొబైల్‌ వినియోగంతో మెదడు క్యాన్సర్‌ రాదు

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:44 AM

సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌ వస్తుందన్న భయం చాలా మందిలో ఉంటుంది! కానీ.. అదంతా వట్టి అపోహేనని,

Phone Radiation: మొబైల్‌ వినియోగంతో మెదడు క్యాన్సర్‌ రాదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌ వస్తుందన్న భయం చాలా మందిలో ఉంటుంది! కానీ.. అదంతా వట్టి అపోహేనని, మొబైల్‌ఫోన్‌ వినియోగానికి మెదడు క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేయించిన అధ్యయనాల అధ్యయనంలో వెల్లడైంది. అంటే.. ఈ అంశంపై ఇప్పటిదాకా జరిగిన పలు అధ్యయనాల నివేదికలపై అధ్యయనం అన్నమాట. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్‌వో.. ఆస్ట్రేలియన్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ న్యూక్లియర్‌ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) నేతృత్వంలో ఒక అంతర్జాతీయ పరిశోధకుల బృందాన్ని నియమించింది.


ఆ బృందం.. ప్రపంచవ్యాప్తంగా 1994 నుంచి 2022 నడుమ దీనిపై జరిగిన 5000కు పైగా అధ్యయనాలనను పరిశీలించింది. వాటిలో 63 అధ్యయనాల నివేదికలు వివిధ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. వాటన్నింటినీ కాచి వడబోసిన బృందం.. మొబైల్‌ రేడియేషన్‌ వల్ల గిలోమా, మెనింజియోమా వంటి బ్రెయిన్‌ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం, పీయూష గ్రంధిలో కణితుల ప్రమాదం లేదని తేల్చిచెప్పింది. ఈ బృందం చేసిన ‘అధ్యయనాల అధ్యయనం’ తాలూకూ నివేదిక ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే, ఇటీవలికాలంలో సాధారణంగా మారిపోయిన 5జీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌ వల్ల క్యాన్సర్‌ ముప్పుపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది.

Updated Date - Sep 05 , 2024 | 05:44 AM