Arvind Kejrival News: సీఎం రాజీనామాకు 48 గంటలు ఎందుకంటే.. అతిషి వెల్లడి
ABN , Publish Date - Sep 15 , 2024 | 07:41 PM
దాదాపు ఆరు నెలల తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారంనాడు జరిపిన పార్టీ సమావేశంలో తన రాజీనామాపై కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చేవరకూ ఆ కుర్చీలో కూర్చోనని చెప్పారు.
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. 48 గంటల గడువు వెనుక సీఎం ఉద్దేశం ఏమై ఉండవచ్చనే చర్చ కూడా బలంగా జరుగుతోంది. ఎట్టకేలకు 'ఆప్' మంత్రి అతిషి సింగ్ (Atishi Singh) ఆ కారణాన్ని వెల్లడించారు. ఈరోజు ఆదివారం కావడం, రేపు ఈద్-ఇ-మిలాద్ కారణంగా సెలవు ఉండటంతో మంగళవారమే వర్కింగ్ డే అవుతుందని అన్నారు. ఆ కారణంగానే రెండు రోజులు సమయం తీసుకున్నారని అతిషి తెలిపారు.
దాదాపు ఆరు నెలల తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారంనాడు జరిపిన పార్టీ సమావేశంలో తన రాజీనామాపై కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చేవరకూ ఆ కుర్చీలో కూర్చోనని చెప్పారు. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం కావాలని అన్నారు. ప్రజల ముందుకే వెళ్తానని చెప్పారు. నవంబర్‌లో జరగనున్న మహారాష్ట ఎన్నికలతో పాటే ఢిల్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
Delhi CM: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
అసెంబ్లీ రద్దుకు బీజేపీ డిమాండ్
ఢిల్లీ సీఎం రాజీనామా ప్రకటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అసెంబ్లీని రద్దుకు ఆప్ సర్కార్ సిఫారసు చేసి తాజా ఎన్నికలను కోరాలని డిమాండ్ చేసింది. ఇప్పుడే రాజీనామా చేయాల్సిన అనివార్యత ఎందుకు వచ్చిందో చెప్పాలని బీజేపీ ప్రతినిధి సుధాన్షు త్రివేది ప్రశ్నించారు. రాజకీయాల్లో సరికొత్త దిగజారుడును తాము చూస్తున్నామని విమర్శించారు. సీఎం కార్యాలయానికి వెళ్లొందంటూ సుప్రీంకోర్టు ఒక సీఎంను ఆదేశించించడం ఇదే మొదటిసారని అన్నారు.