Share News

Ayodhya Invitaion: నితీష్ అయోధ్య ప్రయాణంపై కొనసాగుతున్న సస్పెన్ష్

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:58 PM

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరవుతారా లేదా అనే విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే 'ఇండియా' కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతలైన సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి వెళ్లడం లేదని ప్రకటించింది.

Ayodhya Invitaion: నితీష్ అయోధ్య ప్రయాణంపై కొనసాగుతున్న సస్పెన్ష్

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple)లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) హాజరవుతారా లేదా అనే విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతలైన సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి వెళ్లడం లేదని ప్రకటించింది. సీపీఎం సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ క్రమంలో 'ఇండియా' కూటమిలో మరో కీలక భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ వైఖరిపైనే అందరి దృష్టి ఉంది.


''ముఖ్యమంత్రిగా, జేడీయూ అధ్యక్షుడిగా నితీష్‌కు ఆహ్వానం అందింది. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ తెలియజేస్తారు'' అని జేడీయూ ప్రతినిధి త్యాగి మీడియాకు తెలిపారు. రాముడు అందిరివాడని, అన్ని మతాలను గౌరవిస్తామని త్యాగి గతంలోనూ చెప్పారు. తమకు ఆహ్వానం అందితే ఎవరు వెళ్లారనేది కాకుండా జనవరి 22వ తేదీ ఈవెంట్‌కు ఎవరో ఒకరు వెళ్తారని చెప్పారు.


నితీష్ వెళ్తే...

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నితీష్ వెళ్లాలని నిర్ణయించుకుంటే 'ఇండియా' కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. వెళ్లకుంటే విపక్ష పార్టీలను 'హిందూ వ్యతిరేక' పార్టీలుగా ముద్ర వేసే అవకాశం బీజేపీకి ఇచ్చినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో నితీష్ అయోధ్యకు వెళ్లకుండా పార్టీకి చెందిన మరో నేతను అయోధ్యకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

Updated Date - Jan 12 , 2024 | 05:58 PM