UP Cabinet Expansion: యోగి క్యాబినెట్‌లో కొత్తగా నలుగురికి చోటు
ABN , Publish Date - Mar 05 , 2024 | 09:29 PM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని మంగళవారంనాడు విస్తరించారు. కొత్తగా నలుగురిని మంత్రులుగా తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తన మంత్రివర్గాన్ని మంగళవారంనాడు విస్తరించారు. కొత్తగా నలుగురిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓంప్రకాష్ రాజ్‌భర్, ఆర్ఎల్‌డీ నేత అనిల్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు బీజేపీకి చెందిన దారా సింగ్ చౌహాన్, సునీల్ కుమార్ శర్మ కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది.
రాజ్‌భర్ ప్రస్తుతం ఘజియాపూర్ జిల్లా జహూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి (ఎస్‌సీ) ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ ఉన్నారు. సహిదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ శర్మ ఉండగా, యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా దారా సింగ్ చౌహాన్ ఉన్నారు. రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే మొదటి సారి. తాజా విస్తరణతో యోగి క్యాబినెట్ సభ్యుల సంఖ్య 56కు చేరింది. గరిష్టంగా 60 మందిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది.