Share News

Angelica Daniel : నాన్న, నేను... ఓ ప్రయాణం!

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:53 AM

అందరూ స్నేహితులతో కలిసి బైక్‌ రైడ్‌లకు వెళ్తారు. కానీ 17 ఏళ్ల ఏంజలికా డేనియల్‌ తన తండ్రి అజయ్‌తో కలిసి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.

Angelica Daniel : నాన్న, నేను... ఓ ప్రయాణం!

అందరూ స్నేహితులతో కలిసి బైక్‌ రైడ్‌లకు వెళ్తారు. కానీ 17 ఏళ్ల ఏంజలికా డేనియల్‌ తన తండ్రి అజయ్‌తో కలిసి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ యాత్ర తనకు అనేక జీవిత పాఠాలను నేర్పిందంటోంది ఏంజలికా.

Untitled-1 copy.jpg

‘‘నాన్నకు బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. కొన్ని నెలల పాటు బైక్‌ మీద తిరిగి వస్తూ ఉంటారు. తనకు ఒక బైక్‌ గ్యాంగ్‌ ఉంది. అందరూ కలిసి ప్రయాణాలు ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళ క్రితం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏడు వేల కిలోమీటర్ల బైక్‌ రైడ్‌కు వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ తరువాత... రకరకాల కారణాల వల్ల ఒకరి తర్వాత ఒకరు రావటానికి కుదరదని చెప్పటం మొదలుపెట్టారు.

దీనితో నాన్నకు చాలా నిరాశ కలిగింది. తను నిరాశగా ఉండటం నాకు నచ్చలేదు.. ‘‘నాన్నా... నేను నీతో వస్తా...’’ అన్నాను. నాన్న చాలా ఆశ్చర్యపోయారు.


కొత్త కాదు, కానీ...

నాన్న బైక్‌ రైడర్‌ కాబట్టి... ఆయనతో ఈ తరహా ప్రయాణాలు నాకు కొత్త కాదు. కానీ ఏడు వేల కిలోమీటర్లు... ఒకే బైక్‌ మీద వెళ్లటం మాత్రం చాలా కొత్త అనుభవం. ప్రయాణం మొదట్లో నాన్నకు నా గురించే ఎక్కువ ఆందోళన పడేవారు. దారిలో అందమైన ప్రదేశాలను ఆస్వాదించటం మానేసి- నేను ఎలా ఉన్నాను? నాకు ఇబ్బందిగా ఉందా? అనే విషయాలపైనే శ్రద్ధ చూపించేవారు.

మూడు నాలుగు రోజుల తర్వాత నాన్నకు నేను ఆ ప్రయాణం చేయగలననే విశ్వాసం వచ్చింది. దాంతో తను కూడా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టారు. మేమిద్దరం ప్రయాణించే సమయంలో అనేక విషయాల గురించి మాట్లాడుకొనేవాళ్లం. అప్పటి వరకూ నాకు నాన్న ఇష్టాల గురించి, ఆయన అనుభవాల గురించి కొంతే తెలుసు. కానీ ఈ ప్రయాణంలో నేను నాన్నలోని కొత్త కోణాలను చూశాను. ఆ ప్రయాణం మొదట్లో నేను నాన్నకు ఒక చిన్న పిల్లను.

నెమ్మదిగా ఆయనకు ఒక స్నేహితురాలిగా మారిపోయాను. నేను, నాన్న ఒకే ఇంట్లో 17 ఏళ్లు ఉన్నాం. నేను ఎప్పుడూ నాన్న గురించి నాకు బాగా తెలుసని అనుకొనేదాన్ని. కానీ నాన్న గురించి నాకు తెలిసింది చాలా తక్కువని ఈ యాత్ర ద్వారా అర్థమయింది. అలాగే నా గురించి కూడా నాన్నకు చాలా తెలిసింది.


నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన అనేక విషయాలునాకు తెలుసు. ఏవైనా కోటల దగ్గర, ఇతర చారిత్రాత్మక ప్రదేశాల దగ్గర ఆగినప్పుడు- నాన్నకు వాటి గురించి చెప్పేదాన్ని. కొన్నిసార్లు నాన్న - నాకు ఉన్న పరిజ్ఞానానికి ఆశ్చర్యపడేవారు. ఒక రోజు సాయంత్రం ప్రయాణం చేస్తున్నాం.

అన్ని వైపులా నిశ్భబ్దం ఆవరించి ఉంది. నాకు చాలా భయమేసింది. ఆ నిశ్భబ్దాన్ని ఎలా అధిగమించాలో తెలియలేదు. అప్పుడు నాన్న నన్ను ‘డిస్నీ-ఫ్రోజెన్‌’ సినిమాలోని ‘లెట్‌ ఇట్‌ గో’ అనే పాట పాడమన్నారు. నాకు బాగా ఇష్టమైన పాట అది. ఆ పాట పాడుతుంటే నా భయమంతా పోయింది.

నేర్చుకున్న పాఠాలెన్నో...

మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ఏదో ఒక విధంగా సాయం అందుతుంది. కానీ మనకు ఆ సాయం అందుకొనే ఓపిక ఉండాలి. దాని కోసం వేచి చూడాలి. ఇదే నేను నేర్చుకున్న తొలి పాఠం. మా ప్రయాణంలో ఒకసారి మేము దారి తప్పాం. గూగుల్‌ మ్యాప్‌లు కూడా సరిగ్గా పనిచేయలేదు. ఏం చేయాలో తెలియని స్థితి.

అలాంటి పరిస్థితుల్లో ఒక గ్రామం కనిపించింది. అప్పుడు మాకు కలిగిన రిలీఫ్‌ మాటల్లో చెప్పలేను. ఇక నాన్న బైక్‌ నడపటంలో చూపించిన నైపుణ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత ఎత్తైన ప్రాంతంలోనైనా, లోతైన లోయల అంచుల్లో ఉన్నా - ఏ మాత్రం తొణకకుండా ఆయన బైక్‌ను డ్రైవ్‌ చేసిన తీరును మరిచిపోలేను.

బహుశా నాన్న జీవితంలో విజయం సాధించటానికి ఈ ఏకాగ్రతే కారణం అనుకుంటా. ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణించిన అతి పిన్నవయస్కురాలైన పిలియన్‌ రైడర్‌’గా ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నన్ను గుర్తించింది. ఆ విధంగా కూడా ఈ ప్రయాణం నా జీవితాంతమంతా గుర్తుండిపోతుంది.’’

Updated Date - Aug 19 , 2024 | 01:53 AM