Share News

Navya : శిల్ప సౌందర్యం

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:05 AM

వరుస సినిమాలు లేవు. కానీ కెమెరా లెన్స్‌లు ఎప్పుడూ ఆమెపై ఎక్కుపెట్టే ఉంటాయి. టీవీ షోలకు గెస్ట్‌గా... హోస్ట్‌గా... అన్నిటికీ మించి ఫిట్‌నెస్‌ గురూగా...

Navya : శిల్ప సౌందర్యం

వరుస సినిమాలు లేవు. కానీ కెమెరా లెన్స్‌లు ఎప్పుడూ ఆమెపై ఎక్కుపెట్టే ఉంటాయి. టీవీ షోలకు గెస్ట్‌గా... హోస్ట్‌గా... అన్నిటికీ మించి ఫిట్‌నెస్‌ గురూగా... భిన్న పాత్రల్లో ఒదిగిపోయిన బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి. ‘నా మది నియంత్రణలో నేను లేను. నా ఆధీనంలో నా మనస్సు ఉంటుంది. ఇదే నా ఆనందమయ జీవనానికి కారణం’ అంటున్న శిల్ప... యాభై ఏళ్ల వయసులోనూ తరగని అందం... మైమరిపించే రూపంతో ఆకట్టుకుంటోంది.

‘‘ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, నన్ను మానసికంగా ఇంత దృఢంగా ఉంచుతున్నది భగవద్గీతలోని ‘బంధురాత్మనస్తస్య యేనాత్మైవాత్మాన జితః... ఆనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్‌’ శ్లోకం. ‘ఎవరైతే తమ మనస్సును జయిస్తారో అది వారికి మంచి మిత్రుడిగా ఉంటుంది. లేదంటే అదే వారికి శత్రువు అవుతుంది’ అని దీని అర్థం.

నా మనసు నా నియంత్రణలో ఉందని, దాని ఆధీనంలో నేను లేనని గుర్తు చేసుకోవడానికి రోజూ ఈ శ్లోకాన్ని బిగ్గరగా చదువుతా’’ అంటున్న శిల్ప క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. క్లిష్టమైన యోగాసనాలతో కొన్ని వీడియోలు కూడా ఆమె విడుదల చేసింది. ‘అలాగే శ్వాసకు, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉంది. ప్రతి భావోద్వేగం శ్వాసతో ముడిపడి ఉంటుంది. ఒకవేళ మీరు శ్వాస లయను మార్చగలిగితే భావోద్వేగాన్ని కూడా మార్చవచ్చు’ అంటుందీ బ్యూటీ.

‘యోగా ప్రకారం శ్వాసకు, మానసిక ఆరోగ్యానికి అనివార్యమైన సంబంధం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి శ్వాస అతడి మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. శ్వాస మీద నియంత్రణ గలవారు ప్రశాంత చిత్తంతో ఉండగలరు. ప్రాణాయామం లాంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఒత్తిడిని తగ్గించి, భావోద్వేగాల సమతుల్యతకు దోహదపడతాయి. అదేవిధంగా పలు యోగాసనాల భంగిమలు కూడా శ్వాసతో ముడిపడినవే. గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తే ఆనందమయమైన, ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందగలుగుతారు’... అనేది శిల్ప మాట.

యోగాను దైనందిన జీవితంలో భాగం చేయాలనుకొనేవారు... ‘తొలుత సులువైన ఆసనాలతో ప్రారంభించి, క్రమంగా శరీరానికి అవసరమైనవాటిని సాధన చేస్తూ పోవాలి. వ్యాయామాలను ఏదో తప్పనిసరిగా చేస్తున్నట్టు కాకుండా... వాటిని ఆస్వాదిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. వీటన్నిటితో పాటు పరిశుభ్రమైన సమతుల ఆహారం, జీవన శైలి కూడా ఎంతో ముఖ్యం. అప్పుడే మన శరీరం సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకొంటుంది’ అంటోందీ భామ.


ఇదీ మెనూ...

బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా శిల్పాశెట్టి శరీరాకృతిలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకు ఆమె పాటించే వ్యాయామ, ఆహార నియమాలే ప్రధాన కారణం. మొదలుపెట్టి వదిలేసేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటివారికి భిన్నం శిల్ప. క్రమశిక్షణకు ఆమె అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఆమె మెనూలో పోషకాలు నిండిన సమతుల ఆహారం ఉంటుంది. జీవక్రియ చురుగ్గా ఉండటానికి ఒకేసారి కాకుండా చిన్న చిన్న విరామాల్లో కొద్ది మొత్తంలో తీసుకొంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు మెనూలో ఉంటాయి. ప్రాసెస్‌డ్‌, జంక్‌ ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌, ఇతర డ్రింక్స్‌కు పూర్తిగా దూరం. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తరచూ మంచినీళ్లు తాగుతుంది.

  • ఉదయం 15 ఎంఎల్‌ అలోవెరా జ్యూస్‌, పది తులసి ఆకులు, బెల్లం, అల్లం జ్యూస్‌. తరువాత రెండు గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు.

  • ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌లో మూడొంతుల నీళ్లు, ఒక వంతు పాలలో ఉడకబెట్టిన ఓట్స్‌/ మరగబెట్టిన పాలతో ముస్లీ/ వీట్‌ బ్రెడ్‌ టోస్ట్‌తో రెండు ఉడకబెట్టిన గుడ్లు, నానబెట్టిన బాదం.

  • ఉదయం 9 గంటలకు బ్రౌన్‌ షుగర్‌తో టీ. గంట తరువాత బొప్పాయి, కర్బూజా, స్ర్టాబెర్రీ, నారింజ, ఐదు టేబుల్‌ స్పూన్ల యోగర్ట్‌ కలిపి ఒక బౌల్‌ నిండా ఫ్రూట్‌ సలాడ్‌.

  • మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనంలో చికెన్‌/ గ్రిల్‌డ్‌ ఫిష్‌, ఉడకబెట్టిన కాయగూరలు, నెయ్యితో బ్రౌన్‌ రైస్‌. లేదంటే ఉడకబెట్టిన బీన్స్‌, ఒక పచ్చి క్యారెట్‌, రోస్టెడ్‌ జీరాతో గ్లాసు ఉప్పు వేసిన మజ్జిగ.

  • సాయంత్ర స్నాక్స్‌లో వెరైటీలు మారుతుంటాయి. పది రోస్టెడ్‌ మఖానా, ఐదు అక్రోట్స్‌, కిస్మిస్‌.

  • రాత్రి ఏడున్నరకు మిక్స్‌డ్‌ వెజిటబుల్‌/ చికెన్‌ సూప్‌తో పాటు టమాటో, మొలకలు, యాపిల్‌, చాట్‌ మసాల కలిపిన పాలకూర.

  • డిన్నర్‌లో గ్రిల్‌డ్‌, ఫ్రైడ్‌ చికెన్‌తో ఉడకబెట్టిన కూరగాయలు. లేదంటే బీన్స్‌/ బ్రకోలీతో ఉడకబెట్టిన ఫిష్‌, ఒక క్యారెట్‌.


వర్కవుట్‌ ఇలా...

ఇటీవల శిల్పాశెట్టి ఇన్‌స్టాలో ఫిట్‌నెస్‌కు సంబంధించి ఒక రీల్‌ పోస్టు చేసింది. అందులో సులువైనదీ, ఇంట్లోనే చేసుకోదగినవి, ప్రభావవంతమైనవి, అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ప్లాంక్స్‌ చేసి చూపించింది. వాటిల్లో ఆర్మ్‌ ప్లాంక్‌, సైడ్‌ ఎల్బో ప్లాంక్‌, ఎల్బో ప్లాంక్‌ ఉన్నాయి. రోజుకు 15-20 చొప్పున మూడు సెట్లు చేస్తే చేతులు, భుజాలు, నడుము దగ్గర కండరాలు బలపడతాయని, ఇవి కేవలం ఇరవై నిమిషాల్లో ముగించగల వ్యాయామాలని చెప్పింది శిల్ప. అలాగే సేతు బంధాసన, విశుద్ధి చక్ర, అర్ధహలాసన, నవాసనాలను రోజువారీ యోగా సాధనలో చేర్చుకొంటే అద్భుత ఫలితాలు ఉంటాయంటోంది.

  • శిల్పాశెట్టి వర్కవుట్స్‌ యోగా, కార్డియో, వెయిట్స్‌ కాంబినేషన్‌తో ఉంటాయి. శరీరాన్ని దృఢంగా, అపురూపంగా తీర్చిదిద్దుకోవడానికి ఆమె తన శరీరానికి సరిపడే కొన్ని వ్యాయామాలతో ఫిట్‌నెస్‌ మెనూ రూపొందించుకుంది.

  • రోజూ ఉదయం ముప్ఫై నుంచి నలభై నిమిషాలపాటు యోగా

  • తరువాత రన్నింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌తో కూడిన కార్డియో

  • బిగువైన, బలమైన కండరాల కోసం వెయిట్‌లిఫ్టింగ్‌, స్క్వాట్స్‌, లంగెస్‌, పుషప్స్‌

Updated Date - Jul 01 , 2024 | 12:05 AM