Bitter Health : ఆహారాన్ని ఆచితూచి...
ABN , Publish Date - Sep 24 , 2024 | 04:55 AM
చికిత్సలతోనే కాదు సహజసిద్ధమైన పదార్థాలతోనూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. అందుబాటులో ఉండే పదార్థాలను తగిన రీతిలో వాడుకోగలిగితే మెరుగైన ఆరోగ్యం సమకూరుతుంది.
హెల్తీ ఫుడ్
చికిత్సలతోనే కాదు సహజసిద్ధమైన పదార్థాలతోనూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. అందుబాటులో ఉండే పదార్థాలను తగిన రీతిలో వాడుకోగలిగితే మెరుగైన ఆరోగ్యం సమకూరుతుంది.
చక్కెరకు విరు గుడు కాకరకాయ
మధుమేహం అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువమంది కాకరకాయ రసం తాగుతూ ఉంటారు. ప్రతిరోజూ పరగడుపునే కాకరకాయ రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకొచ్చి, మధుమేహ దుష్ఫలితాలైన ఊబకాయం, హృద్రోగాలు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌లు తగ్గుముఖం పడతాయి. అయితే కాకర చేదు రుచి కారణంగా ఈ రసాన్ని తాగడానికి అందరూ ఇష్టపడరు. కానీ దీన్లో మధుమేహం మీద ప్రభావం చూపించే పాలీపెప్టైడ్, విసిన్, చరాటిన్ అనే మూడు ప్రధాన కాంపౌండ్లు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను అనుకరిస్తూ, కణాలు చక్కెర పరమాణువులను గ్రహించేలా చేస్తాయి. అలాగే ఇన్సులిన్ విడుదలను పెంచి, కాలేయాన్ని ప్రేరేపించి, శరీరం గ్లూకోజ్‌ను పీల్చుకునే సామర్ధ్యాన్ని పెంచుతాయి. కాబట్టి కాకర రసంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అయితే చేదుగా ఉండే ఈ రసాన్ని తాగలేకపోతుంటే.... ఆ జ్యూస్‌ను రుచికరంగా మార్చుకుని తాగాలి.అదెలాగంటే...
కాకర రుచిగా!
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - 2 లేదా 3
నిమ్మకాయ - అర చెక్క
పసుపు - పావు టీస్పూను
ఉప్పు - చిటికెడు
తయారీ ఇలా!
కాకరకాయలు శుభ్రంగా కడిగి తొక్కు తీయాలి. తొక్కు తీయకుండా కూడా వాడుకోవచ్చు.
కాకరకాయలును నిలువుగా కోసి, లోపలున్న విత్తనాలు తీసేయాలి.
తర్వాత చిన్న ముక్కలుగా తరగాలి.
ఈ ముక్కలను అర చెంచా ఉప్పు కలిపిన నీటిలో
10 నిమిషాలపాటు నానబెట్టాలి.
తర్వాత ఈ ముక్కలను మిక్సీలో వేసి తిప్పాలి.
తర్వాత గ్లాసులో పోసి నిమ్మరసం, పసుపు, ఉప్పు, వేసి కలిపి తాగాలి.
ఇలా తాగలేకపోతే, వడగట్టుకుని కూడా తాగవచ్చు.
చక్కెర కంటే తేనె మేలేనా?
తేనె, చక్కెర రెండూ తీపి వస్తువులే అయినా తేనె ఆరోగ్యకరమైన తీపి పదార్థం అనే నమ్మకం ఏర్పడిపోయింది. దీన్లో నిజమెంత? చక్కెర బదులు తేనె వాడడం ఆరోగ్యకరమా?
తేనె, చక్కెర రెండూ పిండి పదార్థాలే! వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి. తేనెలో 40ు ఫ్రక్టోజ్, 30 ు గ్లూకోజ్ ఉంటే, చక్కెరలో 50ు ఫ్రక్టోజ్, 50ు గ్లూకోజ్ ఉంటాయి.
స్వీట్స్‌లో వాడే శుద్ధిచేసిన ఫ్రక్టోజ్ (సుగర్) కాలేయం సహాయంతో మెటబలైజ్ అయి ఊబకాయం, కాలేయ కొవ్వు, మధుమేహాలకు దారి తీస్తుంది. అయితే ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు రెండూ శరీరంలోకి చేరుకున్న వెంటనే జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
చక్కెర కంటే తేనె మేలు!
నిజమే! ఎందుకంటే చక్కెరలో లేని నీరు, పూల పుప్పొడి, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజ లవణాలు తేనెలో ఉంటాయి. ఈ అదనపు అంశాలే తేనెకు అదనపు పోషకాలను జోడిస్తున్నాయి. తేనెతో పోలిస్తే చక్కెరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే... ఇది రక్తంలోని చక్కెర స్థాయిని వెనువెంటనే పెంచేస్తుంది. ఇందుకు కారణం తేనెలో ఉండే ఖనిజ లవణాలు దీన్లో లేకపోవడమే! అయితే తేనె, చక్కెరకు మించిన కేలరీలను శరీరానికి అందిస్తుంది. ఒక టీస్పూను చక్కెరలో 49 కేలరీలు ఉంటే, అంతే తేనెలో 64 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి తీపి అయినా అనర్థదాయకమనే విషయం దృష్టిలో పెట్టుకుని తగుమాత్రంగా వాడాలి.
మాంసకృత్తులు మాంసంలోనే ఉంటాయా?
శాకాహారుల రక్తలేమికి కారణం వారు మాంసం తినకపోవడమే అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మాంసకృత్తులు పుష్కలంగా పొందగలిగే శాకాహారమూ ఉంది. కాకపోతే వాటి పట్ల అవగాహన లేకపోవడంతో సరిపడా ప్రొటీన్లు పొందలేక రక్తలేమికి గురవుతూ ఉంటాం!
మాంసకృత్తులు ఉండే శాకాహారం: పుట్టగొడుగులు, పచ్చి బఠాణీ, కాలీఫ్లవర్, చిక్కుళ్లు, నట్స్, ఆకుకూరలు, పప్పుల్లో మాంసకృతులు ఎక్కువ. ప్రతిరోజూ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలు ఎంచుకోవాలి.
శాకాహారమే మేలు: ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారంతో పోలిస్తే శాకాహారం తేలికగా అరుగుతుంది. సమపాళ్లలో మాంసకృత్తులు ఉండే మాంసాహారం కంటే అదే పరిమాణంలో ఉండే శాకాహారంలో అదనంగా పీచు కూడా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్య కూడా తలెత్తదు.