మధుమేహం ఉన్నట్లేనా!
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:12 AM
మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం. దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం. దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మధుమేహం ఉన్న మహిళల్లో నాలుగు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి...
అధిక దాహం
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైనపుడు మూత్రపిండాలు అదనంగా ఉన్న గ్లూకోజ్‌ను బయటికి పంపేందుకు నిరంతరం శ్రమిస్తుంటాయి. దీనివల్ల శరీరంలో ఉన్న నీరు మూత్ర రూపంలో విసర్జితమవుతుంది. వెంటనే శరీరంలో తేమ శాతం తగ్గి దాహమేస్తుందన్న భావన కలుగుతుంది. అంతేకాకుండా మూత్రాశయంలో మంట, దురద వంటివి బాధిస్తుంటాయి. ఈ సమస్యలు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇన్సులిన్ నిరోధకత
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించుకోలేదు. అప్పుడు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా నెలసరి సరిగా రాకపోవడం, శరీరం బరువు పెరగడం, మొటిమలు రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
మూత్రాశయ వ్యాధులు
శరీరంలో చక్కెర స్థాయి పెరగినపుడు మూత్రంలో గ్లూకోజ్ సాంద్రత పెరుగుతుంది. దీనివల్ల మూత్రాశయంలో హానికారక బ్యాక్టీరియాలు పెరిగే ప్రమాదముంటుంది. తరచూ మూత్ర విసర్జన, శరీరం త్వరగా అలసిపోవడం, నీరసం, కళ్లు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నెలసరి సమస్యలు
మధుమేహం ఉన్నట్లయితే మహిళల్లో రుతుచక్రం అస్తవ్యస్తమవుతుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నెలసరి సరిగా రాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అధిక గ్లూకోజ్ కారణంగా హార్మోన్ల అసమతుల్యత తద్వారా ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది.