Share News

Navya : నేను దేవుడిసర్వెంట్‌ని

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:38 AM

వైద్యరంగంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు... డాక్టర్‌ ఎ.వి. గురవారెడ్డి. కీళ్ళ వ్యాధుల శస్త్రచికిత్చా నిపుణుడు, కిమ్స్‌-సన్‌షైన్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన గురవారెడ్డి మంచి రచయిత కూడా. ఆయన ‘నివేదన’తో తన ఆధ్యాత్మిక ఆలోచనలను పంచుకున్నారు.

Navya :  నేను దేవుడిసర్వెంట్‌ని

స్వానుభవం

వైద్యరంగంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు... డాక్టర్‌ ఎ.వి. గురవారెడ్డి. కీళ్ళ వ్యాధుల శస్త్రచికిత్చా నిపుణుడు, కిమ్స్‌-సన్‌షైన్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన గురవారెడ్డి మంచి రచయిత కూడా. ఆయన ‘నివేదన’తో తన ఆధ్యాత్మిక ఆలోచనలను పంచుకున్నారు.

మీ ఉద్దేశంలో దేవుడు ఎవరు?

ఒక సూపర్‌ నేచురల్‌ పవర్‌ ఉందనేది నా నమ్మకం. అది దేవుడా, మరొకటా అనేది నాకు తెలీదు. నేను దేవుడు లేడనే నాస్తికవాదిని కాను. అలాగని ప్రతి గుడికీ వెళ్ళడం, ఉపవాసాలు ఉండడం, మొక్కులు మొక్కుకోవడం లాంటి భక్తి నాకు లేదు. మనల్ని నడిపించే ఒక అతీతమైన శక్తి ఉందని నేను నమ్ముతాను. వృత్తిపరంగా... క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు ఆపరేషన్‌ చేసేటప్పుడు... ఆ పనిలో దేవుడు లేదా ఒక సూపర్‌ పవర్‌ నాకు సాయం చేస్తున్నారనేది నా నమ్మకం.

ఆలయాలకు వెళ్తారా?

వెళ్తాను. కానీ నా అంతట నేను వెళ్ళను. ప్రతినెలా ఒక గుడి, ప్రతి శనివారం ఒక గుడి, ఆరునెలలకొకసారి తిరుపతి వెళ్ళేవారు ఉంటారు. నేను అలా లెక్క ప్రకారం వెళ్ళను. నా భార్య పుట్టినరోజు నాడో, లేదా మా కోడలు రమ్మన్నప్పుడో వాళ్ళతోపాటు వెళ్తాను. మా ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది కూడా లేదు. ఒక అలమరాలో దేవుడి ఫొటోలు పెట్టుకుంటాం. నిలబడి, నమస్కారం పెట్టి... అగరుబత్తి వెలిగిస్తాం, అంతే! అలాగే దేవుడితో నాకు అనుభవాలనేవి కూడా ప్రత్యేకంగా ఏవీ లేవు. దేవుడు కలలోకి రావడం లాంటివేవీ లేవు. నేను ‘మానవసేవే మాధవసేవ’ అని నమ్ముతాను. ‘నేను ఇంతమందికి మంచి చేస్తున్నాను, వీళ్ళందరూ నాకోసం ప్రార్థిస్తారు’ అనేది నా విశ్వాసం.


మీ భారం వాళ్ళ మీద వేస్తున్నారా...

అంతేకదా! నా భారాన్ని నా పేషెంట్ల మీద వేస్తాను. పెద్దవారైతే ఆశీర్వదిస్తారు. మీరు ఇంకా ఎంతోమందికి సేవ చెయ్యాలంటారు. నా తరఫున వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ‘మానవసేవే మాధవసేవ’ అని నాకు గట్టి నమ్మకం. నాకు చేతనైతే సేవ చేస్తాను. నాకు తెలిసి నేను ఏ ఒక్క వ్యక్తికీ చెడు చెయ్యలేదు. తెలియక చేసింది ఏదైనా ఉండొచ్చేమో... కాబట్టి దేవుడు నాకు మంచే చేస్తాడు. అదే నాకు గట్టి ధైర్యం, నమ్మకం. అందుకే ‘ఐయామ్‌ బ్లెస్డ్‌’ అని ఎప్పుడూ అంటూ ఉంటాను. ఆ ఆశీస్సులు అందించినది... దేవుడైనా కావచ్చు, మరే శక్తయినా కావచ్చు. మంచి జీవితం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి స్నేహితులనిచ్చాడు, నలుగురికి సేవచేసే మార్గం ఇచ్చాడు. ఇవన్నీ కూడా నాకు దక్కిన దీవెనలే అనుకుంటాను. ఇవన్నీ అందరికీ ఉండవు కదా...

మీ చిన్నప్పుడు ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేదా?

ఉండేది. మా కులదైవం నరసింహస్వామి. మా నాన్న పెద్ద భక్తుడు. పూజలు ఎక్కువగా చేసేవారు. నా వరకూ వస్తే... విద్యార్థి దశలో కూడా నేనెప్పుడూ దేవుణ్ణి ఏదీ కోరుకోలేదు. దేవుణ్ణి అడగడం, కోరింది జరగకపోతే అలగడం... అలాంటివేవీ లేవు. మొదటినుంచి ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. దేవుడైనా, సూపర్‌ పవరైనా... మన పని మనం చేసుకుంటే... దాని పని అది చేసుకుంటుంది. నేను చెప్పేది ఒక్కటే... ఈ జీవితం ఒక నాటకరంగం. మనమందరం మన పాత్రలు పోషిస్తాం. దేవుడు స్ర్కిప్ట్‌ రాస్తాడు. మనం నటిస్తాం. వెళ్ళిపోతాం. ‘మనం ఏదో చేశాం, సాధించాం’ అనుకోకూడదు. ఇదంతా ముందుగానే నిర్దేశించి ఉండే విషయం.

అంటే దేవుణ్ణి నమ్ముతున్నట్టే కదా...

ఒక పవర్‌ని నమ్ముతున్నాను. కానీ అందరూ దేవుడు అంటున్నదానికి నేను దేన్నీ ఆపాదించను. మొత్తం ప్రపంచంలో వివరణకు అందనివి జరుగుతూ ఉంటాయి. ‘ఈ రోజు ఇంతమంది రోగులకు సేవచెయ్యి. ఇంతమందికి మోకాళ్ళ శస్త్రచికిత్సలు చెయ్యి’ అని ఆయన స్ర్కిప్ట్‌ రాశాడు. నేను చేస్తున్నాను. అందుకే ఏ అఛీవ్‌మెంట్‌ సాధించినా... ఇదంతా నా ఘనతేనని నేను అనుకోను. ఆయన రాశాడు, నేను చేశాను... అంతే.


వైద్యో నారాయణో హరిః అంటారు. మీ ద్వారా స్వస్థత పొందినవాళ్ళు మిమ్మల్ని దేవుడిలా చూస్తున్నపుడు మీకెలా అనిపిస్తుంది?

అలా అనేవాళ్ళు ఉంటారు. నేను అభ్యంతరం చెబుతూ ఉంటాను. ‘‘నేను దేవుణ్ణి కాదు. దేవుడి సర్వెంట్‌ని. దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీ అందరికీ సాయం చెయ్యడానికి, సేవ చెయ్యడానికి. అలాగే వైద్యుల్ని దేవుళ్ళనీ అనుకోవద్దు, రాక్షసులనీ అనుకోవద్దు. మామూలు మనుషులని అనుకుంటే చాలు’’ అని చెబుతాను. విద్య నేర్చుకున్నాను. దాంతో ఉపయోగపడే పని చేసున్నాను. నా విద్య, నా అనుభవం, నేను తీసుకున్న శిక్షణతో... నాకు సముచితం అనిపించిన నిర్ణయం తీసుకుంటాను. ఇదంతా ఆ దేవుడు నా చేతుల మీదుగా చేయిస్తున్నాడని అనుకుంటాను. నేను చికిత్స చేస్తున్నాను, ఆయన నయం చేస్తాడు. కాబట్టి వైద్యంలో... నా వంతు నాది, ఆయన వంతు ఆయనది.

సమాజంలో భక్తి ప్రదర్శన ఇటీవల ఎక్కువయిందనే విమర్శను ఎలా చూడాలి?

ఇప్పుడు ఆధ్యాత్మికత, దేవుళ్ళు వ్యాపారంగా మారాయి. భక్తులకు డ్రెస్‌ కోడ్‌ లాంటివి కూడా ఎక్కువగానే చూస్తున్నాం. అలాగే ఫ్యాషన్‌ కూడా అయింది. దాంతో ఇదివరకటికన్నా భక్తికి ప్రదర్శన పెరిగింది. పూర్వం కుటుంబంతో గుడికి వెళ్ళి, కొబ్బరికాయ కొట్టి, బయటికి వచ్చేవాళ్ళు. అక్కడితో అయిపోయేది. ఇప్పుడు అలా కాదు... ఏదైనా పండగ వచ్చినప్పుడు... వంద మంది ఫొటోలతో బ్యానర్లు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. భక్తిని వ్యక్తీకరించే పద్ధతులు మారాయి.

మీ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే...

ఆధ్యాత్మికత అంటే... ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు... ఫలితం మంచిదైనా, చెడుదైనా మన పని మనం చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇది చేస్తే ఏం వస్తుందనేది ఆలోచించకుండా చెయ్యాలి. ఫలితం మన చేతుల్లో లేదు.

సంభాషణ: కృష్ణశర్మ

Updated Date - Jun 14 , 2024 | 12:38 AM