Film Stars: వ్యాపారంలోనూ స్టార్లే
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:50 AM
అగ్రతారలు చిత్ర పరిశ్రమలో సంపాదించిన సొమ్మును తిరిగి అదే రంగంలో పెట్టుబడిగా పెట్టడం మొదటి నుంచీ ఉన్నదే.
అగ్రతారలు చిత్ర పరిశ్రమలో సంపాదించిన సొమ్మును తిరిగి అదే రంగంలో పెట్టుబడిగా పెట్టడం మొదటి నుంచీ ఉన్నదే. తమకు బాగా పట్టున్న రంగం కావడం దానికి కారణం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పాతతరం అగ్రహీరోలు స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లు, థియేటర్ల రంగంలో పెట్టుబడులు పెట్టి, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమవంతు పాటపడ్డారు. ఆ తర్వాత తరంలోనూ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి కొంతమంది హీరోలు అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. అయితే చాలావరకూ తమ వ్యాపారాలను సినీరంగానికే పరిమితం చేసుకున్నారు. వారికి భిన్నంగా కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్న ఈ తరం తారలు చాలామంది పెట్టుబడులకు అనువైన ఇతర రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. వారిలో కొందరు అక్కడా మంచి విజయాలను అందిపుచ్చుకుంటుండగా, మరికొందరు విఫలమై వెనుదిరుగుతున్నారు.
బిజినెస్‌మాన్...
టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బిజినెస్‌మాన్’. ఇప్పుడు ఆయన ఆ టైటిల్‌కు తగ్గ పాత్రను తన నిజ జీవితంలో పోషిస్తున్నారు. సినీరంగానికి సంబంధించిన పలు వ్యాపారాల్లో అడుగుపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ‘జీఎంబీ’ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, సినిమాలు నిర్మిస్తున్నారు. అలాగే ‘ఏఎంబీ’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ నడుపుతున్నారు. సినీ రంగానికి బయట కూడా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ‘ది హంబల్ కో’ పేరుతో 2019లోనే ఆయన వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. గతంలో ఆయన ‘ఫిట్ డే’ అనే అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టారు. చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను తయారు చేయడం ఆ సంస్థ ప్రత్యేకత. మహేశ్ శ్రీమతి నమ్రతా శిరోద్కర్ ఇటీవలే రెస్టారెంట్ బిజినె్‌సలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో కొత్త రంగంలో ఆయన పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి రంగానికి చెందిన ప్రముఖ సంస్థకు ప్రచారకర్తగా నియమితుడైన మహేశ్ అదే కంపెనీలో వాటాలు కొన్నారని తెలుస్తోంది.
అక్కడా అదే జోరు...
అభిమానులను ‘రౌడీస్’ అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే భవిష్యత్‌లో మంచి వృద్ధికి అవకాశముందని భావిస్తున్న ఎలక్ర్టానిక్ వెహికల్ రంగంలోనూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు విజయ్. ఎలక్ర్టిక్ బైక్స్, స్కూటర్స్ అద్దెకు ఇచ్చే ఓ కంపెనీలోనూ విజయ్ పెట్టుబడులు పెట్టారు. సినీరంగానికే పరిమితమైన తమ కుటుంబ వ్యాపారాలకే వె ంకటేశ్ పరిమితమయ్యారు ఇప్పటివరకు. అయితే ఇటీవల ఎలక్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహించే ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆశ్చర్యపరిచారు. ‘వివాహ భోజనంబు’ పేరుతో రెస్టారెంట్స్ చైన్‌ను ప్రారంభించి, విజయవంతంగా కొనసాస్తున్నారు సందీప్ కిషన్. ఆయన క్యూబీఎస్ సంస్థతో కలసి సెలూన్ ఫ్రాంఛైజీలను ప్రముఖ నగరాల్లో ప్రారంభించారు. అల్లు అర్జున్ కుటుంబానికి పలు సినీ వ్యాపారాలతో పాటు... బన్నీ హైదరాబాద్‌లో ప్రఖ్యాత స్పోర్ట్స్ బార్ అయిన ‘బి-డబ్స్’ ఫ్రాంచైజీని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో ఓ స్విస్ బేకరీని, రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఒకప్పుడు నాగార్జున, చిరంజీవి ఓ టీవీ ఛానల్‌కు సహ భాగస్వాములుగా ఉన్నారు. తర్వాత తమ వాటాలు అమ్ముకున్నారు. నాగార్జున బ్యాడ్మింటన్ లీగ్, ఫుట్‌బాల్ లీగ్‌లో జట్టుకు యజమానిగా వ్యవహరించారు. మంచు విష్ణు తమ కుటుంబానకి చెందిన విద్యాసంస్థల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సొంతంగా వీఎ్‌ఫఎక్స్ సంస్థను నడుపుతున్నారు. ప్రకాశ్‌రాజ్ ‘లైఫ్ ఎట్ ప్రకాశం’ పేరుతో ఓ రిసార్ట్‌ను నిర్వహిస్తున్నారు.
వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రవితేజ థియేటర్లను నిర్మిస్తున్నారు. ఇక తమిళ అగ్రహీరో కమల్‌హాసన్ భారతీయ ఖద్దరును పాశ్చాత్య దేశాల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ‘కేహెచ్ హౌజ్ ఆఫ్ ఖద్దర్’ పేరుతో ఈ వస్త్రాలను మార్కెట్లోకి తెచ్చారు. అమెరికాలోని షికాగోలో తొలి స్టోర్ ప్రారంభించారు. మరో తమిళ హీరో అజిత్ డ్రోన్ల తయారీ రంగంలోకి దిగారు.
వారికి నష్టాలు...
అయితే కొంతమంది హీరోలకు మాత్రం వ్యాపారాలు అంతగా అచ్చిరాలేదు. రామ్‌చరణ్ గతంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసింది. నటుడిగా అరంగేట్రానికి ముందు రానా వీఎ్‌ఫఎక్స్ స్టూడియోను నడిపారు. ఆ తర్వాత దాన్ని అమ్మేసి, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రాణిస్తున్న పురుషుల కోసం డిక్రాఫ్ సంస్థతో కలసి కొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చారు.
తెరవెనుక ఉంటూ...
ముందుచూపుతో స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టి అద్భుతాలు చూపించిన శోభన్‌బాబు బాటలోనే చాలామంది సినిమావాళ్లు కొన సాగుతున్నారు. తమ సంపదను స్థిరాస్థిరంగంలో మదుపు చేయని తారలు అరుదనే చెప్పాలి. కొందరు ధర తక్కువగా ఉన్నప్పుడే వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టే సినీ ప్రముఖులు బినామీలు, కొన్ని ప్రముఖ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టడమే తప్ప తెరముందు మాత్రం రావడంలేదు.
కథానాయికలకు కలిసొచ్చింది
హీరోలతో పోల్చితే కథానాయికలకు సుదీర్ఘమైన కెరీర్ ఉండదు కాబట్టి అవకాశాలు తగ్గేలోపు ఏదో ఒక వ్యాపారంలో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సమంత ‘సాకీ’ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అలాగే చెన్నైలో ‘ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్’ పేరుతో విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, తమన్నా బంగారు ఆభరణాల వ్యాపారంలో రాణిస్తున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ ‘ఎఫ్ 45’ ఫిట్‌నెస్ స్టూడియోను నడుపుతున్నారు. తాప్సీ ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నడుపుతున్నారు. కీర్తి సురేశ్ చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థను ప్రారంభించారు.