Share News

సలహా గర్భాశయంలో గడ్డలుంటే?

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:27 AM

పునరుత్పత్తి వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు కొందరు మహిళల్లో తయారవుతూ ఉంటాయి.

సలహా గర్భాశయంలో గడ్డలుంటే?

డాక్టర్‌! నా వయసు 30 ఏళ్లు. పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు కలగడం లేదు. వైద్య పరీక్షల్లో ఫైబ్రాయిడ్లు ఉన్నాయని తేలింది. పిల్లలు కలగకపోవడానికి ఫైబ్రాయిడ్లే కారణమా? వీటిని తొలగించుకునే మార్గం లేదా?

- ఓ సోదరి, విశాఖపట్నం.

పునరుత్పత్తి వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు కొందరు మహిళల్లో తయారవుతూ ఉంటాయి. ఇవి రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల కంటే చిన్న ఫైబ్రాయిడ్లను వైద్య చికిత్స సహాయంతో తగ్గించుకోవలసి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే, గర్భసంచి పక్కన ఉండే మూత్రాశయం మీద ఒత్తిడి పడడం మూలంగా మూత్రసంబంధ సమస్యలు (తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం) మొదలవుతాయి. అలాగే కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, కొన్నిసార్లు జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలుంటాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

.


కొందర్లో ఫైబ్రాయిడ్లు ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ చేయుంచుకుంటూ ఫైబ్రాయిడ్ల పరిమాణాన్ని కనిపెడుతూ ఉండాలి. అలాగే కొందరు మహిళల్లో పెద్ద సైజు ఫైబ్రాయిడ్లు ఉంటాయి. ఇతరత్రా వైద్య చికిత్సలు ఫలితాన్నివ్వవు. కాబట్టి సర్జరీ ద్వారా మాత్రమే వాటికి చికిత్స చేయవలసి ఉంటుంది. ఫైబ్రాయిడ్‌ను మాత్రమే తొలగించే మయోమెక్టమీ లేదా ఫైబ్రాయిడ్స్‌తో పాటు, గర్భసంచిని కూడా తొలగించే హిస్ట్రక్టమీ సర్జరీలను ఎంచుకోవలసి ఉంటుంది. అయితే ఎవరికి ఏ సర్జరీ అవసరం అనేది వారి వారి వయసు, ఫైబ్రాయిడ్‌ మూలంగా తలెత్తే సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. యువతుల్లో ఫైబ్రాయిడ్ల వల్ల గర్భధారణ సమస్యలున్నా, నెలసరి సమస్యలున్నా ఫైబ్రాయిడ్‌ గడ్డను మాత్రమే తొలగించే మయోమెక్టమీ సర్జరీ అవసరం అవుతుంది. అలా కాకుండా పిల్లలు కలిగి, 40 నుంచి 45 ఏళ్లు దాటి, ఫైబ్రాయిడ్‌ పరిమాణం వేగంగా పెరుగుతున్న పరిస్థితి ఉంటే, ఫైబ్రాయిడ్‌తో పాటు గర్భసంచిని కూడా తొలగించవలసి ఉంటుంది. ఇలా ఫైబ్రాయిడ్‌ సైజును బట్టి, వయసును బట్టి, బాధిస్తున్న సమస్యలను బట్టి సర్జరీ అవసరాన్ని వైద్యులు అంచనా వేస్తారు.

డాక్టర్‌ ఎమ్‌. రజని,

కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - Nov 28 , 2024 | 05:27 AM