Share News

Navya : ఆగితే అనర్థమే!

ABN , Publish Date - Jun 22 , 2024 | 01:55 AM

కేన్సర్‌ వస్తే, దాన్ని లాగి పెట్టి కొట్టి, మన దారిన మనం వెళ్లిపోవాలి. అంతేగానీ దాన్నే పట్టుకుని వేలాడుతూ, కుదేలైపోకూడదు అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన కేన్సర్‌ సర్వైవర్‌, జ్యోతి పనింగిపల్లి

Navya : ఆగితే అనర్థమే!

కేన్సర్‌ సర్వైవర్‌

కేన్సర్‌ వస్తే, దాన్ని లాగి పెట్టి కొట్టి, మన దారిన మనం వెళ్లిపోవాలి. అంతేగానీ దాన్నే పట్టుకుని వేలాడుతూ, కుదేలైపోకూడదు అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన కేన్సర్‌ సర్వైవర్‌, జ్యోతి పనింగిపల్లి. వ్యాధి నుంచి నెలల వ్యవధిలోనే పూర్తిగా కోలుకున్న ఆవిడ, తన కేన్సర్‌ అనుభవాన్ని అరమరికలు లేకుండా ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.

‘‘బరువు తగ్గితే ఎవరికైనా సంతోషమే! ఎలాంటి ఆహార నియమాలు పాటించకపోయినా రెండేళ్ల వ్యవధిలో పది కిలోలు బరువు తగ్గిపోయేసరికి నేను కూడా తెగ సంతోషపడిపోయాను. కానీ ఒంట్లో దాగిన కేన్సర్‌ రాకాసి నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని కుదేలు చేస్తోందనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోయాను. నోట్లో చిగురు వాచింది. అయినా ఎలాంటి నొప్పి, అసౌకర్యం లేదు.

చెన్నైలో ఉన్న కొడుకు, కోడలి దగ్గరకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని వాళ్లతో పంచుకున్నాను. కోడలు డెంటిస్ట్‌ కావడంతో క్లీన్‌ చేస్తే సమస్య సర్దుకుంటుందని చెప్పడంతో క్లీనింగ్‌ చేయించుకున్నాను. ఆ సమయంలో అక్కడేదో సమస్య ఉన్నట్టు మా కోడలు కనిపెట్టింది. అనుమానంతో బయాప్సీ చేయిస్తే కేన్సర్‌ బయటపడింది. దాంతో అందరం ఒక్కసారిగా హతాసులమైపోయాం. మా అబ్బాయి కేన్సర్‌ సంబంధిత డాక్టర్‌ కావడం కూడా నాకు కలిసొచ్చింది. అదృష్టవశాత్తూ కేన్సర్‌ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అయినా ‘అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండే నాకు కేన్సర్‌ సోకడమేంటి?’ అనే షాక్‌లోనే నేను ఉండిపోయాను. తర్వాత చెన్నైలోని గ్లోబల్‌ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఆంకాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సుందరరాజన్‌ను కలిశాం.


అప్పుడాయన, ‘సర్జరీ ఎప్పుడు చేయించుకుంటావు?’ అని నన్ను అడిగారు. ‘రేపే చేయించుకుంటాను’ అని నేను చెప్పేశాను. అదొక సుదీర్ఘమైన సర్జరీ. గత నవంబరు 7న, 12 గంటల సుదీర్ఘమైన సర్జరీ జరిగింది. వ్యాధి సోకిన కుడివైపు దవడలో కొంత భాగాన్ని తొలగించి, కాలి ఎముకలో కొంత భాగాన్నీ, తొడ నుంచి కొంత కండరాన్నీ సేకరించి, దవడ ప్రదేశంలో ఫ్లాప్‌ వేశారు. జనవరిలో రేడియేషన్‌ తీసుకున్నాను.

అదృష్టవశాత్తూ నాకూ కీమోథెరపీ అవసరం కూడా పడలేదు. కేన్సర్‌ బయల్పడడం, సర్జరీ జరగడం, తర్వాత రేడియేషన్‌, ఫాలోఅప్‌లో కేన్సర్‌ పూర్తిగా నయమైపోయిం దని తేలడం... ఇవన్నీ ఆరు నెలల వ్యవధిలోనే జరిగిపోయాయి. నేనిప్పుడు అందర్లాగే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను.

లక్ష్యం ఏర్పరుచుకోవాలి

కేన్సర్‌ ఉందని చెప్పినప్పుడు నాకు మొదట డాక్టర్ల మీద కోపమొచ్చింది. నాకెలాంటి నొప్పి లేదు, అసౌకర్యం లేదు. కాబట్టి నాకసలు కేన్సర్‌ లేదనే అనుకున్నాను. కానీ సర్జరీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని వైద్యులు నచ్చజెప్పినతర్వాత, పరిస్థితిని అంగీకరించాను. పరిస్థితిని అంగీకరించిన తర్వాతే మనసు నెమ్మదించింది. శరీరంలో ఎక్కడ, ఏ సమస్యైనా తలెత్తవచ్చు. దాన్ని వైద్యంతో సరిదిద్దుకోక తప్పదు.

నాకు కేన్సర్‌ సోకిన అమ్మ డిఎన్‌ఎ సంక్రమించింది. కాబట్టే ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కేన్సర్‌ బారిన పడ్డాను. ఇలా ఎంతోమందికి జరుగుతుంది. కుటుంబ చరిత్రలో కేన్సర్లు ఉన్నవాళ్లు రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సోకినా అక్కడితో జీవితం అంతమైపోయిందని కుంగిపోకూడదు.

అలాంటి క్లిష్ట సమయంలోనే మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. త్వరగా కోలుకుని మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలనీ, పుణ్యక్షేత్రాలు సందర్శించాలనీ.. ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, ఆ రోజు కోసం ఆతృతగా ఎదురుచూడాలి. అప్పుడే మనం వేగంగా పూర్వపు స్థితికి చేరుకోగలుగుతాం! నేనేమీ సూపర్‌ విమెన్‌ను కాను కదా, కాబట్టి మొదట్లో నేనూ కుంగిపోయాను. ఒంటరితనాన్ని ఆశ్రయించి, ఏడుస్తూ ఉండిపోయాను. ఆ సమయంలో మా అబ్బాయి నాకు ధైర్యం చెప్పి, కేన్సర్‌తో పోరాడే ధైర్యాన్ని నూరిపోశాడు.

సర్జరీ జరిగిన సమయంలో నేను చెన్నైలో ఉన్నాను. నాకేమో హైదరాబాద్‌లో ఉన్న మా ఇంటికి వచ్చేయాలని ఉండేది. అంతకంటే ముఖ్యంగా మునుపటిలా ఆరోగ్యంగా మారిపోవాలనీ, ఇంట్లో 18 ఏళ్లుగా ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తున్న అఖండ జ్యోతికోసమైనా కేన్సర్‌ను జయించాలనీ పట్టుదలను పెంచుకున్నాను. కాబట్టే త్వరగా కోలుకోగలిగాను.


అన్‌ వెయిట్‌ కీలకం

కేన్సర్‌ వచ్చేవరకూ వెయిట్‌ చేయకూడదు. అందుకే అందరికీ నేను ‘అన్‌ వెయిట్‌’... అంటే, నెత్తిన కేన్సర్‌ బాంబు పడేవరకూ ఆగకుండా ముందుగానే అప్రమత్తం కావాలని చెప్తూ ఉంటాను. మరీ ముఖ్యంగా కుటుంబ చరిత్రలో కేన్సర్‌ ఉన్నవాళ్లు, కేన్సర్‌ సోకే పరిస్థితుల్లో జీవించేవాళ్లు కేన్సర్‌ దాడి చేసే వరకూ ఆగకుండా, ముందుగానే అప్రమత్తం కావాలి. వ్యాధి తీవ్రమై కోలుకోలేని పరిస్థితి సమీపించేవరకూ ఆగకూడదు.

సాధారణంగా ఎవరైనా ప్రతి ఆరు నెలలకూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటాం. చిన్న రుగ్మత తలెత్తితే వైద్యుల దగ్గరకు పరుగులు పెడతాం. కానీ కేన్సర్‌ ఒక వ్యాధేననీ, అది ఎప్పుడైనా, ఏ అవయవానికైనా సోకే అవకాశం ఉంటుందనే విషయాన్ని విస్మరిస్తూ ఉంటాం! నిజానికి కేన్సర్‌ సోకవచ్చేమోననే ఆలోచనే మనలో ఎవరికీ తట్టదు.

కానీ మిగతా వైద్య పరీక్షల్లాగే కేన్సర్‌ పరీక్షలు కూడా చేయించుకోగలిగితే ఆ వ్యాధిని ప్రారంభంలోనే కనిపెట్టవచ్చు. సమర్థ చికిత్సతో నియంత్రించుకోవచ్చు. నిజానికి కేన్సర్‌ లక్షణాలు ఏదో ఒక రూపంలో బయల్పడుతూ ఉంటాయి. వాటిని కనిపెడుతూ ఉండాలి.


మెదడు మాటలను శరీరం వింటుంది

ఈ వ్యాధి వచ్చినవాళ్ల కంటే, చుట్టుపక్కల వాళ్లు, తమకే కేన్సర్‌ సోకినంతగా బాధపడిపోతూ ఉంటారు. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక.. భోరున ఏడ్చేసేవాళ్లూ ఉంటారు. పదే పదే గుర్తు చేసే వాళ్లకు దూరంగా ఉండడమే మేలు. అమ్మో నాకు కేన్సర్‌ సోకిందని ఏడుస్తూ, భయపడుతూ, కుంగిపోతూ కూర్చున్నంత మాత్రాన వ్యాధి తగ్గిపోదు. మన మెదడులోకి విషాదకరమైన ఆలోచలని ప్రవేశించనీయకూడదు. వీలైనంత త్వరగా చికిత్సతో నయం చేసుకుని, హుషారుగా సాగిపోవాలి. లేచి నడువు అని మనసు చెప్పినప్పుడు, దాని నోరు మూయించకుండా నడవాలి.

అప్పుడే త్వరగా కోలుకోగలుగుతాం! నేనిక్కడ ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. ‘ఒక్కతివే ఎలా ఉండగలుగుతున్నావు?’ అని కొందరు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. ‘అమ్మమ్మా, ఇంట్లో నువ్వొక్కదానివే ఒంటరిగా ఎందుకుంటున్నావు? నిన్నెవరూ పెళ్లి చేసుకోలేదా? అని మా ఏడేళ్ల మనవడు కూడా ఒక సందర్భంలో అడిగాడు. అందుకు నేను... అందంగా లేనని నన్ను పెళ్లి చేసుకోడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నప్పుడు, ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అమ్మమ్మా’ అన్నాడు. ఆ మాటలకు నా చిన్న మనవడేమో... ‘వయసులో పెద్దవాళ్లను పెళ్లి చేసుకోకూడదురా’ అని వాడికి నచ్చచెప్పాడు. నిజం చెప్పాలంటే ఇలాంటి జ్ఞాపకాలతో ఏకాంతంలోనే నాకు కావలసినంత కాలక్షేపం అవుతూ ఉంటుంది.

- గోగుమళ్ల కవిత, ఫొటో: రామినేని రాజ్‌ కుమార్‌

Updated Date - Jun 22 , 2024 | 01:55 AM