Share News

Indian Film Industry : హద్దులు చెరిగే...కలయిక కుదిరే

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:16 AM

కొత్త సినిమాతో పాటు ఇండస్ట్రీలో వినిపించే పదం కాంబినేషన్‌. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల కలయిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త కలయికకు వేదిక సిద్ధమౌతోంది.

 Indian Film Industry : హద్దులు చెరిగే...కలయిక కుదిరే

కొత్త సినిమాతో పాటు ఇండస్ట్రీలో వినిపించే పదం కాంబినేషన్‌. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల కలయిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త కలయికకు వేదిక సిద్ధమౌతోంది. భిన్న ధ్రువాల్లాంటి దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమల కాంబినేషన్‌ హిట్‌ ఫార్ములాగా మారుతోంది. పోటీ పడి నష్టపోయే బదులు రెండు ఇండస్ట్రీలు పరస్పర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న దృశ్యం ఆవిష్కారమవుతోంది.

Untitled-2 copy.jpg

భారతీయ సినిమాకు పెద్దన్న అంటే బాలీవుడ్‌. కానీ కరోనా తర్వాత కథ మారింది. దక్షిణాది సినిమాలు, ముఖ్యంగా టాలీవుడ్‌ చిత్రాలు వసూళ్లలో, విజయాల్లో హిందీ సినిమాలతో పోటీ పడడమే కాదు బాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేశాయి. తెలుగు చిత్రాలు ‘పుష్ప’, కార్తికేయ’, కన్నడ నుంచి ‘కేజీఎఫ్‌’, ‘కాంతార’, మలయాళ సినిమాలు ‘2018, ఆడుజీవితం’, తమిళం నుంచి ‘విక్రమ్‌, జైలర్‌’ లాంటివి బాలీవుడ్‌ లో భారీ వసూళ్లను రాబట్టాయి. స్ట్రెయిట్‌ చిత్రాలు సైతం వాటి ధాటికి నిలవలేకపోయాయి. ఉత్తరాది, దక్షిణాది పరిశ్రమల మధ్య పోటీ అనే అంశం అలా తెరపైకి వచ్చింది.

కానీ పరిశ్రమలో మాత్రం అలాంటిదేం కనిపించలేదు. పోటీ భావన మనసులో ఉన్నా దాన్ని పక్కనపెట్టి పరస్పరం సహకరించుకుంటూ ఇరుపక్షాలు లాభపడుతున్నాయి. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్‌ చేయడంతో పాటు, ప్రతిభావంతులైన నటీనటులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తున్నారు. దీనివల్ల ఉత్తరాది, దక్షిణాది సినిమా అనే విభజన రేఖ క్రమంగా చెరిగిపోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. హిందీ, దక్షిణాది పరిశ్రమలు పరస్పర ప్రయోజనాల కోసం పోటీని పక్కనపెట్టాయి.

Untitled-2 copy.jpg

కటౌట్‌ను నమ్ముకుంటే పనికాదని అర్థం చేసుకున్న బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మంచి కంటెంట్‌ కోసం దక్షిణాది పరిశ్రమతో చేతులు కలుపుతున్నారు. ఈ అవకాశాన్ని సౌత్‌ పరిశ్రమ అందిపుచ్చుకుంటోంది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను అందించడం ద్వారా బాలీవుడ్‌లో పాగా వేస్తోంది. ఇలా ఉత్తరాది, దక్షిణాది పరిశ్రమలు కలసి పనిచేయడం తెలివైన వ్యూహం అని రుజువైంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీతో కలవడం ద్వారా తెలుగ సినిమాకు సరికొత్త మార్కెట్‌ పరిచయమవుతోంది.


  • మనమంతా ఒక్కటే

అలాగే ఇటీవలే ముంబైలో నిర్వహించిన ఈఫా 2024 వేడుకల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న రానా వేదికపైన ఉన్న షారూఖ్‌ఖాన్‌ పాదాలను తాకి నమస్కరించారు. షారూఖ్‌ వెంటనే రానాను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సమంత కూడా కొన్ని రోజుల క్రితం ఓ ప్రచార కార్యక్రమంలో కరణ్‌ జోహర్‌ పాదాలను తాకి నమస్కరించారు. ఇలాంటి సంఘటనల వల్ల మనమంతా ఒకటే అనే సందేశం బలంగా జనాల్లోకి వెళ్లి మంచి వాతావరణాన్ని సృష్టిస్తోంది.


  • దక్షిణాది అందాలకు అందలం

దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కుతోంది. సౌత్‌ నుంచి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న, సమంత అక్కడ కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ‘ది ప్యామిలీ మాన్‌ 2’ సిరీ్‌సతో హిందీ జనాలకు చేరువయ్యారు సమంత. ఆమె నటించిన ‘హనీ-బన్నీ’ హిందీ సిరీస్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సమంత విషయంలో ఇది కేవలం ఆమె నటన జీవితానికే పరిమితం కాలేదు.

ఆమె విడాకులు తీసుకున్న సమయంలో, అనారోగ్యానికి గురైన సందర్భంలో బాలీవుడ్‌ వర్గాలు ఆమెకు బాసటగా నిలిచాయి. ‘యానిమల్‌’ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో బాలీవుడ్‌లో రష్మిక ప్రభ వెలిగిపోతోంది. అగ్రహీరోల చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌తో ‘సికందర్‌’, విక్కీ కౌశల్‌ సరసన ‘ఛావా’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. గ్లామర్‌ పాత్రల్లో రాణించే బాలీవుడ్‌ హీరోయిన్లకు భిన్నంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ, మంచి విజయాలను దక్కించుకుంటున్నారు. అలాగే ఉత్తరాదిలోనూ వసూళ్ల మోత మోగించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విజయంలో దీపికా పదుకొనే, అమితాబ్‌బచ్చన్‌ స్టార్‌డమ్‌ అక్కరకొచ్చిందనే చెప్పాలి.


  • సత్తా చూపుతున్న దక్షిణాది దర్శకులు

పరాజయాలతో డీలా పడిన బాలీవుడ్‌ స్టార్స్‌ హిట్‌ కొట్టేందుకు దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. షారూఖ్‌ ఖాన్‌కు తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్‌’ చిత్రంతో భారీ విజయాన్ని అందించారు. అలాగే రణ్‌బీర్‌కపూర్‌కు ‘యానిమల్‌’ రూపంలో సాలిడ్‌ హీట్‌ ఇచ్చారు సందీ్‌పరెడ్డి వంగా. అలాగే దక్షిణాది దర్శకులు, హీరోలతో సినిమాలు చేయడం ద్వారా బాలీవుడ్‌ బాక్సాఫీసు దగ్గర లాభపడుతోంది. హృతిక్‌రోషన్‌తో కలసి వార్‌ 2 చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అలాగే రామాయణ్‌లో యష్‌ నటిస్తున్నారు. పలువురు సీనియర్‌ బాలీవుడ్‌ నటులు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో అలరిస్తున్నారు.


  • దేవరతో జిగ్రా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘన విజయం తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా మార్కెట్‌పై గురిపెట్టారు. బాలీవుడ్‌లోనూ ‘దేవర’ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. అక్కడి సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌కు తమవంతు సాయం చేస్తున్నారు. బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహర్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌ కోసం ఓ ఈవెంట్‌ను స్వయంగా నిర్వహించాడు. ‘బ్రహ్మాస్త్ర సినిమా విడుదల సమయంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతగానో సహకరించారు. ఆయన ప్రచారం వల్ల మా సినిమాకు వసూళ్ల పరంగా మంచి లబ్ధి చేకూరింది. తారక్‌ నాకు మంచి ఫ్రెండ్‌. మా అనుబంధం మున్ముందూ కొనసాగుతుంది’ అని కరణ్‌ చెప్పారు. ఇదే కార్యక్రమంలో అలియాభట్‌, ఎన్టీఆర్‌ను కలిపి ఇంటర్వ్యూ చేయడం ద్వారా కరణ్‌ తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘జిగ్రా’ సినిమాకు ప్రచారాన్ని కల్పించారు.

Updated Date - Sep 15 , 2024 | 05:19 AM