Navya : లిటిల్ మాస్టర్ డైవర్
ABN , Publish Date - Jun 30 , 2024 | 11:53 PM
నీరంటే పిచ్చి... స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి.అవే కైనా ఖరేకి ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మాస్టర్ స్కూబా డైవర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
నీరంటే పిచ్చి... స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి.అవే కైనా ఖరేకి ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మాస్టర్ స్కూబా డైవర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.సాహసాలకు వయసుతో పని లేదంటున్న ఈ పన్నెండేళ్ళ బెంగళూరు అమ్మాయి కథేమిటంటే...
‘‘నీటి అడుగున నాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. చెప్పడానికి అనేక విశేషాలున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. వాతావరణం భయానకంగా ఉంటుంది, ఒక్కోసారి ఏదీ కనిపించదు. మనతో కలిసి డైవ్ చేసినవారు కనిపించకుండా పోవచ్చు. వాళ్ళకోసం వెతుకుతూ ఉండాలి. కొన్నిసార్లు చేపలు దాడి చేస్తాయి. ‘‘ఇంత రిస్క్ తీసుకొని, ఈ చిన్న వయసులో ఎందుకీ సాహసాలు?’’ అని ఎందరో అడుగుతూ ఉంటారు. ‘‘ఎందుకంటే... నీళ్ళంటే నాకు పిచ్చి.
డైవింగ్ అంటే ఎనలేని ఆసక్తి. ఇక రిస్క్ అంటారా... రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదం జరగొచ్చు. అందరూ అన్ని వేళలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి’’ అని చెబుతుంది కైనా ఖరే. ఇటీవలే అండమాన్-నికోబార్‌లో ‘మాస్టర్ స్కూబా డైవర్’ సర్టిఫికేషన్ అందుకొని, అధికారికంగా ‘మాస్టర్ డైవర్’గా గుర్తింపు పొందిన ఈ పన్నెండేళ్ళ అమ్మాయి స్వస్థలం బెంగళూరు.
రెండేళ్ళ వయసులోనే కైనాకు ఆమె తల్లితండ్రులు స్విమ్మింగ్‌ను పరిచయం చేశారు. ‘‘కైనాను అందరూ ‘వాటర్ బేబీ’ అని పిలిచేవారు. మా అపార్ట్‌మెంట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతను ఆమెకు పరిచయం చేశాం. అందులో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రెండేళ్ళ కిందట... తనకు పదేళ్ళ వయసులో... మా కుటుంబం అండమాన్-నికోబార్ దీవుల పర్యటనకు వెళ్ళినప్పుడు... స్కూబా డైవింగ్ పరిచయం అయింది. అప్పటి నుంచీ ఆమెకు అదే లోకంగా మారిపోయింది’’ అని చెప్పారు కైనా తల్లి అన్షుమ.
స్విమ్మింగ్ పూల్‌లో కాకుండా... సముద్రం జలాల్లో డైవ్ చెయ్యడం కాస్త భయంగానూ, సరదాగానూ అనిపించింది. స్కూబా డైవింగ్‌లో మరింత నైపుణ్యం కోసం ఇండోనేసియాలోని బాలిలో ‘ఓపెన్ వాటర్ కోర్స్’ చేశాను. అలాగే థాయిలాండ్‌లో ‘అడ్వాన్స్‌డ్ ఓపెన్ వాటర్ కోర్స్ పూర్తి చేసి, సర్టిఫికెట్ అందుకున్నాను’’ అని చెబుతున్న కైనా అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ, స్పెషలైజ్డ్ నిట్రోక్స్ డైవింగ్, రెస్క్యూ డైవర్ ట్రైనింగ్... ఇలా అనేక అంశాల్లో శిక్షణ పొందింది. ‘‘ఇవేవీ సాధారణమైన అంశాలు కావు. కేవలం రెండేళ్ళలోనే వాటన్నిటిలో కైనా నిష్ణాతురాలై... అనుభవజ్ఞులైన స్కూబా డైవర్లను ఆశ్చర్యపరచింది. స్కూబా డైవింగ్‌లో కోర్సులు చేస్తానని కైనా చెప్పినప్పుడు... మొదట్లో మేము సంకోచించాం. కానీ ఆమె పట్టుదలను చూసి... ప్రోత్సహించాం’’ అంటారు అన్షుమ.
సవాళ్ళకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
స్కూబా డైవింగ్‌కు ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తి కావాలి. భద్రతా ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించాలి. దానికి అనుగుణంగా కైమా తల్లితండ్రులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. ‘‘నేను అండమాన్-నికోబార్ దీవులతో పాటు బాలి, మాల్దీవులు, థాయిలాండ్.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో డైవింగ్ చేశాను. ప్రతి ప్రదేశానికీ తనదైన విశిష్టత ఉంది. నీటి అడుగున ఉండే పర్యావరణ వ్యవస్థలన్నా, జీవులన్నా నాకు చాలా ఇష్టం. అన్నిటిన్నా సముద్రపు తాబేళ్ళు నాకు ఫేవరెట్. అవి భారీగా, అద్భుతంగా ఉంటాయి’’ అని అంటోంది కైనా.
స్కూబా డైవింగ్‌లో ఆమె ప్రతిభ... అధికారికంగా ‘మాస్టర్ డైవర్ టైటిల్’ అందుకొనేలా చేసింది. అసాధారణమైన పరిజ్ఞానం, అంకితభావం, నైపుణ్యం ఉన్నవారికి ఈ టైటిల్ ఇస్తారు. తద్వారా ‘ప్రపంచంలో తక్కువ వయసున్న మహిళా మాస్టర్ స్కూబా డైవర్’గా గుర్తింపును సైతం కైనా సొంతం చేసుకుంది. ‘‘సముద్రంలో ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
ప్రత్యేకించి అండమాన్-నికోబార్ దీవుల్లో వాతావరణం భయపెడుతుంది. వర్షాలు, తుపాన్లు హఠాత్తుగా ముంచుకొస్తాయి. అలాంటి వాతావరణంలో ఒకసారి ఒక డైవర్ నీళ్ళలోకి దూకి అపస్మారక స్థితికి చేరాడు. నేను అతన్ని బోట్ వరకూ ఈడ్చుకువచ్చాను. ఆ సంఘటన ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది’’ అంటున్న కైనా ‘‘మెరైన్ సైన్స్ చదవాలనేది నా కోరిక. ప్రపంచంలో వీలైన ప్రతిచోటా స్కూబా డైవింగ్ చెయ్యాలన్నది నా కల’’ అని చెబుతోంది.