Share News

అక్కా చెల్లెళ్ల మ్యూజిక్‌ బస్సు

ABN , Publish Date - Oct 02 , 2024 | 05:34 AM

మొబైల్‌ మ్యూజిక్‌ క్లాస్‌రూమ్‌... పేద పిల్లలకు సంప్రదాయ సంగీతంలో, వాద్య పరికరాల్లో శిక్షణ ఇచ్చేందుకు మురికివాడల్లో తిరిగే స్వరాల బండి.దీనికి సారథులు ముంబయికి చెందిన అక్కాచెల్లెళ్ళు కామాక్షి, విశాల. ఆ కథేమిటంటే...

 అక్కా చెల్లెళ్ల మ్యూజిక్‌ బస్సు

మొబైల్‌ మ్యూజిక్‌ క్లాస్‌రూమ్‌... పేద పిల్లలకు సంప్రదాయ సంగీతంలో, వాద్య పరికరాల్లో శిక్షణ ఇచ్చేందుకు మురికివాడల్లో తిరిగే స్వరాల బండి.దీనికి సారథులు ముంబయికి చెందిన అక్కాచెల్లెళ్ళు కామాక్షి, విశాల. ఆ కథేమిటంటే...

Untitled-2 copy.jpg

ప్రతిరోజూ ముంబయిలోని సంపన్న ప్రాంతనమైన నేపియన్‌ సీ రోడ్డు ప్రాంతం నుంచి రకరకాల డిజైన్లు వేసి ఉన్న పసుపు పచ్చ రంగు బస్సు బయలుదేరుతుంది. పోలీస్‌ క్యాంప్‌, సిమ్లానగర్‌, లోటస్‌ క్యాంప్‌ లాంటి పేదల బస్తీలవైపు పరుగులు పెడుతుంది. ఆ బస్సు రాకకోసం ఆ బస్తీల్లోని పిల్లలు ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. వారంలో ఏడు రోజులు... రోజుకో ప్రాంతానికి వెళ్లే ఈ బస్సు... ఒక సంచార సంగీత పాఠశాల. ఇది కామాక్షి ఖురానా, విశాల ఖురానా అనే అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచన. ‘‘సంగీతం విశ్వ భాష. దానికి కుల, మత, ఆర్థిక, ప్రాంతీయపరమైన వివక్షలేవీ ఉండవు. ఆస్వాదించే హృదయం ఉంటే చాలు. సంగీతం మీద ఆసక్తి ఉన్న సంపన్న, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నేర్చుకొనే స్తోమత ఉంటుంది. మరి... పేదవర్గాల మాటేమిటి? అణగారిన వర్లాల పిల్లలకు సంగీతం మీద మక్కువ పెంచి, గాత్రంలో, వాయిద్యాల్లో శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఈ సంచార సంగీత పాఠశాలను మేము ప్రారంభించాం’’ అంటారు ఆ ఇద్దరూ.

  • వారి వికాసం కోసం...

బాల్యంలోనే వారి జీవితం సంగీతంతో ముడిపడిపోయింది. ‘‘మా నాన్న సంగీతం గురుముఖంగా నేర్చుకున్నారు. నాన్న పాడుతూ ఉంటే ఆయన చుట్టూ తిరుగుతూ మేమూ గొంతు కలిపేవాళ్ళం. మాకు మూడేళ్ళ వయసున్నప్పుడు ఒక టీచర్‌ దగ్గర శిక్షణ కోసం మమ్మల్ని చేర్పించారు. అప్పటి నుంచీ ఇప్పటివరకూ కొత్త రీతులు నేర్చుకుంటున్నాం, సాధన చేస్తున్నాం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో బ్యాచిలర్‌ డిగ్రీకి సమానమైన ‘విశారద’ పూర్తి చేశాం. మరోవైపు సైకాలజీలో డిగ్రీలు తీసుకున్నాం. ఆ తరువాత ఏం చెయ్యాలనే ప్రశ్న ఎదురైంది. ఏది చేసినా అది సంగీతానికి సంబంధించినదే అయి ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ‘సౌండ్‌ స్పేస్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశాం.


విద్య, ఆరోగ్యం, కార్పొరేట్‌ రంగాల కోసం వివిధ కార్యక్రమాలు రూపొందించాం. సైకాలజీ చదివాం కాబట్టి మానసిక సమస్యలు, ఒత్తిడులు, వాటి పరిణామాల గురించి మాకు తెలుసు. వాటి పరిష్కారానికి సంగీతాన్ని సాధనంగా ఉపయోగించడం... ‘సౌండ్‌ స్పేస్‌’ ప్రధాన కాన్సెప్ట్‌’’ అంటారు కామాక్షి, విశాల. ఆసక్తి ఉన్నవారెవరైనా సంగీతం నేర్చుకోవడానికి అనువుగా మాడ్యూల్స్‌, ప్రోగ్రామ్స్‌ చర్చా కార్యక్రమాలు, ప్రదర్శనలకు వారు రూపకల్పన చేశారు. పాఠశాలల్లో పిల్లల అభ్యసన సామర్థ్యం పెరగడానికి, అదే సమయంలో సంప్రదాయ సంగీతంలోని సౌందర్యం వారికి పరిచయం చెయ్యడానికి వీలుగా మ్యూజిక్‌, సైకాలజీ బోధన కోసం ఒక ప్రణాళికను తయారు చేశారు.

ఇప్పుడు ముంబయి వ్యాప్తంగా ఎన్నో పాఠశాల్లో ఈ ప్రణాళిక అమలు అవుతోంది. అలాగే ఉద్యోగులలో నెలకొన్ని ఒత్తిడి తగ్గడానికి, రోగుల్లో స్వస్థత చేకూర్చడానికి కూడా ప్రోగ్రామ్స్‌ తయారు చేశారు. ‘‘మేము పలు ఆసుపత్రులు, కార్పొరేట్‌ సంస్థలతో పాటు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాం. గుర్తింపు కూడా బాగానే ఉంది. కానీ మురికివాడల్లో పిల్లలను చూస్తే బాధ కలిగేది. మాకు అందుబాటులో ఉన్న పిల్లలందరి జీవితాల్లో సంగీతాన్ని నింపి, వారి వికాసానికి దోహహదపడాలని అనిపించింది. అందుకే ‘ది సౌండ్‌ స్పేస్‌ ఆన్‌ వీల్స్‌... ఎ మొబైల్‌ మ్యూజిక్‌ క్లాస్‌రూమ్‌’ను ప్రారంభించాం అని చెప్పారు కామాక్షి.


  • జీవిత పాఠాలు కూడా...

కిందటి ఏడాది ఆగస్టులో... వర్లీలోని లోటస్‌ కాలనీలో మొదటి సంగీత తరగతి నిర్వహించారు. ఆ తరువాత... వారంలో ఏడు రోజులపాటు ఏడు బస్తీల్లో ఈ బస్సు తిరుగుతోంది. అందులో సంగీత పరికరాలు ఉంటాయి. మొత్తం ఆరుగురు ఇనస్ట్రక్టర్స్‌ పని చేస్తున్నారు ప్రస్తుతం అయిదు నుంచి పదిహేనేళ్ళ మధ్య వయసున్న పిల్లలు... 500 మందికి పైగా ఈ క్లాసులకు వస్తున్నారు. ప్రతి తరగతిలో పాతిక మంది విద్యార్థులుంటారు. కనీసం నలభై నిమిషాలపాటు బోధన, యాక్టివిటీస్‌ ఉంటాయి. కేవలం సంగీత పాఠాలే కాదు, జీవిత పాఠాలు, మన సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా ఈ సంచార పాఠశాలలో చెబుతున్నారు.

‘‘సామాజికంగా వెనుకబడి ఉన్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇది దోహదపడుతోంది. వాళ్ళు తరగతులు మానెయ్యడం చాలా అరుదు. స్థోమత ఉన్నవారికి దొరికే చాలా సౌకర్యాలకు వారు దూరంగా ఉంటారు. మావంతుగా ఈ పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అంతకుముందు బడికి వెళ్ళడానికి ఇష్టపడని పిల్లలు కూడా మా ఇనస్ట్రక్టర్స్‌ ప్రోత్సాహంతో బాగా చదువుతున్నారు. చాలామంది మ్యుజీషియన్స్‌ కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం దాతల ద్వారా, క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఈ బస్సు నడిపిస్తున్నాం. భవిష్యత్తులో అన్ని ప్రధాన నగరాలకు ఈ కాన్సె్‌ప్టను తీసుకువెళ్ళాలని, ఇలాంటి సంచార పాఠశాలలు మరిన్ని నడపాలని మా కోరిక’’ అంటున్నారీ సోదరీమణులు.

Updated Date - Oct 02 , 2024 | 05:34 AM