Share News

Kattu Pongali : పుష్టిని ఇచ్చే ‘పులగం’

ABN , Publish Date - Sep 14 , 2024 | 12:45 AM

కట్టు పొంగలి చాలా మందికి ఇష్టమైన వంటకం. దీన్నే మన వాళ్లు పులగం అని కూడా పిలుస్తారు. ఈ పులగం వెనక చాలా కథే ఉంది.

Kattu Pongali : పుష్టిని ఇచ్చే ‘పులగం’

ట్టు పొంగలి చాలా మందికి ఇష్టమైన వంటకం. దీన్నే మన వాళ్లు పులగం అని కూడా పిలుస్తారు. ఈ పులగం వెనక చాలా కథే ఉంది.

కట్టు పొంగలి అంటే కారపు పాయసం అని అర్థం. వాస్తవానికి ‘పుల’ అనే తెలుగు పదానికి బంగారం అని అర్థం. బంగారపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ పొంగల్‌ను పులగం అని కూడా పిలుస్తారు. ఇక పులగాన్ని సంస్కృతంలో కృశరా అంటారు. దీని అర్థం కూడా బంగారపు రంగులో ఉండేదనే! శుభకార్యాలు.. దైవ కార్యాలలో దీనిని వండి నైవేద్యంగా పెట్టి ప్రసాదం పంచుతారు.

‘అనంగత్రయోదశి వ్రతం’ లాంటి సందర్భాల్లో పులగాన్నే నైవేద్యంగా పెడతారు. నందికేశుడి నోములోనూ, నవరాత్రుల్లోనూ పులగం తప్పనిసరిగా ఉంటుంది. మనుస్మృతి... బియ్యం, నువ్వులు, పెసరపప్పు కలిపి పాలు పోసి పులగం వండుతారని పేర్కొంది. ఇక పులగం తయారీలో కూడా పరిణామ క్రమం ఉంది.

దక్షిణాదిలో అల్లం, ఇంగువ, మిరియాలు జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు తాలింపు పెట్టే ఆచారం మొదలైతే.. ఉత్తరాదిలో రకరకాల కూరగాయల ముక్కలు ఉడికించి కలిపి కృశరాన్నాన్ని కిచిడీగా మార్పు చేసుకున్నారు. కృశరా లేదా పులగం గురించి యోగరత్నాకరం, భోజన కుతూహలం, క్షేమకుతూహలం లాంటి పాకశాస్త్ర గ్రంథాలు పులగాన్ని ఎలా చేసుకోవాలో వివరంగా ఇచ్చాయి. క్షేమశర్మ క్షేమకుతూహలంలో పులగం తయారీ గురించి ఇలా పేర్కొన్నాడు.

‘‘తండులైః షష్టి సంభూతైః కండితైర్నచ ఖండితైః.. అష్టభాగవృతైర్మూదగై సంయుక్తైద్వార్ద శాంశకైః’’

12 భాగాల బియ్యానికి 8 భాగాల పెసరపప్పు తీసుకోవాలి. బియ్యాన్ని నీళ్లలో కాసేపు నాననిచ్చి .. బాగా కడిగి ఇత్తడి గిన్నెలో గానీ కుండలోగానీ తీసుకుని తగినన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి అత్తెసరు అన్నం వండాలి.

‘‘సార్ర్దాన్రార్దా సుసంధానా సబాహ్లీకా వరాన్వితా! సస్నేహా కామినీవేయం కృశరా శిశిరే హితా!

పెసరపప్పు, బియ్యం కలిపిన అన్నం ఉడుకుతుండగా, బాగా కండపట్టిన పచ్చి అల్లాన్ని చిన్ని ముక్కలుగా తరిగి కలపాలి. పసుపు, ఇంగువ, సైంధవలవణం, నెయ్యివేసి సన్నసెగన ఉడకనివ్వాలి. పొయ్యి మీంచి దింపబోయే ముందు, మిరియం, జీలకర్రల్ని పైపైన దంచి, కరివేపాకు చేర్చి వేగనిచ్చి నేతితాలింపు పెడితే కమ్మగా ఉంటుంది. ఇలా చేస్తే చలికాలంలో ప్రియురాలులా సుఖాన్ని స్తుందీ పులగం.


‘‘కృశరా దుర్జరా బల్యా గుర్వీ వాతవినాశినీ! బలపుష్టిమలశ్లేష్మపిత్తవిష్ఠంభకృత్సరా!’’

వండిన పెసరముద్దపప్పుని అన్నంలో కలుపుకోవటానికి.. బియ్యమూ పెసరపప్పు కలిపి వండినదానికి తేడా ఏమిటనే ప్రశ్న తప్పక వస్తుంది. పప్పు అన్నంలో పెసరపప్పు గుణాలు మాత్రమే ఉన్నాయి. దాన్ని పులగంగా వండితే అది బంగారం లాంటి ఆహారపదార్థం అవుతుంది. ఇది ఆకలిని తీరుస్తుంది. ఉదయమే తింటే మధ్యాహ్నం దాకా దండిగా ఉంటుంది.

ఇది బరువైన ఆహారం. మంచి నెయ్యితో వండుకుంటే తేలికగా అరుగుతుంది. మిరియాలు జీలకర్ర, సైంధవలవణం తేలికగా అరిగించేందుకు సాయపడతాయి. భయంకర వాత వ్యాధులున్నవారికి ఇది మంచి ఔషధంగా ఉపయోగపడ్తుంది. చర్మం గరుకుబారి ముడతలు పడి ముసలితనం ముంచుకొచ్చినట్టు కావటాన్ని ఇది అరికడుతుంది. కూరగాయల్లేని వంటకం కాబట్టి ఇందులో ఫైబర్‌ తక్కువ కాబట్టి విరేచనం కావటానికి ఇది సహకరించకపోయినప్పటికీ, పేగుల్ని మృదువు పరుస్తుంది. జీర్ణశక్తికి కావలసిన స్రావాలు పేగుల్లోకి విడుదల అయ్యేలా చేస్తుంది.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Sep 14 , 2024 | 12:48 AM