Share News

Hot Topic : అవి ప్లాస్టిక్‌ మెరుపులేనా..!

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:44 AM

సినీ ప్రపంచంలో విమర్శల స్థానాన్ని నేడు ట్రోల్స్‌ ఆక్రమించేశాయి. రూపురేఖలను, ముఖ కవళికలనూ మునుపటి ఫొటోలతో పోల్చి తేడాలను ఎత్తి చూపి, ప్లాస్టిక్‌ సర్జరీ ట్యాగ్‌ను తగిలించడం, వాటికి సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం పరిపాటిగా మారింది

Hot Topic : అవి ప్లాస్టిక్‌ మెరుపులేనా..!

హాట్‌ టాపిక్‌

సినీ ప్రపంచంలో విమర్శల స్థానాన్ని నేడు ట్రోల్స్‌ ఆక్రమించేశాయి. రూపురేఖలను, ముఖ కవళికలనూ మునుపటి ఫొటోలతో పోల్చి తేడాలను ఎత్తి చూపి, ప్లాస్టిక్‌ సర్జరీ ట్యాగ్‌ను తగిలించడం, వాటికి సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం పరిపాటిగా మారింది. అలా తాజాగా ట్రోలింగ్‌ బారిన పడిన తారలు, వారి ప్రతిస్పందన గురించి తెలుసుకుందాం!

వెండి తెరల వినోదాన్ని పండించే తారలకు సైతం ట్రోలింగ్‌ తిప్పలు తప్పడం లేదు. అంతకంతకూ స్పష్టతను పెంచుకుంటున్న కెమెరా కళ్లు, వీటికి తోడవుతున్న కృత్రిమ మేథస్సులు అగ్ర తారల అందాలను అనుమానించే అవకాశాలను కల్పిస్తున్నాయి. నిజానికి తరగని వన్నెతో ఆకర్షణీయంగా కనిపించడం కోసం తారలు వాళ్లకు నచ్చిన మార్గాలను ఎంచుకోవడంలో తప్పు లేదు. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత విషయం. అయినప్పటికీ వేళ్ల కొసల్లో ఉండే ఇంటర్నెట్‌తో ఇష్టారాజ్యంగా ట్రోల్‌ చేసేయడం నెటిజన్లకు కాలక్షేపంగా మారిపోయింది. అందరి దృష్టినీ ఆకర్షించడం లేదా తారలను మనోవేదనకు గురి చేయడం... ఇలా ట్రోలింగ్‌ లక్ష్యం ఏదైనా, దానికి అడ్డుకట్ట వేయడం ఎవరి తరం కావడం లేదు. అందుకే ఆ పనికి తారలే స్వయంగా నడుం బిగిస్తున్నారు. తమపై వస్తున్న ట్రోల్స్‌కు ధీటుగా సమాధానాలివ్వడం మొదలుపెట్టారు. అలాంటి అగ్రతారల్లో వీళ్లు కొందరు.


  • అందులో ఆశ్చర్యం లేదు

ఈ తార పాత కొత్త ఫొటోలను సరిపోల్చుతూ, ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందనే ట్రోల్స్‌ ఇంటర్నెట్‌లో షికార్లు చేయడం మొదలుపెట్టాయి. నయనతార ముఖకవళికలు మారిపోయాయనీ, ఆమె కనుబొమలు కూడా తరచూ మారుతూ ఉంటాయనీ వీటికి కారణం ఆమె తరచూ ప్లాస్టిక్‌ సర్జరీని ఆశ్రయించడమేననీ, నెటిజన్లు పదే పదే ట్రోల్‌ చేస్తూ ఉండడంతో, నయనతార స్పందించక తప్పలేదు. ‘‘గత కొన్నేళ్లుగా నా కనుబొమలు ఎన్నో మార్పులకు లోనయ్యాయి. ఇందుకు కారణం కాలంతో పాటు నా ముఖాకృతి కూడా మార్పులకు లోనవుతూ ఉండడమే! ముఖాకృతి మారిన ప్రతిసారీ కనుబొమల ఆకృతి మారడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ముఖం కూడా భిన్నంగా కనిపిస్తూ ఉండడంతో, నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్టు భ్రమ పడడం పరిపాటిగా మారుతోంది.కానీ ఇది నిజం కాదు. నేను తరచూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాను. దాంతో బుగ్గలు లోపలకి వెళ్లిపోతూ ఉంటాయి. మీరు నన్ను గిచ్చి చూసినా, కాల్చి చూసినా నాలో ఇసుమంత ప్లాస్టిక్‌ కూడా మీకు కనిపించదు’’ అంటూ ట్రోల్స్‌కు ఘాటుగా స్పందించింది నయనతార.


Untitled-1 copy.jpg

  • హెచ్చరిక..!

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలు ట్రోల్స్‌కు దన్నుగా మారుతూ ఉంటాయని గ్రహించిన ప్రియాంకా చోప్రా, ఒక సరికొత్త టెక్నిక్‌ను కనిపెట్టింది. తాజాగా తన చిన్ననాటి ఫొటోతో పాటు మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్నప్పటి ఫొటోను షేర్‌ చేస్తూ, ట్రోల్‌ చేసేవాళ్లకు ఒక చిన్న చురక అంటించింది. చిన్ననాటి ఫొటో గురించి ట్రోల్‌ చేయొద్దని హెచ్చరిస్తూ ప్రియాంక పోస్ట్‌లో ఇలా రాసుకుంది. ‘‘హెచ్చరిక: తొమ్మిదేళ్లనాటి నన్ను ట్రోల్‌ చేయొద్దు. ఎడమ వైపున ఉన్నది టీనేజ్‌కు ముందు నాటి ఫొటో. బడికెళ్లే రోజుల్లో నేనలా బాయ్‌కట్‌తో ఉండేదాన్ని. ఆ కటోరి కట్‌ నుంచి ఇదిగో ఎడమ వైపున ఉన్న ఈ ఫొటోలో కనిపించే 17 ఏళ్ల టీనేజర్‌గా ఎదిగాను. అది 2000 సంవత్సరంలో మిస్‌ ఇండియా పోటీలో గెలిచిన నాటి ఫొటో. ఆ రెండు ఫొటోలు ఒక దశాబ్దం వ్యవధిలో తీసినవే అయినా, రెండింట్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నా సినీ ప్రయాణం నన్నెంతో దూరం తీసుకొచ్చింది. అయినా ఇప్పటికీ అందరిలాగే ఇప్పటికీ నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను’’ అంటూ పోస్ట్‌ చేసింది ప్రియాంక.


Untitled-1 copy.jpg

  • చాలా పెద్ద తప్పిదం...

ఆలియా చేయించుకున్న కరెక్టివ్‌ సర్జరీ ఫెయిల్‌ అయిపోయింది కాబట్టే నవ్వినప్పుడు ఆమె ముఖం విచిత్రంగా మారిపోతోందని, ఒక కాస్మటాలజిస్ట్‌ యూట్యూబ్‌ వీడియోలో ఆలియాను ట్రోల్‌ చేశాడు. దాంతో ఆలియా ఇన్‌స్టా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. ఆ పోస్ట్‌లో ఆలియా... ‘‘ఒకరి రూపురేఖల గురించి,ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యే ఇలాంటి అసంబద్ధమైన, నిరాధారమైన కామెంట్లు యువత మనసుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో ట్రోల్‌ చేస్తున్న వ్యక్తులు గ్రహించకపోవడం విషాదకరం. నేను చేయించుకున్న బొటాక్స్‌ వికటించిందనే ఒక వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు శాస్త్రీయ వివరణలను జోడిస్తూ, నా ముఖం సగభాగం పక్షవాతానికి గురైందని కూడా విమర్శించాడా ప్రబుద్ధుడు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ఇలా ఒకరి రూపురేఖల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద తప్పిదం. అసలు ఇలాంటి చెత్త పుకార్లను నమ్మేదెవరు? లైక్స్‌, షేర్స్‌ కోసం ఇలాంటి పుకార్లను సృష్టించేవాళ్లు వీటిని అందరూ అంత తేలికగా నమ్మరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’’ అంటూ స్పందించి ఆలియా.


Untitled-1 copy.jpg

  • రసాలూరే పండైనా...

సూపర్‌ సినిమాలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన అయేషా, వెండి తెర మీద అలా తళుక్కున మెరిసి ఇలా అంతర్థానమైపోయింది. అయినా ఇంటర్నెట్‌ ఆమె సంగతులు, విశేషాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే ఉంది. తాజాగా అయేషా టకియా రూపురేఖల గురించి కూడా ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఫుల్లర్‌ లిప్స్‌, ఫుల్లర్‌ చీక్స్‌ ప్లాస్టిక్‌ సర్జరీ ఫలితమేనంటూ సోషల్‌ మీడియా ఆమెను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. అయేషా ఆ ట్రోల్స్‌కు సమాధానంగా, సుప్రసిద్ధ బుర్లెస్క్‌ డాన్సర్‌, మోడల్‌, డీటా వాన్‌ టీసీ మోటివేషనల్‌ కోట్‌ను పోస్ట్‌ చేసింది. ఆ కోట్‌ ఏంటంటే... ‘‘నువ్వు ప్రపంచంలోనే అత్యంత తీయని, రసాలూరే పండువి అయినా, నిన్ను అసహ్యించుకునే వాళ్లు ఈ ప్రపంచంలో ఉంటూనే ఉంటారు’’. ట్రోల్స్‌కు చెక్‌ పెట్టాలనే ఉద్దేశం ఈ పోస్ట్‌లో కనిపించకపోయినా, మనమెలా ఉన్నా ట్రోల్‌ చేసే స్వభావమున్న వాళ్లు ట్రోల్‌ చేస్తూనే ఉంటారన్నది అయేషా ఉద్దేశమని అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Nov 02 , 2024 | 12:53 AM