Navya : సర్వోన్నత శక్తి ప్రదాత
ABN , Publish Date - May 16 , 2024 | 11:34 PM
పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. అతను అమరత్వం పొందాలనే కోరికతో... బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేశాడు.
హరేకృష్ణ
21 న నృసింహ జయంతి
పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. అతను అమరత్వం పొందాలనే కోరికతో... బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ వరాలతో అమిత శక్తిసంపన్నుడయ్యాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. ధర్మబద్ధంగా విశ్వాన్ని పాలిస్తున్న దేవతలందరినీ తరిమికొట్టాడు. అత్యంత క్రూరంగా లోకాన్ని పాలించసాగాడు. దేవదేవుడైన శ్రీమహావిష్ణువును, ఆయన పరమోన్నత స్థానాన్ని ధిక్కరించి...
అందరూ తననే దేవదేవుడిగా కొలవాలని ఆదేశించాడు. వైదిక సదాచారాలను, నిత్యక్రతువులను సర్వ నాశనం చేస్తూ, సొంత పద్ధతులను ప్రవేశపెట్టాడు.
హిరణ్యకశిపుడి తనయుడైన ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు. అయిదేళ్ళ పసిప్రాయంలోనే మహా భాగవతోత్తముడి స్థాయికి చేరుకున్నాడు. తను విరోధిగా భావించే శ్రీహరిని తన కుమారుడు సేవించడాన్ని హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. విష్ణు భక్తిని ప్రహ్లాదుడు విడనాడేలా పలు చర్యలు చేపట్టి విఫలుడయ్యాడు. మరోవైపు ప్రహ్లాదుడి సాంగత్యం వల్ల అతనితో చదువుతున్నవారందరూ విష్ణుభక్తిని పెంపొందించుకోసాగారు.
ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన హిరణ్య కశిపుడు ‘‘ఇవాళ నిన్ను యమపురికి పంపిస్తాను’’ అంటూ ప్రహ్లాదుడిపై తీవ్రంగా ఆగ్రహించాడు. ‘‘ఎవరి శక్తితో నువ్వు ఇంత మూర్ఖంగా, మొండిగా, భయం లేనివాడిలా ఉంటున్నావు? నేను శాసించినా ఎందుకు లెక్క చెయ్యడం లేదు?’’ అని ప్రశ్నించాడు.
ప్రహ్లాదుడు బదులిస్తూ ‘‘మీరు ఎవరి ద్వారా శక్తియుక్తులు పొందుతున్నారో... నా శక్తికి కూడా అతడే మూలాధారం. అతడే సకల శక్తులకూ మూలమైన పరంధాముడు... శ్రీహరి’’ అని వినయంగా చెప్పాడు.
ప్రహ్లాదుడి మాటలకు ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ‘‘నీవు నిరంతరం ఎవడినో నన్ను మించిన ఉత్తముడైనవాడంటూ... సమస్త సృష్టికీ అతీతుడు అంటూ, చరాచర జీవులను నియంత్రిస్తాడంటూ సర్వాంతర్యామిగా వర్ణిస్తూ ఉంటావు. ఎవడు వాడు? ఎక్కడున్నాడు? వాడే సమస్తంలోనూ ఉన్నట్టయితే... నా ముందున్న ఈ స్తంభంలో చూపించగలవా?’’ అని అడిగాడు.
హిరణ్యకశిపుడి మాటల్లో ఈ ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అతను తనను తాను ఎల్లప్పుడూ తానే పరమేశ్వరుణ్ణని చెప్పుకున్నప్పటికీ... నిజమైన పరమేశ్వరుడు ఎవరో ప్రహ్లాదుడికి తెలుసు. విష్ణువు లేదా కృష్ణుడే ఆ పరమేశ్వరుడని ‘యస్మాత్ క్షరమతీతో...’ అనే శ్లోకంలో...‘‘ నేను (శ్రీకృష్ణుడు) నశ్వరమైన ఈ భౌతిక పదార్థం కన్నా, నాశరహితమైన జీవాత్మకన్నా అతీతీతమైనవాణ్ణి. కాబట్టి వేదాలలో, స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా ప్రశంస పొందాను’’ అని ‘భగవద్గీత’ చెబుతోంది.
సర్వవ్యాప్తుడైన భగవంతుడు ఆ స్తంభంలో కూడా తప్పక ఉన్నాడని ప్రహ్లాదుడు నిస్సంకోచంగా సమాధానం ఇచ్చాడు. అది విన్న హిరణ్యకశిపుడు వెంటనే తన సింహాసనం నుంచి లేచి... పిడికిలితో స్తంభాన్ని పగలగొట్టాడు. ఆ స్తంభం నుంచి నర-మృగ... శరీరంతో నరసింహావతారుడై స్వామి ఆవిర్భవించాడు.
స్తంభోద్భవుడైన ఆ నరసింహుని దివ్య సుగుణం అదే. హిరణ్యకశిపునికి తన భక్తుడైన బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను ఎన్నటికీ నిష్ఫలం కావించలేదు. ఆ వరాలలో లేని రూపాన్ని పొందాడు. భగవంతుడికి సైతం క్రోధం ఉండడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సర్వోన్నతమైన శక్తికీ ఒక రూపం ఉందనీ, ఆ రూపం సమస్త భావాలకూ నిలయమనీ అందరూ తెలుసుకోవాలి. ఏ నేరం ఎరుగని ప్రహ్లాదుడి పట్ల హిరణ్యకశిపుడు క్రూరంగా వ్యవహరించినందుకు భగవంతుడు కోపోద్రిక్తుడయ్యాడు. సర్వానికీ మూలాధారమైన ఆ భగవంతుడే ప్రేమ, క్రోధం అనే భావాలకు కూడా మూలం.
మనం అందరం ఆ పురుషోత్తముని అంశలం కాబట్టే మనలోనూ ఆ భావాలు ఉన్నాయి. కానీ మనలోని క్రోధం దుష్పరిణామాలకు హేతువైనది కాగా, భగవంతునిలోని క్రోధం ఆరాధనీయమైనది. ఇదే మనకూ, భగవంతుడికీ ఉన్న వ్యత్యాసం.
హిరణ్యకశిపుడు తన తెలివితేటలతో మృత్యువును జయించాలని తలచినా... భగవంతుడు అంతకుమించిన తెలివితో.. తగిన రూపాన్ని ధరించాడు. అతని ముందు మృత్యువై నిలిచాడు. భగవంతుణ్ణి ఎందులోనూ, ఎవరూ జయించలేరు.
‘సర్వోన్నతుడు’ అనే మాటకు అర్థం అదే.భగవంతుడు సర్వాంతర్యామి అనీ, రాజమందిరంలోని స్తంభంలో సైతం భగవంతుడు ఉన్నాడని చెప్పిన ప్రహ్లాదుడి మాటలను నిరూపించడానికే... దేవదేవుడైన శ్రీహరి అంతకుముందు నృసింహ రూపంలో అవతరించాడని ‘శ్రీమద్భాగవతం’ వివరిస్తోంది.
ఆ నరసింహుడు తన భక్తులకు దుష్టులైన శత్రువుల నుంచి పొంచిఉన్న ఆపదల నుంచి సదా రక్షించాలనీ, మనలోని దుష్ట గుణాలనుంచి మనల్ని కాపాడాలనీ ప్రార్థిస్తూ...ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే, ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్రకర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా, అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్షౌమ్... అనే ‘శ్రీమద్భాగవతం’లోని నృసింహ మంత్రాన్ని ఈ నృసింహ జయంతినాడు పఠిద్దాం.
‘‘సమస్త శక్తికీ ములాధారమైన నృసింహ భగవానుడికి నా ప్రణామాలు. ఓ స్వామీ! వజ్రాయుధం లాంటి నీ గోళ్ళతో, దంతాలతో... ప్రాపంచిక కర్మలను కాంక్షించే మాలోని అసుర గుణాలను నశింపజేయి. మా హృదయంలో నెలకొన్న అజ్ఞానాన్ని పారద్రోలి మమ్మల్ని అనుగ్రహించు. అప్పుడు నీ కృపతో మేము ఈ భౌతిక ప్రపంచంలో సాగించే జీవన పోరాటంలో నిర్భయత్వాన్ని పొందగలం’’ అని దీని అర్థం.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984