లవ్ అడిక్షన్
ABN , Publish Date - Jun 20 , 2024 | 12:02 AM
డాక్టర్! మా అబ్బాయికి 25 ఏళ్లు. ఎంతో మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఏ అమ్మాయితో ఉన్నా, ఆ అమ్మాయే లోకంగా జీవిస్తూ, మమ్మల్నీ, చదువునీ, బాధ్యతలనూ వదిలేస్తూ...
కౌన్సెలింగ్
డాక్టర్! మా అబ్బాయికి 25 ఏళ్లు. ఎంతో మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఏ అమ్మాయితో ఉన్నా, ఆ అమ్మాయే లోకంగా జీవిస్తూ, మమ్మల్నీ, చదువునీ, బాధ్యతలనూ వదిలేస్తూ ఉంటాడు. అబ్బాయి ధోరణితో మాకు భయంగా ఉంది. జీవితంలో వెనకపడిపోతాడేమో నని ఆందోళనగా కూడా ఉంది. ఇలాంటి ప్రవర్తన సాధారణమైనదేనా? - ఓ సోదరి, హైదరాబాద్.
మద్యం, మాదకద్రవ్యాల మాదిరిగానే ప్రేమను వ్యసనంగా మలుచుకునే వాళ్లు ఉంటారు. మీ అబ్బాయి ఆ కోవకు చెందినవాడేనని అనిపిస్తోంది. ఎలాంటి వ్యసనపరులైనా వారి బాల్యంలో ఏదో ఒక ట్రామా (మానసిక గాయం)ను ఎదుర్కొని ఉంటారు. నిర్లక్ష్యానికి గురవడం లేదా హింస (లైంగిక, మానసిక, శారీరక)కు గురయి ఉంటారు, లేదా తల్లితండ్రులు పట్టించుకోకుండా వదిలేయడం, తల్లితండ్రుల నుంచి తగినంత ప్రేమ దక్కకపోవడం, విపరీతమైన ఒత్తిడుల మధ్య పెరగడం, లేదా ఇంకేదైనా ట్రామాకు గురవడం జరిగి ఉంటుంది. ప్రేమ వ్యసనపరులుగా మారడానికి ప్రధాన కారణం బాల్యంలో వారి మీద జరిగిన లైంగిక దాడులే! బాల్యంలో ఎలాంటి ట్రామాకు గురైనా పెరిగి పెద్దయ్యాక ఆరోగ్యకరమైన సామాజిక అనుబంధాలు ఏర్పరుచుకోవడంలో వీళ్లకెప్పుడూ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అనుబంధాలు ఏర్పరుచుకోవడంలో భయం కూడా కొందర్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన అనుబంధాలు ఏర్పరుచుకునే మెలకువల లోపానికి బాల్యంలోనే బీజాలు పడితే అవి వయసుతోపాటు పెరిగి, భవిష్యత్తులో లవ్ అడిక్షన్‌కు కచ్చితంగా దారి తీస్తాయి. బాల్యం లేదా యుక్తవయసులో గురయ్యే ట్రామాల వల్ల ఆత్మన్యూనత, డిప్రెషన్, ఆందోళన మొదలైన మానసిక సమస్యలు తలెత్తి, వాటి ఫలితంగా లవ్ అడిక్షన్‌కు గురయ్యే అవకాశాలూ ఉంటాయి. లవ్ అడిక్ట్స్....
అవమానం, భయం, డిప్రెషన్, ఆందోళన మొదలైన ఇబ్బందికరమైన భావోద్వేగాల ప్రభావం అనుభవం కాకుండా ఉండేలా మొద్దుబారడం కోసం ప్రేమ అనే ఊహాలోకంలో విహరించడం బాల్యం నుంచే అలవరుచుకుంటారు. ఇందుకోసం ప్రేమలోకి తోసేందుకు ఉపయోగపడే మెదడులో న్యూరోకెమికల్స్ ఉధృతిని పెంచుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే... ఒక లవ్ అడిక్ట్‌కి ఎవరైనా ఆకర్షణీయంగా కనిపిస్తే, వాళ్లతో తమ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందోనని ఊహించుకుంటూ, ఆ క్రమంలో తనకు, ఎదుటి వ్యక్తికి ఎదురయ్యే వీలుండే ఇబ్బందులు, సమస్యల గురించిన ఆలోచనలను పక్కన పెట్టేస్తాడు. అయితే ఇతర వ్యసనపరులు కూడా ఇలాంటి లక్ష్యాన్నే.. డ్రగ్స్ వాడడం, జూదం ఆడడం, వీడియో గేమ్స్ అడడం, డబ్బులు ఖర్చుపెట్టడం, సెక్స్ లేదా ఇతర వ్యసనాలకు లోను చేసే పదార్థాల ఆధారంగా అందుకుంటారు. ఇలా తనంతట తానుగా మెదడులో పెంచుకునే న్యూరోకెమికల్ రియాక్షన్ వల్ల క్రమేపీ జీవితంలోని ఇబ్బందుల నుంచి గట్టెక్కే మెలకువలనూ అలవరుచుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రేమ వ్యసనపరులు వెతుకులాడేది ప్రేమ కోసం కాదు, తమ భావోద్వేగాలను అదుపు చేయగల సాధనం కోసమే!
లవ్ అడిక్షన్ లక్షణాలు
సాధారణంగా ప్రేమ వ్యసనం పురుషులకంటే స్త్రీలకే ఈ సమస్య ఎక్కువ అనుకుంటే పొరపాటు. ఇద్దర్లోనూ ఈ సమస్య ఉంటుంది. లవ్ అడిక్షన్‌లో ఉన్న వ్యక్తుల ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి. అవేంటంటే...
లైంగిక సంబంధాన్ని ప్రేమానుబంధం, అంతే లేని అనురాగ బంధం అనుకోవడం
ఎవరితోనూ రిలేషన్‌షి్‌పలో లేకపోతే ఒంటరిగా భావిస్తూ, అనుబంధం కోసం వెంపర్లాడడం
ఆ కొత్త రిలేషన్‌షిప్ వెతుకులాటలో ఆత్మీయులు, కుటుంబీకులు, స్నేహితుల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం
ఒక రిలేషన్‌షి్‌పలో ఉండగానే వేరొక అనుబంధం కోసం వెతుకుతూ ఉండడం
నడుస్తున్న రిలేషన్‌షి్‌పను లైంగికంగా/ప్రేమపరంగా మరింత దృఢంగా ఉంచడం కోసం పరితపించడం
ఉన్న భాగస్వామిని పోగొట్టుకోకుండా ఉండే /ఒక కొత్త వ్యక్తితో రిలేషన్‌షి్‌పలోకి అడుగు పెట్టే క్రమంలో ఇతర పనుల మీద ఆసక్తి కనబరచకపోవడం
మానసిక భావోద్వేగాలు, ఇతరత్రా ఒత్తిడికి లోను చేసే ఏ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికైనా ప్రేమ మీద ఆధారపడడం
ఏది ఏమైనా లవ్ అడిక్ట్స్ తమ సమయాన్నంతా ఉన్న రిలేషన్‌షి్‌పని నిలిపి ఉంచుకోవడానికి లేదా కొత్త రిలేషన్‌షి్‌పలో మునిగిపోవడానికే కేటాయిస్తూ ఉంటారు. వీళ్ల ప్రపంచమంతా ‘ప్రేమ’ చుట్టూనే తిరుగుతుంది. తినే తిండి మొదలు, వేసుకునే దుస్తులు, చేసే ఉద్యోగం, కాలక్షేపం కోసం వెళ్లే ప్రదేశాలు... ఇలా ప్రతిదీ తమని పరిపూర్ణం చేసే ఒక ‘పర్‌ఫెక్ట్’ పార్ట్‌నర్‌ని దొరకబుచ్చుకునే వీలుండే మార్గాల్లోనే కూర్చబడుతూ ఉంటుంది. మీ అబ్బాయి ఈ కోవకే చెందుతాడు కాబట్టి మానసిక నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించడం అవసరం.
డాక్టర్ కల్యాణ చక్రవర్తి, క్లినికల్ సైకాలజిస్ట్,
ల్యూసిడ్ డయాగ్నొస్టిక్స్, హైదరాబాద్.