Share News

Navya's Kitchen: వాక్కాయ షర్బత్‌

ABN , Publish Date - Jul 06 , 2024 | 06:01 AM

వాక్కాయని ‘వాక కాయ’ అంటారు. ‘వాకం’ అంటే అనుకూలంగా పని చేసేదని. పొదలాగా ఎత్తుగా పెరిగే ముళ్లతో కూడిన అడవి మొక్క ఇది. రోడ్డు పక్కన కూడా పెరుగుతుంది.

Navya's Kitchen: వాక్కాయ షర్బత్‌

లవంగార్ద్రక సంయుక్తం సుపిష్టం వారిణాయుతమ్‌!

కారమర్ద కరైర్మర్ద్య సప్తభాగ సితాన్వితా!!

వాక్కాయని ‘వాక కాయ’ అంటారు. ‘వాకం’ అంటే అనుకూలంగా పని చేసేదని. పొదలాగా ఎత్తుగా పెరిగే ముళ్లతో కూడిన అడవి మొక్క ఇది. రోడ్డు పక్కన కూడా పెరుగుతుంది. ‘అశోకుడు రహదారులకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అని చదువుకున్నాం. కానీ ఆధునికత పేరుతో రోడ్డు పక్కన ఇప్పుడు చెట్లు అరుదైపోయాయి. అడవుల్ని కూడా ఇష్టారాజ్యంగా నరికేస్తున్నాం. వీటివల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది.

విరివిగా దొరికే వాక్కాయ లాంటి ఔషధ గుణాలున్న చెట్లు కనిపించుకుండా పోతున్నాయి. వాక్కాయ అందరికీ అనుకూలంగా ఉండే ఫలం. దీనికి ‘కలిమి’ కాయలనే మరో పేరుంది. ‘కలే చెట్టు, కరండ, కలే కాయలు, కలివి కాయలు’ అని కూడా వీటిని పిలుస్తారు. కరీంనగర్‌ జిల్లాలో ‘ఊడుగు’ పండ్లు అంటారు. ఉత్తరాదిలో ‘కరోందా’గా పిలుస్తారు.

పచ్చి కాయలు లేత ఆకుపచ్చ రంగులో, ముదిరినవి తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది. పండిన తరువాత నలుపు రంగుకు మారుతుంది. అందుకని ‘కృష్ణపాక ఫలం’ అంటారు. చెర్రీ పండ్లకు బదులుగా వాక్కాయల్నే ఎర్ర రంగు కలిసిన పంచదార పాకంలో ఉడికించి వాడుతుంటారు. తీపి కలిసిన వాక్కాయ మంచిదే గానీ ఆ ఎర్ర రంగే ప్రమాదకరం.

పచ్చి వాక్కాయల్ని ఎండిస్తే ఎండు ద్రాక్షలా నల్లగా ఉంటాయి. వగరుగా, తియ్యగా, పులపుల్లగా రాతి ఉసిరికాయ రుచిలో ఉంటాయి. ఆలస్యంగా అరుగుతాయి. జీర్ణం అయ్యాక ఎసిడిటీని పెంచుతాయి. వాత వ్యాధుల్లో మేలు చేస్తాయి. గుండెకి మంచిది.

జీర్ణశక్తిని పెంచి, ఆకలిని కలిగిస్తాయి. నాలుక మీద జిగురు తగ్గించి, అన్నహితవు పుట్టిస్తాయి. పచ్చికాయ తింటే గొంతు నుసగా అనిపిస్తుంది. గొంతుకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు వీటిని తినవద్దు. పండితే ఎక్కువ మేలు చేసే గుణాలున్నాయి. తేలికగా అరుగుతాయి. ఎసిడిటీని కలిగించవు. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని తగ్గిస్తాయి. అందుకని సాధ్యమైనంత పండిన వాటినే ఎంచుకోండి.

పచ్చి కాయలతో పప్పు, పచ్చడి, చేసుకుంటారు. ఊరుగాయ పచ్చడి కూడా పెట్టుకుంటారు. జామ్‌, షర్బత్తులు చేసుకోవటానికి వాకపండు ఎక్కువ తోడ్పడుతుంది. బాగా ముదురు ఎరుపు లేదా నలుపుగా ఉండే వాకపండ్లే మేలు చేస్తాయని గుర్తుంచుకోవాలి. లేత పిందెలుగా ఉన్న వాక్కాయలు వగరు, పులుపు రుచి వల్ల షుగరు వ్యాధి ఉన్నవారికి అనుకూలం.


వాతహృద్ధచిదం బల్యం హృద్యమ్‌ అమ్లతరం స్మృతమ్‌!

రక్తపిత్తకరం చోక్తమకఠ్యంకార మర్దకమ్‌!

వాకపండు పానకం వాతాన్ని తక్షణం తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. బలాన్ని, శక్తినీ ఇస్తుంది. కానీ రక్తం పలుచబడేలా చేస్తుంది. బ్లడ్‌ థిన్నర్లతో సమానంగా పని చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. రక్తస్రావాలు అవుతున్నప్పుడు దీన్ని తీసుకోకుండా ఉంటేనే మంచిది.

వాక్కాయల్లో ఒక విధమైన జిగురు ఉంటుంది. అదీ మేలు కలిగించేదే. పచ్చికాయ పుల్లగా ఉన్నప్పటికీ దప్పిక తగ్గిస్తుంది. పురుషుల్లో అమితమైన వేడివల్ల వీర్యంలో జీవ కణాలు నశించిపోతుంటాయి. అలాంటి వాళ్లకు ఈ వాక్కాయ షర్బత్తు మంచి ఫలితం ఇస్తుంది. జీవకణాలు పెరుగుతాయి. మన పూర్వులు ప్రకృతిలో ఎన్నిటినో ఆహార యోగ్యంగా మలచుకున్నారు. సీజన్లో దొరికే అన్నిటినీ తినటానికి ప్రయత్నించేవారు. అదే అసలైన జీవన విధానం.

  • పానకం ఎలాగంటే...

  • వాక పండుతో పానకం తయారు చేసుకొనే విధానాన్ని క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో ఇలా వివరించాడు:

  • వాక పండుని శుభ్రపరిచి, ముక్కలుగా తరిగి, మిక్సీ పట్టి గుజ్జులా చేయండి. లోపల గింజ తీసేయండి.

  • ఈ గుజ్జుకు ఏడు రెట్లు నీళ్లు కలిపి తగినంత అల్లం, ఉప్పు కూడా వేసి మరోసారి మిక్సీ పట్టండి. ఈ రసం మొత్తం ఏడు కప్పులైతే... దానికి పంచదార ఒక కప్పు కలిపి బాగా చిలకండి.

  • ఇదే వాకపండు పానకం... లేదా షర్బత్‌. దీన్ని అప్పటికప్పుడు చేసుకుని తాగటమే ఉత్తమం. ఫ్రిజ్జులో పెట్టుకుని అయినా వాడుకోవచ్చు. ఎక్కువసేపు బయట ఉంటే పులిసిపోతుంది.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Jul 06 , 2024 | 06:01 AM