Share News

Pain Relief : అలవాట్లతోనే అగచాట్లు

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:45 AM

మెడనొప్పి, నడుము నొప్పి, తల నొప్పి... అందర్నీ ఏదో ఒక సందర్భంలో వేధించే నొప్పులే ఇవన్నీ! అయితే ఇవే నొప్పులు సర్జరీ వరకూ దారి తీయకుండా ఉండాలంటే వైద్యులను కలిసి మూల కారణాన్ని కనిపెట్టాలి.

Pain Relief : అలవాట్లతోనే అగచాట్లు

పెయిన్స్‌

మెడనొప్పి, నడుము నొప్పి, తల నొప్పి... అందర్నీ ఏదో ఒక సందర్భంలో వేధించే నొప్పులే ఇవన్నీ! అయితే ఇవే నొప్పులు సర్జరీ వరకూ దారి తీయకుండా ఉండాలంటే వైద్యులను కలిసి మూల కారణాన్ని కనిపెట్టాలి.

ప్రతి నొప్పికీ సర్జరీ అవసరం ఉండదు. సర్జరీకి దారి తీసేటంత రుగ్మతలు ఏ కొద్ది మందికో ఉంటాయి. ఎముకలు, కండరాల నొప్పులను నాడీసంబంధ నొప్పులుగా పొరపాడు పడుతూ ఉంటాం.

కానీ నిజానికి ఆ నొప్పుల కారణాలు మన అలవాట్లలోనే దాగి ఉంటాయి. కాబట్టి నొప్పి, అసౌకర్యాలకు మూల కారణాల కోసం మనల్ని మనం ఒకసారి తరచి చూసుకోవాలి.

గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోవడం, కూర్చున్నప్పుడు శరీర భంగిమ కుదురుగా లేకపోవడం లాంటి వాటి వల్ల మెడ నొప్పి, చేతుల్లో తిమ్మిర్లు సహజం.

ఇదే పరిస్థితి తీవ్రమైతే, స్పర్శ కోల్పోవడం, చేతులు బలహీనమై వస్తువులను బలంగా పట్టుకోలేకపోవడం, కండరాలు క్షీణతకు గురవడం జరుగుతుంది. కొందరికి నడకలో కూడా ఇబ్బంది తలెత్తుతుంది. మూత్ర విసర్జన కూడా కష్టం కావచ్చు.


మెడనొప్పి ఎందుకు?

కంప్యూటర్లతో పాటు, తల వంచి ఫోన్లకు అతుక్కుపోయి కూర్చునేవాళ్లు, దూర ప్రయాణాలు చేసేవాళ్లు, మెడ ఆధారంగా బరువులు లేపేవాళ్లను మెడనొప్పి వేధిస్తుంది. నిజానికి 70% మందిలో చిన్నపాటి మార్పులతో ఈ సమస్యను పరిష్కరించు కోవచ్చు.

Untitled-3 copy.jpg

కూర్చునే భంగిమ సరిదిద్దుకోవడం, ప్రయాణా ల్లో నెక్‌ సపోర్ట్‌ పిల్లోలు వాడుకోవడం, కంప్యూటర్ల ముందు పనిచేసేవాళ్లు తరచూ లేచి నడుస్తూ ఉండడం, మెడ కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా మెడ నొప్పిని పూర్తిగా తగ్గించుకోవచ్చు.

అయితే ఫిజియోథెరపీ, మందులతో పాటు, ఇతరత్రా జీవనశైలి మార్పులు చేసుకున్నప్పటికీ సమస్య తగ్గకపోతే, దాన్ని నాడీ సంబంధ సమస్యగా అనుమానించాలి. ఈ సమస్యను కూడా మందులతో, విశ్రాంతితో చాలా మేరకు తగ్గించుకోవచ్చు. అప్పటికీ తగ్గనప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది.

వెన్నులో డిస్క్‌ ప్రొలాప్స్‌, ఇన్‌ఫెక్షన్లు, ట్యూమర్ల వల్ల కూడా ఇవే లక్షణాలు బయల్పడతాయి. కాబట్టి తేలికపాటి చికిత్సతో లక్షణాలు తగ్గుముఖం పట్టనప్పుడు వైద్యులను కలవాలి.


నడుము నొప్పి అందుకే

నడుము నొప్పికి ఎన్నో కారణాలుంటాయి. శరీర భంగిమ లోపాలతో పాటు, పుట్టుకతో వెన్నులో సమస్య ఉండవచ్చు. వెన్నుపూసలు బలహీనపడి ఉండొచ్చు. ఫ్రాక్చర్స్‌ ఉండొచ్చు.

ఇలా లంబార్‌ స్పాండిలోసి్‌సలో సమస్యలు, సయాటికా లాంటివి తగ్గకుండా పెరుగుతున్నప్పుడు, ఎమ్మారై, ఎక్స్‌రేలతో కారణాన్ని కనిపెట్టి సరిదిద్దుకోవాలి.

ఒకవేళ నడుము నొప్పికి కారణం డిస్క్‌ ప్రొలాప్స్‌ అయితే, ఎండోస్కోపిక్‌ సర్జరీతో, చిన్నపాటి కోతతో, సమస్యను సరిదిద్దుకుని, సర్జరీ జరిగిన మరుసటి రోజే ఇంటికెళ్లిపోయే వెసులుబాట్లు అందుబాటులోకొచ్చాయి. ఫ్రాక్చర్‌ ఉంటే, మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీతో సరిదిద్దుకోవచ్చు.


వెన్ను సర్జరీ 5% మందికే!

సాధారణంగా వెన్ను సర్జనీ అందరికీ అవసరం పడదు. సర్జరీతోనే సమస్యను సరిదిద్దే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే, అంతిమ ప్రత్యామ్నాయంగా వైద్యులు సర్జరీని ఎంచుకుంటూ ఉంటారు.

వీపు నొప్పి, నడుము నొప్పి, సయాటికాలతో బాధపడేవాళ్లు డాక్టరు దగ్గరకు వెళ్తే ఆపరేషన్‌ చేయించుకోవలసివస్తుందనే భయంతో గృహవైద్యాలను అనుసరిస్తూ, సర్జరీ వరకూ తెచ్చుకుంటూ ఉంటారు. ప్రారంభంలోనే వైద్యులను కలిస్తే తేలికపాటి చికిత్సతోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

వెన్నుపూసలో నుంచి కాళ్లలోకి దారితీసే సయాటికా నాడి ఒత్తిడికి లోనైనప్పుడు సయాటికా నొప్పి వేధిస్తుంది. దీనికి కూడా డిస్క్‌ ప్రొలాప్స్‌, ఇన్‌ఫెక్షన్లే కారణం. కారణం తీవ్రత మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది.

ఫిజియోథెరపీ, మందులతోనే సమస్యను అదుపు చేయగలిగే వీలుంటుంది. కాళ్లలో బలహీనత, స్పర్శ కోల్పోవడం, మూత్రవిసర్జన మీద నియంత్రణ కోల్పోవడం లాంటి తీవ్ర లక్షణాలు బయల్పడినప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది.


ఈ తలనొప్పులు భిన్నం

తలనొప్పులన్నీ బ్రెయిన్‌ ట్యూమర్‌కు సంబంధించినవి కావు. కేవలం ఒక శాతం కంటే తక్కువ మందిలోనే బ్రెయిన్‌ ట్యూమర్స్‌ ఉంటూ ఉంటాయి. ఎలాంటి ట్యూమర్లు, ఇన్‌ఫెక్షన్లు లేకపోయినా తలెత్తే తలనొప్పులు ప్రైమరీ హెడేక్స్‌. వీటిలో అత్యంత సాధారణమైనది మైగ్రేన్‌. చాలా మందిలో మైగ్రేన్‌ జీవనశైలి మార్పులతో ముడిపడి ఉంటుంది.

Untitled-3 copy.jpg

ఎక్కువసేపు మొబైల్‌ చూడడం, రాత్రుళ్లు ఎక్కువ సమయాలు మేల్కొని ఉండడం, జంక్‌ఫుడ్‌, ధూమపానం, ఆల్కహాల్‌, ఒత్తిడి, ఆందోళన, కెఫీన్‌ ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, ఊబకాయం... ఇవన్నీ మైగ్రేన్‌కు దారితీసే కారణాలే! కొందరికి తలనొప్పి ఒకవైపే వేధిస్తుంది.

వాంతులు కూడా వేధిస్తూ ఉంటాయి. కొందరు శబ్దాలను వినలేరు. ఇంకొందరు వెలుగును భరించలేరు. ఇలాంటివాళ్లు మైగ్రేన్‌ను ట్రిగ్గర్‌ చేసే కారణాలను వాళ్లంతట వాళ్లే కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి.

అయినా తగ్గకపోతే తలనొప్పి ఎపిసోడ్స్‌ రాకుండా ఆపే మందులతో పాటు, తలనొప్పి వచ్చినప్పుడు తగ్గించే మందులు కూడా వాడుకుంటూ ఉండాలి.

డాక్టర్‌ బాల రాజశేఖర్‌

సీనియర్‌ న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌,

హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌

Updated Date - Jul 30 , 2024 | 12:50 AM