Recipes : ఎక్కడైనా అదే రుచి
ABN , Publish Date - Sep 14 , 2024 | 02:36 AM
కొన్ని ప్రాంతాల్లో కొన్ని వంటలు ప్రసిద్ధి. ఆ తర్వాతి కాలంలో అవి ప్రపంచమంతా విస్తరించినా... అసలు పేర్లు మాత్రం చెరిగిపోవు. అలాంటి కొన్ని వంటలే ఇవి.
వంటిల్లు
కొన్ని ప్రాంతాల్లో కొన్ని వంటలు ప్రసిద్ధి. ఆ తర్వాతి కాలంలో అవి ప్రపంచమంతా విస్తరించినా... అసలు పేర్లు మాత్రం చెరిగిపోవు. అలాంటి కొన్ని వంటలే ఇవి.
బీబీ దా పులావ్
ఒకప్పుడు అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో దీనిని అతిథుల కోసం ఎక్కువగా చేసేవారు. దీనిలో వాడే పదార్థాలు అన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే! దీనిని ఇప్పటికీ చలికాలంలో ఎక్కువగా వండుతూ ఉంటారు.
కావాల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు- ఒక కేజీ, బాసుమతి బియ్యం- 500 గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- 300 గ్రాములు, నెయ్యి- ఒక కప్పు, ఏలకులు-5, దాల్చిన చెక్క- ఒక అంగుళం, లవంగాలు-5, బిర్యానీ ఆకులు-5, ఎర్రకారం- రెండు చెంచాలు, పచ్చకారం- రెండు చెంచాలు, పెరుగు- పావు కేజీ, పచ్చిమిర్చి- 10, అల్లం వెల్లుల్లి పేస్ట్- 4 చెంచాలు, క్రీమ్- మూడు చెంచాలు, రోజ్ వాటర్- ఒక చెంచా, నీళ్లు- తగినన్ని.
తయారీ విధానం:
బాసుమతి బియ్యాన్ని అరగంట నాననివ్వాలి.
ఈ లోపులో ఒక మూకుడు పెట్టి కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి. తరువాత ఒక ప్లేటులో వేసి, చల్లారనివ్వాలి. ఇందులో సగం ముక్కలను పులావ్‌లో కలపటానికి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని మిక్సీలో వేసుకొని పేస్టులా చేసుకోవాలి.
ఉల్లిపాయలను వేయించిన మూకుడులో ఇంకొంత నెయ్యి వేసి ఉల్లిపాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను వేయించాలి. వాటిలోనే దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత దానిలో చికెన్ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమంలో ఎర్రకారం, పచ్చకారం, పెరుగు, తగినంత ఉప్పు వేయాలి. పైన మూత పెట్టి ఉడకనివ్వాలి.
ఈ లోపులో ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి బాసుమతి బియ్యాన్ని ఉడికించాలి. బియ్యం ఉడికిన తర్వాత వార్చి నీళ్లు తీసేయాలి.
ఇంకొక పెద్ద మూకుడు తీసుకొని దానిలో చికెన్ మిశ్రమాన్ని, మిరపకాయ ముక్కలను వేయాలి. దానిపై ఉడికిన బాసుమతి బియ్యాన్ని ఒక పొరగా కప్పాలి. దానిపై రోజ్‌వాటర్, మిగిలిన నెయ్యి, క్రీమ్‌లు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బాసుమతి బియ్యంతో వండిన అన్నం పొడిగా ఉండాలి. ముద్దగా ఉండకూడదు.
క్రీమ్ వేసిన ఐదు నిమిషాలలో పులావ్‌ను స్టౌ మీద నుంచి దింపేయాలి.
సింధి కథి
సింధి వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిల్లో వాడే కూరలు, పదార్థాలు మనను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అలాంటి ఒక సింధి కూరను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
టమాటోలు - ఆరు, బెండకాయలు- ఆరు, బీన్స్- పది, ములక్కాడలు- రెండు, అల్లం- ఒక అంగుళం, కరివేపాకు- తగినంత, పచ్చి మిరపకాయలు- రెండు, శనగపిండి- ఆరు చెంచాలు, పసుపు- ఒక చెంచా, ఎర్ర కారం- రెండు చెంచాలు, ఇంగువ- తగినంత, ఆవాలు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, మెంతులు- ఒక చెంచా, నెయ్యి- ఆరు చెంచాలు, నీళ్లు- ఒక కప్పు, ఉప్పు- తగినంత, తరిగిన కొత్తిమీర- తగినంత
తయారీ విధానం
ముందుగా టమాటోలను మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. కూరలను, పచ్చి మిరపకాయలను పొడవుగా ముక్కలుగా తరగాలి.
ఒక మూకుడును స్టౌ మీద పెట్టి నెయ్యిని వేడి చేయాలి. దీనిలో ముందు ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, చివరగా మెంతులు, ఇంగువ వేయాలి. దానిలో శనగపిండిని వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలను వేసి వేయించాలి.
దీనిలో కారం, పసుపు వేయాలి. ఆ తర్వాత టమోటో ముద్దను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత కూర ముక్కలన్నింటినీ వేసి నీళ్లు పోసి కలపాలి. మూకుడుపై మూత పెట్టి పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి.
స్టౌ మీద నుంచి దింపి, తగినంత ఉప్పు వేసి, తరిగిన కొత్తిమీరను కూరపైన చల్లాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
శనగపిండి వేసిన తర్వాత సన్నని సెగపైన వేయించాలి. లేకపోతే శనగపిండి మాడు వాసన వస్తుంది.
ఇంగువను కొద్దిగా వేసుకోవాలి. లేకపోతే ఘాటు ఎక్కువ అయిపోతుంది.
చంపారన్ మటన్
బిహార్‌లోని చంపారన్ జిల్లాలో పెళ్లిళ్లకు.. పండగలకు.. అందరూ కలిసి వండుకొనే వంటకమిది. ఒకప్పుడు చంపారన్‌కు మాత్రమే పరిమితమయిన ఈ వంటకం- ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ ఫేవరెట్‌గా మారింది. భిన్నమైన రుచితో ఉండే ఈ మటన్ కర్రీని కట్టెలు లేదా బొగ్గుల పొయ్యి మీద నెమ్మదిగా వండుతారు. అందరి ఇళ్లలోను కట్టెల పొయ్యిలు ఉండవు కాబట్టి సాధారణ గ్యాస్ స్టౌవ్‌పై తక్కువ మంట మీద దీనిని వండుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
మటన్- ఒక కేజీ , ఉల్లిపాయ ముక్కలు- 750 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఆరు టేబుల్ స్పూన్లు, పసుపు- ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి- ఒక టేబుల్ స్పూను, ఎర్ర కారం- ఒక టేబుల్ స్పూను, పెరుగు- 150 గ్రాములు, ఆవ నూనె- ఒక చిన్న కప్పు, ఉప్పు- తగినంత, తరిగిన కొత్తిమీర- తగినంత, గోధుమ పిండి- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దానిలో పసుపు, ధనియాల పొడి, ఎర్రకారం కలపాలి. ఈ మిశ్రమంలో మటన్ ముక్కలను వేసి 8 నుంచి 12 గంటలు నానబెట్టాలి.
మూతి చిన్నదిగా ఉన్న ఒక దళసరి గిన్నెను తీసుకొని దానిలో ఆవ నూనెను వేసి వేడిచేయాలి. ఈ ఆవనూనెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను వేసి దోరగా వేయించాలి.
దీనిలో నానబెట్టిన మటన్ ముక్కలను వేయాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టాలి.
గోధుమపిండిలో నీళ్లు పోసి ముద్దగా చేయాలి. గిన్నెపై మూతను ఈ ముద్దతో సీల్ చేయాలి. ఒక గంట సేపు సన్నని సెగపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత గోధుమ పిండి సీల్‌ను తీసేయాలి.
ఇలా ఉడికిన కూరలో ఉప్పు, కొత్తిమీర వేయాలి. దీనిని రోటీలలో కానీ.. అన్నంలో కానీ కలుపుకొని తినవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మటన్‌ను ఎంత సేపు పెరుగులో నానబెడితే అంత మంచి రుచి వస్తుంది
మటన్ ముక్కలు వేసిన తర్వాత నీళ్లు పోయకూడదు. మటన్‌లో ఉండే జ్యూస్ కూరను ఉడికేలా చేస్తుంది.