Share News

అత్యవసర చికిత్స అవసరం ఏ మేరకు?

ABN , Publish Date - Oct 22 , 2024 | 06:07 AM

అత్యవసర వైద్యం అందవలసిన సమయాల్లో, ఎమర్జెన్సీ మెడిసిన్‌ను ఆశ్రయించక తప్పదు. అయితే అంతకంటే ముందు ఆస్పత్రికి చేరేలోగా, తక్షణ చికిత్సనెలా అందించాలో తెలుసుకోవాలి.

 అత్యవసర చికిత్స అవసరం ఏ మేరకు?

ఎమర్జెన్సీ మెడిసిన్‌

అత్యవసర వైద్యం అందవలసిన సమయాల్లో, ఎమర్జెన్సీ మెడిసిన్‌ను ఆశ్రయించక తప్పదు. అయితే అంతకంటే ముందు ఆస్పత్రికి చేరేలోగా, తక్షణ చికిత్సనెలా అందించాలో తెలుసుకోవాలి. అప్పుడే పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోగలుగుతాం!

వరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే మొదట కంగారు పడిపోతాం! బెంబేలెత్తిపోతాం! అయోమయంలో పడిపోతాం! తర్వాత హడాహుడిగా ఆస్పత్రికి పరుగులు తీస్తాం! సాధారణంగా ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు. కానీ ఆస్పత్రికి చేరేలోగా పరిస్థితి విషయమించవచ్చు. దారిలోనే ప్రాణాలూ పోవచ్చు. మరీ ముఖ్యంగా గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనప్పుడు ఏ కాస్త సమయం కూడా వృథా కాకుండా చూసుకోవాలి. లక్షణాలను బట్టి సమస్య తీవ్రతను గుర్తించి, తక్షణ చికిత్సను అనుసరించాలి. అదే సమయంలో వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ మెడిసిన్‌ సేవలను అందించాలి.

  • ఎమర్జెన్సీ మెడిసిన్‌ అంటే?

గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, ట్రామా, తీవ్రమైన రక్తస్రావం జరగడం లాంటి ప్రాణాంతక సందర్భాలన్నీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ కోవలోకే వస్తాయి. ఈ సందర్భాల్లో మొదట రోగిని స్టెబిలైజ్‌ చేసి, ప్రాణాలు పోకుండా కాపాడడాన్నే వైద్యులు లక్ష్యంగా పెట్టుకుంటారు. నిజానికి చాలా సందర్భాల్లో అసలు చికిత్స అంబులెన్స్‌లోనే మొదలవుతూ ఉంటుంది. రోగి ఆస్పత్రికి చేరుకునేలోపే అవసరమైన ఏర్పాట్లన్నీ వైద్యులు సిద్ధం చేసుకుంటారు. లక్షణాలు, సమస్య తీవ్రత ఆధారంగా, ఓ పక్క పరీక్షలతో కారణాన్ని నిర్థారిస్తూనే, మరోపక్క సంబంధిత అవయవాన్ని కోల్పోకుండా రక్షణ చికిత్సలను మొదలుపెడతారు. ఇంతటి కీలకమైన సమయాల్లో, ఎక్కువ మంది వైద్యులు సమిష్ఠిగా సమస్యను విశ్లేషించి, తదనుగుణ చికిత్సతో రోగి ఆరోగ్య పరిస్థితిని కుదేలవకుండా కాపాడతారు. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఆస్పత్రికి చేరుకోబోయే రోగి కోసం వెంటిలేటర్‌ను సిద్ధం చేయడం, బిపి పడిపోయిన రోగి కోసం ఫ్లూయిడ్స్‌, రక్తపోటును పెంచే మందులు సిద్ధం చేసుకుంటారు.


Untitled-5 copy.jpg

  • గుండె పోటు వస్తే?

గుండె పోటును గ్యాస్ట్రిక్‌ సమస్యగా పొరబడే సందర్భాలు ఎక్కువ. దాంతో అజీర్తిని తొలగించే మందులు లేదా అసిడిటీ మందులు వాడుకుని, వాటితో అసౌకర్యం తగ్గకుండా పెరిగిపోయినప్పుడు మాత్రమే, రోగులను వైద్యుల దగ్గరకు తీసుకొస్తూ ఉంటారు. కానీ అప్పటికే గుండెకు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి గుండె పోటు లక్షణాలను కచ్చితంగా కనిపెట్టడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. గుండె పోటును తగ్గించడం కోసం వెంటనే యాస్పిరిన్‌ మాత్రను తినిపించవచ్చు. గుండె ఆగిపోయిన సందర్భాల్లో సిపిఆర్‌ చేయాలనే విషయం కూడా అందరికీ తెలిసిందే! ఆగిపోయిన గుండెను కృత్రిమంగా పని చేయించడమే సిపిఆర్‌. ఛాతీ మీద నొక్కడం ద్వారా గుండె మీద ఒత్తిడి పెరిగి, పని చేయడం మొదలుపెడుతుంది. అయితే సిపిఆర్‌ చేసే సమయంలో కొన్ని అంశాలు గుర్తు పెట్టుకోవాలి. కొన్నిసార్లు సిపిఆర్‌ చేసిన తర్వాత, సదరు వ్యక్తిలో స్పందన గమనించాలి. వాళ్లను పిలిచి, తట్టి మేల్కొనేలా చేయాలి. వాళ్లు స్పందించినా, లేకపోయినా అత్యవసర సేవల విభాగానికి వీలైనంత త్వరగా తీసుకువెళ్లాలి. కొన్ని వాణిజ్య ప్రదేశాల్లో, మాల్స్‌లో ప్రస్తుతం డిఫిబ్రిలేటర్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. సిపిఆర్‌ కోసం వాటిని కూడా వినియోగించుకోవచ్చు.


Untitled-5 copy.jpg

  • బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైతే?

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వేర్వేరు లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. నవ్వినప్పుడు ముఖంలో సగ భాగంలో ఎలాంటి మార్పూ లేకపోవడం, లేదా ఒక చేయి బాగా పని చేస్తున్నా, మరో చేయి సరిగా పని చేయకపోవడం, కాళ్లలో కూడా ఇదే లక్షణం కనిపించడం బ్రెయిన్‌ స్ట్రోక్‌లో సర్వసాధారణం. ఇలా సగభాగం శరీరంలో బలహీనత కనిపించడం (పక్షవాతం), వస్తువులను పట్టుకోలేకపోవడం, నడక తడబడడం మొదలైన లక్షణాలను గమనించాలి. ఇంకొన్ని బ్రెయిన్‌ స్ట్రోక్స్‌లో మగతగా ఉండడం, నిలబడలేకపోవడం, నడిచినప్పుడు ఒక పక్కకు పడిపోవడం, ఒకటి లేదా రెండు కళ్లలో కంటి చూపు కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం మూలంగా తలెత్తే ఈ సమస్యకు సత్వర చికిత్స అవసరమవుతుంది. వీలైనంత త్వరగా మందులతో లేదా సర్జరీతో రక్తపు గడ్డను కరిగించడం లేదా తొలగించడం చేయగలిగితే మెదడుకు జరిగే నష్టం తగ్గుతుంది. లక్షణాలు కూడా మెరుగు పడతాయి. ఆలస్యమయ్యేకొద్దీ తిరిగి సరిదిద్దలేని దుస్థితికి పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే స్పందించాలి.


Untitled-5 copy.jpg

  • అవయవం కోల్పోతే?

రోడ్డు ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయినప్పుడు, లేదా వంటింట్లో ప్రమాదవశాత్తూ వేలు పూర్తిగా తెగిపోయినప్పుడు కూడా వేగంగా స్పందించాలి. అలాంటి సమయాల్లో రక్తస్రావం మూలంగా ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెంటనే తెగిపోయిన ప్రదేశానికి పైన తాడు, బెల్టు లేదా చున్నీతో గట్టిగా కట్టేసి, రక్తస్రావాన్ని ఆపేయాలి. తెగిన అవయవాన్ని పైకి లేపి ఉంచాలి. అలాగే తెగి పడిన అవయవాన్ని శుభ్రమైన ప్లాస్టిక్‌ సంచిలో ఉంచి, మరో సంచిలో చల్లని నీళ్లను నింపి, దాన్లో అవయవం ఉంచిన సంచిని వేసి, రోగితో పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.


  • ఎమర్జెన్సీ వైద్య విధానం ఇదే!

గుండెపోటుతో ఎమర్జెన్సీకి చేరుకున్న రోగి విషయంలో, గుండె రక్తనాళంలో ఏర్పడిన రక్తపు గడ్డను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యులు నడుచుకుంటారు. సిటి స్కాన్‌, ఎమ్మారై చేస్తూనే, రక్తపు గడ్డను కరిగించే మందులు ఇస్తారు. తీవ్రతను బట్టి స్టెంట్‌ వేయడం కోసం క్యాథ్‌ ల్యాబ్‌కు తీసుకువెళ్తారు. ఈ పనులన్నిట్లో వైద్యుల బృందం ప్రమేయం ఉంటుంది. ఈ బృందంలో ఎమర్జెన్సీ వైద్యులతో పాటు, రేడియాలజి్‌స్టలు, న్యూరాలజిస్టులు కలిసి రోగిని స్టెబిలైజ్‌ చేస్తారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి నాలుగున్నర గంటల్లోపు మెదడులోని రక్తపు గడ్డను కరిగించే మందులు ఇవ్వాలి. ఈ మందులతో గడ్డ కరిగిపోతుంది. ఆ కీలక సమయం దాటితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ సమస్యతో ఎవరైనా ఎమర్జెన్సీకి చేరుకుంటే, వెంటనే ఆస్పత్రిలో ‘స్ట్రోక్‌ కోడ్‌’ను ప్రకటిస్తారు. దాంతో ఆస్పత్రిలోని సిబ్బంది మొత్తానికీ బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వ్యక్తి ఆస్పత్రికి చేరుకున్న విషయం తెలిసిపోతుంది. దాంతో ఎమ్మారై కోసం, రేడియాలజిస్ట్‌ సిద్ధంగా ఉంటాడు. ఎమ్మారై చేస్తూనే రక్తపు గడ్డను గుర్తించి, వెంటనే చికిత్స మొదలుపెడతారు. ఇక అవయవాలు తెగిపోయిన సందర్భాల్లో ఆర్థొపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జన్ల బృందం పరిస్థితిని విశ్లేషిస్తుంది. తెగిపోయిన అవయవాన్ని తిరిగి అతికించే అవకాశాలను కూడా పరీక్షిస్తుంది. ఇలా అన్ని సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. వయసు, గాయం రకం, తీవ్రత.. ఇలా ఎన్నో అంశాలను వైద్యులు పరిగణలోకి తీసుకుంటారు. అలా సాధ్యాసాధ్యాలను విశ్లేషించుకున్న వైద్యులు, అంతిమ నిర్ణయం తీసుకుంటారు.

డాక్టర్‌ ఇమ్రాన్‌ షరీఫ్‌

క్లినికల్‌ హెడ్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌,

స్టార్‌ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Oct 22 , 2024 | 06:07 AM