Share News

NRI News: డాలస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:02 PM

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాలస్‌లో ఏర్పాటు చేసిన అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

NRI News: డాలస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

ఇంటర్నెట్ డెస్క్, (డాలస్, టెక్సస్): మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాలస్‌లో ఏర్పాటు చేసిన అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల.. అందరికీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని చెప్పారు. మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చేయడానికి కృషి చేసిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర, సహకరించిన అధికారులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.


మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశమైన భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమన్నారు. స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని చెప్పారు. దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు, గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు చేసిన సేవలు చిరస్మరణీయని అన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయలు అమెరికా దేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


nri-telugu-news.jpg

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బీఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్ తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కళ్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా లెనిన్ వేముల శ్రావ్యంగా ఆలపించిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం అందరినీ అలరించింది.

Updated Date - Aug 16 , 2024 | 09:02 PM