Share News

Lokesh:మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన.. సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ పిలుపు..

ABN , Publish Date - Oct 24 , 2024 | 08:24 AM

అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారు కోరారు. పెట్టుబడుదారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార వేత్తలకు అవసరమైన ప్రోత్సాహాన్ని..

Lokesh:మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన.. సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ పిలుపు..
Lokesh

పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 25వ తేదీ నుంచి నవంబర్ 1వరకు అమెరికాలో పర్యటించనున్నారని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ కోమటి జయరాం, గుళ్ళపల్లి రామకృష్ణ తెలిపారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారు కోరారు. పెట్టుబడుదారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార వేత్తలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. వారం రోజుల పాటు మంత్రి లోకేశ్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై.. ఏపీలో పెట్టుబడిదారులకు గల అవకాశాలను వివరిస్తారన్నారు. అమరావతి కేంద్రంగా ఐటీ, పారిశ్రామిక రంగాన్ని విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, అదే సమయంలో ప్రతి రంగంలో నూతన విధానాలతో ముందుకెళ్తోందని కోమటి జయరాం, గుళ్ళపల్లి రామకృష్ణ పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఎన్‌ఆర్‌ఐలు తమ తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.


ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. అమరావతి కేంద్రంగా నిర్వహించిన డ్రోన్ సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందన్నారు. ఈ సదస్సుతో డ్రోన్ టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ముందడుగు పడిందని కోమటి జయరాం, గుళ్ళపల్లి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.


లోకేశ్ షెడ్యూల్ ఇదే..

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనలో భాగంగా 25వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్‌ సంస్థ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. పత్ర సినర్జీస్, బోసన్, స్పాన్‌ఐఓ, క్లారిటీ, ఎడోబ్, స్కేలర్, జనరల్‌ అటమిక్స్‌ సంస్థల ప్రతినిధులు, భారత కాన్సుల్‌ జనరల్‌తో 26న భేటీ అవుతారు. ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో 27న, రెడ్‌మండ్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో 28న భేటీ కానున్నారు. 29న అమెజాన్‌ సహా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడంతోపాటు ఐటీ సర్వ్‌ సినర్జీ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. అదే రోజు లాస్‌ వేగాస్‌లో ఐటీ సర్వ్‌ అలయెన్స్‌ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశానికి లోకేశ్‌ విశిష్ట అతిథిగా హాజరవుతారు. ఈ నెల 30న వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 31న జార్జియాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో నవంబరు 1న సమావేశమవుతారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 24 , 2024 | 08:24 AM