TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?
ABN , Publish Date - Feb 11 , 2024 | 02:04 PM
Telangana Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీల (BRS, BJP) నుంచి కీలక నేతలను చేర్చుకునే విషయం వరకూ ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తోంది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీల (BRS, BJP) నుంచి కీలక నేతలను చేర్చుకునే విషయం వరకూ ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తోంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగనుండటంతో సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల వారసులు అరగేంట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 నుంచి 15 వరకూ గెలవాలన్నదే టార్గెట్‌గా కాంగ్రెస్ పెట్టుకుంది. ఇప్పటికే ఖమ్మం, నల్లొండ, భువనగిరి (Khammam, Nalgonda, Bhuvanagiri) పార్లమెంట్ స్థానాలకు ఏ రేంజ్‌లో సీనియర్లు పోటీ పడుతున్నారో చూశాం. ‘మా కుటుంబానికే కావాలని మంత్రులు.. కాదు మా కుటుంబానికే ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రులు’ అధిష్టానంతో పెద్ద ఎత్తునే మంతనాలు జరుపుతున్నారు. అదలా ఉంచితే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి కూడా ఒకరు ఎంపీగా పోటీచేయబోతున్నారని తెలియవచ్చింది. ఇంతకీ పోటీలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నదెవరు..? ఎక్కడ్నుంచి పోటీచేస్తున్నారు..? ఇంతలా ఈ వ్యవహారం ఎందుకు హాట్ టాపిక్ అయ్యిందనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!
ఇదీ అసలు కథ..
రేవంత్ సోదరుల్లో ఒకరైన ఎనుముల తిరుపతి రెడ్డి.. (Anumula Tirupati Reddy) మహబూబ్‌నగర్ (Mahbubnagar) ఎంపీగా బరిలోకి దిగుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సీటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని తెలియవచ్చింది. పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు రేసులో ఉన్నారని పేర్లు కూడా బయటికి రాగా.. తాజాగా తిరుపతిరెడ్డి తెరపైకి వచ్చారు. టికెట్ దాదాపు ఫిక్స్ అయ్యిందని ఆయన అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో ‘తిరుపతి అన్న మిత్రమండలి’ పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లను అభిమానులు ఏర్పాటు చేశారు. ‘టికెట్ వచ్చేసింది.. ఇక షురూ చేయండి’ అని అనుచరులతో చెప్పడం వల్లే వారంతా నోటిఫికేషన్‌కు ముందే రంగంలోకి దిగిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం సోదరుడు, పైగా జిల్లాలో ఒకింత కీలకమైన వ్యక్తి కావడంతో తప్పకుండా టికెట్ వస్తుందని.. ఇందులో సందేహాలు అక్కర్లేదనే టాక్ కూడా నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ ఓడిపోయాక.. నియోజకవర్గానికి అన్నీ తానై చూసుకున్నారు తిరుపతి రెడ్డి. నాడు రేవంత్‌ను ఓడించి తొడగట్టిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చి మీసం మెలేసేలా చేసింది ఇదిగో ఈ తిరుపతి రెడ్డే.
మరోవైపు ఇలా..?
రేవంత్ బ్రదర్స్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాలతో.. ఇలా ఎంపీగా బరిలోకి దిగుతున్నారని పెద్ద ఎత్తునే వార్తలు వస్తున్నాయి. తిరుపతి రెడ్డి పేరు మహబూబ్‌నగర్ రేసులో రాగా.. మరో సోదరుడు కొండల్ రెడ్డి (Anumula Kondal Reddy) కూడా ఎంపీగా పోటీచేస్తారని తెలియవచ్చింది. మొన్నటి వరకూ రేవంత్ ఎంపీగా కొనసాగిన మల్కాజ్‌గిరి (Malkajgiri) నుంచి ఈయన పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటికే కొండల్.. ఎంపీ సీటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి నిర్మాత బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లు కూడా అధిష్టానానికి పంపడం జరిగింది. వీరందరిలో కొండల్ రెడ్డి చురుగ్గా ఉండటం.. పైగా సీఎం సోదరుడు కావడంతో హైకమాండ్ ఇతనివైపే మొగ్గు చూపే అవకాశముంది. చూశారుగా.. రేవంత్ రెడ్డి ఇద్దరు సోదరులూ రేసులో ఉన్నారు. మరి సీఎం మనసులో ఎవరున్నారో.. ఎవరికి టికెట్ దక్కుతుందా అని వారి అభిమానులు, అనుచరులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయ్యే పనేనా..?
అయితే.. కుటుంబానికి ఒకటే టికెట్ అని కాంగ్రెస్ హైకమాండ్ పదే పదే చెబుతోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి టికెట్ దక్కలేదు కూడా. ఇప్పుడు రేవంత్ విషయంలో ఏం జరగబోతోంది..? ఒక్క రేవంత్ మాత్రమే కాదు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ మంత్రి జానారెడ్డి కూడా తన కుటుంబ సభ్యులకు టికెట్ ఆశిస్తున్నారు. దరఖాస్తు కూడా చేసుకొని ఫైనల్ లిస్ట్, నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నారు. మరి వారసులకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా.. లేదా..? అనేది తెలియాలి. ఇప్పుడు టికెట్ రేసులో ఉన్న వారందరికీ సీటు కన్ఫామ్ కావాలంటే.. పెద్ద గగనంగానే పరిస్థితి ఉంది. సంచలన నిర్ణయాలు ఉంటాయా లేకుంటే కుటుంబానికి ఒక్కటంటే ఒక్కటే దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందో చూడాలి మరి.
మరిన్ని రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి