AP Politics: ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పినా.. అనుచరులు వైసీపీలోకి వెళ్లలేదేం..!?
ABN , Publish Date - Jan 23 , 2024 | 10:17 AM
MP Kesineni Nani Issue: ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పినా ఆయన అనుచరులు ఎవ్వరూ ఆయనతో కలిసి అడుగులు వేయలేదు. ఇది ఓ రకంగా చూస్తే టీడీపీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంత బలంగా ఉందో చెప్పే అంశంగా కనిపిస్తోంది. కానీ..
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెప్పినా ఆయన అనుచరులు ఎవ్వరూ ఆయనతో కలిసి అడుగులు వేయలేదు. ఇది ఓ రకంగా చూస్తే టీడీపీ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంత బలంగా ఉందో చెప్పే అంశంగా కనిపిస్తోంది. కానీ నాని తన కోవర్టులను కావాలనే టీడీపీలోనే ఉంచారన్న సందేహాలు టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో టీడీపీని దెబ్బకొట్టే వ్యూహంలో ఇదీ ఒక భాగమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఏజెంట్లుగా తన వారిని ఉంచే ప్రయత్నమా..? లేదా టీడీపీ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవడానికా..? అన్న అనుమానాలను టీడీపీ నాయకులు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కీలకమైన సమయంలో పార్టీని దెబ్బతీసే ఎత్తుగడలో భాగంగా నాని కోవర్టులు పనిచేయవచ్చని వారు పార్టీ పెద్దలకు చెప్పారు. దీంతో విజయవాడ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో నాని కోవర్టులు ఎవరనే సమాచారం సేకరించాలని పార్టీ అధిష్ఠానం బుద్దా వెంకన్న, కేశినేని చిన్నికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
అసలేం జరుగుతోంది..?
విజయవాడ పశ్చిమలో కీలకమైనా నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారిని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో టీడీపీలో ఉన్న సమయంలో కేశినేని నాని విజయవాడ పశ్చిమ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్నారు. సమన్వయకర్త హోదాలో పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో డివిజన్ కమిటీలను నియమించేందుకు ప్రయత్నించారు. డివిజన్ కమిటీల పనితీరును పర్యవేక్షించేందుకు నాలుగైదు డివిజన్లకు ఓ క్లస్టర్ ఇన్‌చార్జిని నియమించారు. అయితే ఈ కమిటీల్లో పార్టీకి సంబంధంలేని వారిని కూడా నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నియామకాలపై బుద్దా వెంకన్న అభ్యంతరం తెలపడంతో కొన్ని డివిజన్‌లకు మాత్రమే నాని కమిటీలను నియమించుకోగలిగారు. ఈ డివిజన్ కమిటీల్లో అత్యధికులు నానికి అనుచరులుగా ముద్రపడ్డారు. తాజాగా ఈ కమిటీలను రద్దు చేయాలని పశ్చిమ టీడీపీ నాయకులు పార్టీ అధిష్ఠానానికి విన్నవించారు. త్వరలోనే డివిజన్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌చార్జులను రద్దు చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయ వాడ పశ్చిమ టీడీపీలో సీనియర్ నాయకులు ఉన్నా వారి నడుమ సమన్వయం కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. జలీల్‌ఖాన్, ఎంఎస్ బేగ్ వంటి నాయకులు ఎవరికి వారే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు బుద్దా వెంకన్న సారథ్యంలో నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
విజయవాడ పార్లమెంటు పరిధిలోనూ ప్రక్షాళన..
విజయవాడ పార్లమెంటు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని నాని స్థానిక ఇన్‌చార్జులను కాదని సొంత మనుషులను ప్రోత్సహించారు. దీంతో మైలవరం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయానికి వీటన్నింటినీ చక్కదిద్ది గాడిన పెట్టే బాధ్యతను కేశినేని చిన్నికి పార్టీ పెద్దలు అప్పగించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రక్షాళన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి