YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యే దుమారం రేపే వ్యాఖ్యలు.. ఆ ఒక్కడే..!!
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:33 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) వైసీపీ (YSRCP) ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఎందుకింత ఘోరంగా ఓడిపోయామని తెలియని అయోమయ పరిస్థితి. ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మంత్రుల్లో ఏ ఒక్కరూ గెలవలేదు. తిరుగులేదనుకున్న నేతలు సైకిల్, గ్లాస్ సునామీకి చతికిలపడ్డారు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) వైసీపీ (YSRCP) ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఎందుకింత ఘోరంగా ఓడిపోయామని తెలియని అయోమయ పరిస్థితి. ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మంత్రుల్లో ఏ ఒక్కరూ గెలవలేదు. తిరుగులేదనుకున్న నేతలు సైకిల్, గ్లాస్ సునామీకి చతికిలపడ్డారు. దీంతో అసలేం జరిగింది..? ఎక్కడ లోపం ఉంది..? ప్రజలు ఎందుకింత హోరంగా ఓడించారు..? అని సమాలోచనలు చేయాల్సిన ఓడిన ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి ఏవేవో మాట్లాడేస్తున్నారు. కొందరు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే.. ఇంకొందరేమో మొత్తం చేసింది ఆయనేనంటూ సొంత పార్టీ నేతలు, సీఎం పేషీలోని కొందరిపైన సంచలన ఆరోపణలే చేశారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలే చేశారు.
అవునా.. ఆ ఒక్కడేనా..?
ఫలితాల మరుసటిరోజు మీడియా ముందుకొచ్చిన జక్కంపూడి.. ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారని ఏదేదో మాట్లాడేశారు. కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా, కన్న తల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా ప్రజల కోసం, నియోజకవర్గం కోసం పనిచేశానని.. అయినా ఓడించారన్నట్లుగా చెప్పడం గమనార్హం. ఇక్కడి వరకూ అంతా బాగుంది కానీ.. ‘ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy) లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారు. ఎమ్మెల్యేలను కూడా జగన్‌ను కలవనిచ్చేవారు కాదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం కూడా మాకు ఉంది’ అని జక్కంపూడి సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మొత్తం ప్రెస్‌మీట్‌ను బట్టి చూస్తే.. జగన్ ఓటమిలో ధనుంజయ్ రెడ్డి పాత్ర చాలానే ఉందన్నట్లుగా సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ మాటలు విన్న క్యాడర్, పార్టీ నేతలు అవాక్కయ్యి ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎవరీ ధనుంజయ్ రెడ్డి..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధనుంజయరెడ్డి సీఎంవోలో కీలకాధికారి. ప్రజాప్రతినిధులు, లేదా అధికారుల నుంచి ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటి సంగతి ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి.. తన కార్యదర్శికి చెబుతారు. సంబంధిత అంశంలో ఏం జరిగింది, తాజా పరిస్థితి ఏమిటో నివేదించాలని సీఎంవో కార్యదర్శి ఆయా శాఖలకు లేఖలు రాస్తుంటారు. ఇది పద్ధతి. కానీ ధనుంజయరెడ్డి రూటే వేరు. నేరుగా సంబంధిత ఫైలును సీఎంవోకు పంపించాలని లేఖలు రాసేవారిని తొలి నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అధికారులు మొదలుకుని, ఎమ్మెల్యేల వరకూ అందర్నీ శాసిస్తూ ఉండేవారని.. ముఖ్యంగా జగన్‌ను కలవనివ్వకుండా ఇబ్బందులు పెట్టేవారని వచ్చిన ఆరోపణలు కోకొల్లలు.. ఇప్పుడు జక్కంపూడి నోట కూడా అవే మాటలు వచ్చాయ్.. దీనికి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.