Share News

Viral: సమోసాలు అమ్ముకునే కుర్రాడు.. నీట్‌ పరీక్షలో విజయం!

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:21 AM

కఠోర శ్రమతో లైఫ్‌లో ఎలాంటి కఠిన పరిస్థితుల నుంచైనా బయటపడొచ్చు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాడో 18 ఏళ్ల కుర్రాడు. సమోసాలు విక్రయించే ఆ కుర్రాడు తన అసమాన ప్రతిభతో నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

Viral: సమోసాలు అమ్ముకునే కుర్రాడు.. నీట్‌ పరీక్షలో విజయం!

ఇంటర్నెట్ డెస్క్: కఠోర శ్రమతో లైఫ్‌లో ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచైనా బయటపడొచ్చు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాడో 18 ఏళ్ల కుర్రాడు. సమోసాలు విక్రయించే ఆ కుర్రాడు తన అసమాన ప్రతిభతో నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఫిజిక్స్ వాలా ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్న ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. టీనేజర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral: ఈమె ఇలా తయ్యారయ్యిందేంటి! చివరకు యోగాను కూడా అవమానించిందిగా..


లైఫ్‌లో కష్టపడితే ఏదైనా సాధించొచ్చనేందుకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్న ఈ కుర్రాడి పేరు సన్నీ కుమార్. అతడు ఉండేది నోయిడాలో! జీవనం సాగించేందుకు సమోసా స్టాల్ నిర్వహించే అతడు రాత్రిళ్లు చదువుకుంటూ నీట్ క్వాలిఫై అయ్యాడు. ప్రిపరేషన్ మొదలెట్టిన ఏడాది కాలంలోనే అతడు నీట్ క్వాలిఫై అయ్యాడు. సన్నీ శ్రమకు సాక్ష్యంగా నిలుస్తున్న అతడి గది వీడియోను కూడా ఫిజిక్స్ వాలా యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి సిద్ధం చేసుకున్న షార్ట్ నోట్స్‌ తాలూకు పేపర్లను అతడు గోడకు అతికించాడు. నిత్యం వాటిని చదువుతూ పాఠాలను మననం చేసుకునే వాడు. మధ్యాహ్నం రెండు గంటలకు స్కూల్ పూర్తయ్యాక సమోసా స్టాల్ నిర్వహించే అతడు ఆ తరువాత రాత్రిళ్లు చదువుకునే వాడు.


నీట్ 2024లో 720 మార్కులకు గాను 664 సాధించి క్వాలిఫై అయిన సన్నీ.. డాక్టర్ కావాలన్న తన కల సాకారం దిశగా తొలి అడుగు వేశాడు. ‘‘చాలా సార్లు రాత్రంతా చదువుకునే వాణ్ణి. ఉదయం లేచే టప్పటికల్లా కళ్లు నొప్పులు పుట్టేవి’’ అని అతడు తన శ్రమ గురించి వివరించాడు. ‘‘రోగాలను నయం చేసే ముందులను చూడగానే నాకు ఆసక్తి కలిగింది. మందులతో రోగాలు ఎలా నయం అవుతాయో తెలుసుకోవాలని పించి బయాలజీ సబ్జెక్టును ఎంచుకున్నా’’ అని చెప్పాడు.

ఫిజిక్స్ వాలాలో 11వ తరగతి నుంచి చదువుకుంటున్న సన్నీ ఆర్థిక కష్టాన్ని చూసిన సంస్థ యాజమాన్యం అతడికి రూ.6 లక్షల స్కాలర్ షిప్ ఇచ్చింది. అంతేకాకుండా, అతడి వైద్య విద్య ఖర్చులు భరించేందుకు కూడా ముందుకొచ్చింది. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సన్నీపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లైఫ్‌లో కష్టపడితే బీదరికం తలవంచక తప్పదని సన్నీ నిరూపించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Aug 31 , 2024 | 11:33 AM