Share News

Viral Video: చైనాలో కొత్త టెక్నాలజీ.. అరచేతులను స్కాన్ పేమెంట్లు చేస్తున్న వైనం

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:16 PM

డిజిటల్ చెల్లింపుల విధానంలో భారత్ దూసుకుపోతోంది. యూపీఐ చెల్లింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మనం యూపీఐ పేమెంట్లు చేస్తుంటే చైనాలో అధునాతన చెల్లింపుల విధానం ఒకటి ఆచరణలోకి వచ్చింది. అరచేతిని స్కాన్ చేస్తే సరిపోతోంది. ఈ నూతన టెక్నాలజీ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Viral Video: చైనాలో కొత్త టెక్నాలజీ.. అరచేతులను స్కాన్ పేమెంట్లు చేస్తున్న  వైనం
Palm Payment

చైనా అంటే సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు. చైనీయుల సాంకేతిక నైపుణ్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. ఇటీవల ఒక వైరల్ వీడియో రూపంలో వెలుగులోకి వచ్చిన చైనా కొత్త టెక్నాలజీ విధానం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్‌డ్‌గా ‘అరచేతి స్కానింగ్’తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. ఈ పద్ధతికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెర వైరల్‌గా మారింది.


పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. అతను, అతడి స్నేహితుల కలిసి ఈ చెల్లింపుల విధానంపై షార్ట్ వీడియోను రూపొందించారు. ఇది ఎలా పనిచేస్తుందో క్లుప్తంగా వివరించారు. జుజౌ సిటీలోని ఓ కిరాణా దుకాణంలోకి వెళ్లి ఈ విధానంలో చెల్లింపులు ఎలా చెయ్యాలో వివరించారు. ఈ అధునాతన చెల్లింపుల విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


బిల్లింగ్ కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి పలు రూపాల్లో డిజిటల్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించాడు. ఫోన్‌ను ఉపయోగించడం ఒక పద్ధతి అయితే, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం రెండవ విధానమని, ఇక మరింత ఈజీగా పేమెంట్ చేయాలనుకుంటే స్కానర్‌ ముందు అరచేతి ఉంచితే సరిపోద్దని అతడు చెప్పాడు. ఈ వీడియోలో అరచేతితో పేమెంట్‌ ఎంత సులభంగా ఉంటుందో కూడా వివరించారు. స్కానర్‌పై అరచేతిని ఉంచిన రెండు మూడు సెకన్లలోనే పేమెంట్ పూర్తయిందని క్యాషియర్ తెలిపాడు. ఇదంతా చూసి పాకిస్థానీ కంటెంట్ క్రియేటర్ ఆశ్చర్యపోయాడు. చాలా త్వరగా, ఎలాంటి అవాంతరం లేకుండా పేమెంట్ జరగడంపై అతడు నోరెళ్లబెట్టాడు. ‘చైనా 2050లో నివసిస్తోంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.


సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లలో కొంతమంది ఈ సాంకేతికతపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే కొందరు మాత్రం అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నారు. తమ దేశాలలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బావుంటుందని ఇంకొందరు కామెంట్ చేశారు.


కాగా ఈ అరచేతి చెల్లింపు విధానానికి సంబంధించి కొన్ని నెలల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఒక మెట్రో స్టేషన్‌లో యంత్రం వద్ద ఒక మహిళ తన అరచేతిని స్కాన్ చేసి టికెట్ డబ్బులు చెల్లించడం కనిపించింది. ‘సాంకేతికత మన జీవితాలను సులభతరం చేస్తూనే ఉంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. కాగా ఈ టెక్నాలజీ ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై జనాలు మాట్లాడుకుంటున్నారు. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే ఇతర దేశాలు ఈ విధానాన్ని ఏవిధంగా స్వీకరిస్తాయో లేదో చూడాలని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

దీపావళి పరమార్థం తెలుసా.. పండుగ 5 రోజులెందుకు

గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా

For more Viral News and Telugu News

Updated Date - Oct 24 , 2024 | 03:26 PM