Anand Mahindra: అప్పట్లో ఈ టెక్నిక్ తెలిసుంటే నేనే నెం.1 అయ్యేవాడిని: ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - Aug 25 , 2024 | 07:48 PM
పేపర్ ప్లేన్ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. వీడియో తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చిందని ఆయన అన్నారు. వీడియోలోని టెక్నిక్ తనకు చిన్నప్పుడు తెలిసుంటే నాటి పోటీల్లో తానే నెం.1గా నిలిచేవాడినని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎవరి జీవితంలోనైనా చిన్నతనం అత్యంత ప్రత్యేకమైనది. ఎన్నేళ్లు వచ్చినా కూడా చిన్నతనం గుర్తుకు రాగానే మోముపై నవ్వులు విరబూస్తాయి. ఆ స్నేహాలు, ఆటలు, గిల్లికజ్జాలు గుర్తుకు తెచ్చుకుని మరీ మైమరిచిపోయేవారూ ఉంటారు. అయితే, తాజాగా నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఓ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. వీడియోలో చూపించిన టెక్నిక్ తనకు చిన్నప్పుడు తెలిసుంటే ప్రతిపోటీలో తానే ముందుండెవాణ్ణని ఆయన కామెంట్ చేశారు. నెటిజన్లను ప్రస్తుతం అమితంగా ఆకర్షిస్తున్న ఈ వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే..
కాగితపు విమానాల వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా పంచుకున్నారు. వీడియోలోని వ్యక్తి సరికొత్త డిజైన్‌లో కాగితపు విమానాన్ని తయారు చేశాడు. అతడి డిజైన్ కారణంగా విమానం చాలా దూరమే ఎగిరింది. అసలు అది కిందపడే అవకాశమేలేదన్నంత రేంజ్‌లో విమానం గాల్లో దూసుకుపోయింది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Viral: రెచ్చిపోయిన టీనేజ్ బాలికలు.. రౌడీల్లా నడిరోడ్డుపై మరో బాలికను.. షాకింగ్ వీడియో
‘‘ఈ కాలం పిల్లలకు కాగితపు విమానాలపై ఆసక్తి ఉందో లేదో తెలీదు కానీ నా స్కూలు రోజుల్లో మేమందరం వీటితో ఆడే ఆటల్లో ముగినితేలేవాళ్లం. ఇతరుల పేపర్ ప్లేన్ల కంటే ఎక్కువ దూరం వెళ్లేలా ప్లేన్ డిజైన్ చేసేందుకు ఉత్సాహం చూపేవాళ్లం. కానీ ఈ వీడియోలోని డిజైన్ నాకు చిన్నప్పుడే తెలిసుంటే అన్ని పోటీల్లో నేనే గెలిచుండేవాణ్ణి. ఆదివారాలు ఇలాంటి పనుల చేసేందుకు సరైన సమయం’’ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.
ఈ పోస్టు నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చింది. దీంతో, వారు వందలకొద్దీ కామెంట్స్ గుప్పించారు. తామూ చిన్నతనంలో ఇలాంటి ప్లేన్లు తయారు చేసేవారమని అనేక మంది చెప్పుకొచ్చారు. చిన్నతనంలో వీటితో ఆడిన ఆటలు ఇప్పటికీ గుర్తున్నాయని మరికొందరు చెప్పుకొచ్చారు. తాను కాలేజీ రోజుల్లో కూడా ఇలాంటి ప్లేన్లు చేశానని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. నేటి తరం వీడియో గేమ్స్ కంటే ఇవే మంచి వ్యాపకంగా ఉండేవని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలోని పేపర్ ప్లేన్ తాయరీ టెక్నిక్ అనేక మందికి నచ్చిడంతో దీన్ని తెగ రీట్వీట్ చేస్తున్నారు.