Viral: నీటి ప్రవాహాన్ని దాటేందుకు వంతెన నిర్మించిన చీమలు! వైరల్ వీడియో!
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:25 AM
నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఓ చీమల గుంపు వంతెన నిర్మించిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ భూమ్మీద చీమలకు మించిన సివిల్ ఇంజినీర్లు లేరని జనాలు వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రకృతిలో శ్రమజీవులు ఏవైనా ఉన్నాయీ అంటే అవి చీమలే. ఎంతటి కష్టాన్నైనా అవి ఓర్వగలవు. ఒక్కో చీమ తమ బరువుకు దాదాపు 50 రెట్ల బరువున్న వస్తువులను ఎత్తగలదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంతేకాదు, అవి గొప్ప ఇంజనీర్లు కూడా! తమ మార్గానికి అడ్డుగా ఉన్న నీటి ప్రవాహాలను దాటేందుకు అవి భారీ వంతెనలను కూడా నిర్మించగలవు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీన్ని చూసి షాకైపోతున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, చీమలు తమ ముందున్న నీటి ప్రవాహాన్ని దాటేందుకు భారీ వంతెనను నిర్మించుకున్నాయి. దాదాపు మీటరు నుంచి రెండు మీటర్ల పొడవనున్న ఈ వంతెనపై మిగతా చీమలు సులువుగా ప్రయాణించాయి. తమ ఆహారం, గుడ్లను మోసుకెళుతున్నాయి (Viral).
Viral: బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు.. యువ ఉద్యోగి ఆవేదన
వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తి ఈ వంతెన చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తనకు ఏడో వింత అని చెప్పుకొచ్చారు. ఇంత చిన్న జీవాలు ఈ వంతెనను ఎలా నిర్మించాయో అని సందేహం వ్యక్తం చేశాడు. వీడియోలో ఆ చీమలు రెండు మూడు వంతెనలు నిర్మించి వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించి కూడళ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
కాగా, ఈ వీడియోపై నెట్టింట భారీ స్పందన వచ్చింది. చీమలకు ఇది సహజమేనని కొందరు అనుభవజ్ఞులు తెలిపారు. చీమలకు తమంతట తాముగా దాటలేని నీటి ప్రవాహం ఎదురుపడగానే అవి ఒకదాన్ని ఒకటి పట్టుకుని నీటిపై వంతెన నిర్మించడం ప్రారంభిస్తాయట. వాటిని చూడగానే మిగతా చీమలు కూడా వచ్చి జతకూడి వంతెనగా మారతాయట. ఇలా ఒకదాన్నొకటి పట్టుకుంటూ నీటి ప్రవాహం తేలుతూ మిగతా చీమలు వంతెన దాటేందుకు సహకరిస్తాయట.
Viral: ప్రపంచంలోని ఒకే ఒక 10 స్టార్ హోటల్! రూమ్ రెంట్ ఒక్క రాత్రికి రూ.10 లక్షలు!
వంతెనలో నిత్యం మార్పులు జరుగుతుంటాయని, మొదట ఉన్న చీమలు వంతెనను వీడితే కొత్త చీమలు వచ్చి దాన్ని మరింత దృఢంగా మారుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణంలో సోల్జర్ చీమలదే ప్రధాన పాత్ర అని వివరించారు. అత్యంత క్రమశిక్షణతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఎటువంటి అలుపూసలుపూ లేకుండా పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, భూమ్మీద మానవాళి ఇప్పటివరకూ 12 వేల చీమల జాతులను గుర్తించింది. అయితే, వాస్తవ సంఖ్య 22 వేల వరకూ ఉండొచ్చనేది ఓ అంచనా. చీమలు చాలా బలమైనవని, వాటి సైజు తగ్గేకొద్దీ శక్తి పెరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.