Bangalore: గ్రామస్తుల పెద్దమనసు.. ఒకే పల్లె నుంచి 185 మంది దేహదానానికి అంగీకారం
ABN , Publish Date - Jul 03 , 2024 | 01:11 PM
భారతీయ పరంపర, సంస్కృతి సంప్రదాయాలు పాటించే సమాజం మనది. జన్మకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మృతి చెందాక అంతకుమించి సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలు లేదా ఉన్నత హోదాలలో ఉండేవారు మాత్రమే దేహదానం (టోటల్‌బాడీ డోనార్) చేస్తారు.
- దేశానికే ఆదర్శంగా నిలిచిన గ్రామం
బెంగళూరు: భారతీయ పరంపర, సంస్కృతి సంప్రదాయాలు పాటించే సమాజం మనది. జన్మకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మృతి చెందాక అంతకుమించి సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలు లేదా ఉన్నత హోదాలలో ఉండేవారు మాత్రమే దేహదానం (టోటల్‌బాడీ డోనార్) చేస్తారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం బెళగావి జిల్లా(Belagavi District) అథణి తాలూకా శేగుణసి గ్రామంలో ఏకంగా 185 మంది దేహదానానికి అంగీకార పత్రాలు అందించారు. గత కొంతకాలంగా గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందగా వారి దేహాలను మెడికల్ కళాశాలకు అప్పగించారు. డాక్టర్ మహంతేశ్ రామణ్ణవర్ స్ఫూర్తితో గ్రామస్థులంతా స్వచ్ఛందంగా దేహదానానికి అంగీకరించారు.
ఇదికూడా చదవండి: Minister: కేంద్ర చట్టాల్లో లోపాలు.. రాష్ట్ర వినతులను కేంద్రం పట్టించుకోలేదు
ఇక్కడి యువకులే కాకుండా మహిళలు కూడా ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన మాంతేశ్ సిద్ధనాళ మాట్లాడుతూ 2010లో జాతీయ బసవసేవాదళం ఏర్పాటైందన్నారు. దీని ద్వారానే యోగా శిబిరాన్ని ఏర్పాటు చేశారని, డాక్టర్ మహంతేశ్‌రామణ్ణవర్ ముఖ్యులుగా వచ్చారన్నారు. దేహదానానికి సంబంధించి అవగాహన కల్పించడంతో అదేరోజు 108 మంది అంగీకారపత్రాలపై సంతకాలు చేశారని తెలిపారు. మృతి చెందాక శరీరం బూడిదకాకుండా మరొకరికి ఉపయోగపడాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇందుకు కుల, మత, పేద, ధనిక అనే వ్యత్యాసం లేదన్నారు. గ్రామస్థులు ఎవరైనా మృతి చెందితే సంప్రదాయ విధానాలు పాటిస్తామన్నారు. ఇందుకు స్థానిక స్వామిజీలు కూడా అంగీకారం తెలిపారని అన్నారు.
బంధుమిత్రులు చివరిచూపు చూసి సంప్రదాయాలు ముగించాక మృతదేహాలను ఆసుపత్రికి అప్పగిస్తామని తెలిపారు. డాక్టర్ మహంతేశ్ రామణ్ణవర్ అవయవదానంపై మాట్లాడుతూ తమ తండ్రి బసవణ్యప్ప డెంటిస్ట్‌గా పనిచేశారని, స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారని తెలిపారు. 2008 నవంబరు 13న మృతి చెందగా కేఎల్‌ఈ మెడికల్ కళాశాలకు దేహాన్ని దానం చేశామని వివరించారు. రెండేళ్ల తర్వాత తమ తండ్రి దేహాన్ని చూపుతూ వైద్యవిద్యార్థులకు పాఠాలు చెప్పానని వివరించారు. ఇదే స్ఫూర్తితో బెళగావి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దేహదానానికి ముందుకొస్తున్నారని తెలిపారు. ఒకరి దేహదానం ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడవచ్చునని, మెడికల్ విద్యార్థుల బోధనకు చాలా ఉపయోగపడతుందన్నారు.
దేహదానంపై చైతన్యం కలిగించడంతో కేఎల్‌ఈ మెడికల్ కళాశాలకు ఐదు వేలమంది తమ దేహాలను దానం చేయడానికి అంగీకరిస్తూ రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే 200 మంది దానం చేశారని అన్నారు. దేహదానం తర్వాత మృతదేహానికి మెడికోలు గౌరవం చెల్లించి ఆ తర్వాత అధ్యయనం చేసే ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు. కేవలం కేఎల్‌ఈ మెడికల్ కళాశాలకే కాకుండా బెళగావి నుంచి రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలలకు దేహాలను ఇస్తున్నామన్నారు. ఈ మేరకు మంగళవారం శేగుణసి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మహంతేశ్ రామణ్ణవర్ పాల్గొన్నారు. మహాలింగపురంలో ఇటీవలే వందమంది రిజస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News