Share News

Viral: ప్యాసెంజర్‌కు ఊహించని సర్‌ప్రైజ్! ఈ ఆటో అన్నకు మెడల్ ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Aug 20 , 2024 | 09:07 PM

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అడిగినంత డబ్బులు ఇచ్చినా తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని ఆరోపించేవారు కోకొల్లలు. ఈ నేపథ్యంలో ఓ ఆటోవాలా ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ప్యాసెంజర్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. అతడి నిజాయతీ, మంచి మనసును గురించి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో నెట్టింట పంచుకున్నారు.

Viral: ప్యాసెంజర్‌కు ఊహించని సర్‌ప్రైజ్! ఈ ఆటో అన్నకు మెడల్ ఇవ్వాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: అడిగినంత డబ్బులు ఇచ్చినా కూడా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని ఆరోపించేవారు కోకొల్లలు. ఈ నేపథ్యంలో ఓ ఆటోవాలా ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ప్యాసెంజర్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. అతడి నిజాయతీ, మంచి మనసును గురించి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. ఆ ఆటోవాలా గొప్పదనం గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రస్తుతం జేజేలు పలుకుతున్నారు. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన (Viral) పూర్తి వివరాల్లోకి వెళితే..

దిగ్గజ ఐటీ సంస్థలో ఫ్రెషర్ల శాలరీ ఇదా! నెట్టింట పెల్లుబుకుతున్న ఆగ్రహం


నమ్మ యాత్రి యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న ఓ ప్యాసెంజర్ తన అనుభవాన్ని తాజాగా నెట్టింట పంచుకున్నారు. మార్గమధ్యంలో ఆటోవాలా పెట్రోల్ బంక్‌ వద్ద ఆపాడని చెప్పుకొచ్చారు. ఆటో చార్జీ డబ్బులను పెట్రోల్ బంక్ వ్యక్తికి ఇవ్వాలని ఆటోవాలా సూచించినట్టు చెప్పుకొచ్చాడు. అయితే, తాను పెట్రోల్ బంక్‌లో రూ.230 చెల్లించాలనని, కానీ ప్రయాణ చార్జీ మాత్రం రూ.200గా తేలిందని వివరించారు. మిగిలిన మొత్తాన్ని తనకు ఇచ్చేస్తానని ఆటోవాలా మాటిచ్చాడని తెలిపారు. (Bengaluru Auto Driver Returns Rs 30 Forgotten By Passenger ).

కాగా, ప్రయాణ సందర్భంగా తాను ఆటోవాలాతో పిచ్చాపాటీగా చాలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. రాజకీయాలు మొదలు వివిధ అంశాలపై తాము మాట్లాడుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఒకానొక సందర్భంలో తాను ఆఫీసు కాల్‌లో బిజీ కావాల్సి వచ్చిందని చెప్పారు. ఇంతలో గమ్యస్థానం రావడంతో తాను ఆటోవాలా తనకు ఇవ్వాల్సిన డబ్బుల విషయం మర్చిపోయి దిగిపోయానని అన్నారు.


కానీ, మరుసటి రోజు ఆటోవాలా తనకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడని సదరు ప్యాసెంజర్ చెప్పుకొచ్చారు. ఉదయాన్నే డోర్ బెల్ చప్పుడు విని వెళ్లి చూడగా ఆటోవాలా కనిపించడంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. నిన్నటి రూ.30ల విషయం గుర్తు చేసిన ఆటోవాలా ఆ డబ్బును తిరిగిచ్చి నవ్వుతూ వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు.

సదరు ప్యాసెంజర్ పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆ ఆటోవాలాపై ప్రశంసల వర్షం కురిపించారు. అతడి గొప్ప మనసు, నిజాయతీని వేనోళ్ల పొడిగారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్న ఆటోవాలాకు కచ్చితంగా మెడల్ ఇవ్వాలని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Aug 20 , 2024 | 09:07 PM