Viral: జర్మనీలో ఇంజినీర్‌గా చేసి యాచకుడిగా మారిన వ్యక్తి! ఇతడి అసలు కథ ఇదా!
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:43 PM
జర్మనీలో ఇంజినీర్‌గా చేసి చివరకు యాచకుడిగా మారానన్న బెంగళూరు వ్యక్తి ఉదంతంలో క్లారిటీ వచ్చింది. అతనెన్నడూ జర్మనీకి వెళ్లలేదని, మద్యానికి బానిసైన అతడు ఇంజినీరింగ్ చదువును మధ్యలో ఆపేసి ఇలా యాచకుడిగా మారాడని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తాజాగా చెప్పుకొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన ఓ యాచకుడి ఉదంతం దేశంలో పెను కలకలమే రేపింది. జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేసి విధి ఆటకు బలై యాచకుడిగా మారానంటూ ఆ వ్యక్తి చెప్పడం జనాలను షాకైపోయేలా చేసింది. బెంగళూరుకు చెందిన శరత్ యువరాజ్ అనే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న యాచకుడి దీనస్థితి చూసి అనేక మంది కదలిపోయారు. అయితే, ఈ ఉదంతంపై శరత్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సదరు యాచకుడు జీవితంలో ఎన్నడూ జర్మనీకి వెళ్లలేదని, అసలు అతడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా కాదని తెలిపాడు. (Viral).
Viral: తల్లిదండ్రుల చిన్న పొరపాటు.. 20 ఏళ్ల పాటు యువకుడికి నరకం!
శరత్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ యాచకుడి పేరు కృష్ణ. అతడి వీడియోలు వైరల్ కావడంతో అతడు కొన్ని రోజుల పాటు జనాల కంట పడకుండా దాక్కున్నాడు. చివరకు బయటకు వచ్చి శరత్‌కు తన గురించి అసలు నిజం చెప్పాడట. ‘‘మద్యం మత్తులో అభూతకల్పనలు చెప్పానని అతడు నాతో అన్నాడు. తాను ఇంజీనర్‌ను కాదని, జర్మనీకి వెళ్లలేదని తెలిపాడు. ఇంజినీర్ చదువును మధ్యలో మానేసినట్టు చెప్పాడు’’ అని శరత్ పేర్కొన్నాడు. వైరల్ వీడియోల తరువాత కనిపించకుండా పోయిన యాచకుడిని బెంగళూరు పోలీసులు వెతికి పట్టుకుని అసలు విషయం తెలుసుకున్నారట.
Viral: గడ్డకట్టే చలిలో నదీ తీరంలోనే ఉండిపోయిన శునకం! హృదయం ద్రవించే ఘటన
కాగా, కృష్ణకు సంబంధించి ఇతర విషయాలను కూడా శరత్ పంచుకున్నాడు. ప్రస్తుతం అతడు మద్యం అలవాటు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నాడట. తన జీవితం గురించి కృష్ణ చెప్పిన విషయాలను శరత్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘నేను గతంలో చేసిన పనులను తలుచుకుని విచార పడుతున్నాను. నాకు కొత్త జీవితం కావాలి. మద్యానికి బానిసైన నేను చివరకు యాచకుడిగా మారాను. ఇలా జీవిస్తూ అలిసిపోయాను. నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని కృష్ణ చెప్పుకొచ్చాడు. తాను తాగినప్పుడు ఏం మాట్లాడతానో తనకే తెలీదని, ఊహాలోకంలో విహరిస్తానని తెలిపాడు. ఈ అలవాటు నుంచి బయటపడేందుకు అహరహం శ్రమిస్తానని వెల్లడించాడు.
జర్మనీలో టెకీగా ఉన్న తను వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల కారణంగా యాచకుడిగా మారానని కృష్ణ మొదట్లో చెప్పడంతో అతడి ఉదంతం ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఏకంగా జాతీయ మీడియా, పోలీసుల దృష్టి కూడా అతడి మీద పడింది. తన తల్లిదండ్రులు, గర్ల్‌ఫ్రెండ్ దూరమయ్యాక ఇలా అయిపోయానని చెప్పుకొచ్చాడు. తాజాగా అసలు విషయం బయటపడటంతో ఈ ఉదంతంపై చర్చ ముగిసినట్టైంది.
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!