Flight Ticket Rates: రూ. 150లకే విమాన ప్రయాణం.. వివరాలివే..
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:16 PM
Flight Ticket Bookings: విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావిస్తుంటారు. అయితే, విమాన ప్రయాణాన్ని ఆస్వాదించడం అంత సులువైన పని కాదు. ఫ్లైట్ ట్రావెలింగ్ ఛార్జెట్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, ప్రస్తుత కాలంలో విమానయనరంగంలో పోటీ పెరుగుతోంది.
Flight Ticket Bookings: విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావిస్తుంటారు. అయితే, విమాన ప్రయాణాన్ని ఆస్వాదించడం అంత సులువైన పని కాదు. ఫ్లైట్ ట్రావెలింగ్ ఛార్జెట్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, ప్రస్తుత కాలంలో విమానయనరంగంలో పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకుని నిలబడేందుకు, ప్రయాణికులను తమవైపు లాక్కునేందుకు విమానయన సంస్థలు చేయని ప్రయత్నాలు లేవు. ప్రయాణికులకు బెస్ట్ సర్వీస్ ఇస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ఛార్జీలకే తమ తమ గమ్యాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి. అది కూడా రూ. 150 లకే విమాన ప్రయాణం చేయొచ్చని మీకు తెలుసా? అవును.. ఆయా విమానయాన సంస్థలు అతితక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో విమాన ఛార్జీలను పరిశీలిస్తే.. అస్సాంలోని లిలాబరి - తేజ్‌పూర్ రూట్‌లో విమాన ప్రయాణానికి అతి తక్కువ ఛార్జీలు ఉన్నాయి. ఈ మార్గంలో జస్ట్ రూ. 150 మాత్రమే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్(RCS) కింద నడిచే విమానాల వ్యవధి సుమారు 50 నిమిషాలు ఉంటుంది. ఈ విమానాల ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రూట్‌లోనే కాదు.. టికెట్ బేస్ ఫేర్ రూ. 1000 కంటే తక్కువ ఉన్న సర్వీస్‌లు మరికొన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం కింద పని చేస్తాయి. ఈ పథకం ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తుంది.
22 రూట్లలో రూ.1000 కంటే తక్కువ ఛార్జీ..
ట్రావెల్ పోర్టల్ 'ఇక్సిగో' నివేదిక ప్రకారం.. సుమారు 22 రూట్లలో ప్రాథమిక విమాన ఛార్జీలు ఒక్కొక్కరికి రూ. 1,000 కంటే తక్కువగా ఉన్నాయి. అస్సాంలోని లిలాబరి-తేజ్‌పూర్‌లను కలిపే విమానాలకు అతి తక్కువ వన్-వే ఛార్జీ రూ. 150. అలయన్స్ ఎయిర్ ఈ మార్గంలో విమానాలను నడుపుతోంది. ఇక ఒక్కో వ్యక్తికి రూ. 150 నుండి రూ. 199 వరకు బేస్ విమాన ఛార్జీలు ఉండే చాలా రూట్‌లు ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. నివేదిక ప్రకారం.. దక్షిణాదిలో బెంగళూరు-సేలం, కొచ్చిన్-సేలం వంటి రూట్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రాథమిక టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.
గౌహతి - షిల్లాంగ్ విమాన ప్రయాణాలకు బేస్ ఛార్జీ రూ. 400. ఇంఫాల్-ఐజ్వాల్, దిమాపూర్-షిల్లాంగ్, షిల్లాంగ్-లిలాబరీ విమానాలకు రూ.500, బెంగళూరు-సేలం విమానాలకు రూ.525, గౌహతి-పాసిఘాట్ విమానానికి రూ.999, లిలాబరి-గౌహతి రూట్‌కు రూ.954గా నిర్ణయించారు.
డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాలలో ఈ సౌకర్యం ఉంది. ఇదే రూట్‌లో ఇతర రవాణా మార్గాల ద్వారా ప్రయాణిస్తే కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రకారం.. మార్చి 31, 2024 వరకు ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అంటే UDAN (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద 559 రూట్‌లు గుర్తించారట.
ఈ విమానాలకు ‘ల్యాండింగ్’ , ‘పార్కింగ్’ ఛార్జీలు ఉండవు..
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, విమానాశ్రయ ఆపరేటర్లు.. ప్రాంతీయ విమాన సర్వీసుల కింద విమానయాన సంస్థలకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇతర ప్రోత్సాహకాలతో పాటు.. ఈ విమానాలకు ‘ల్యాండింగ్’ , ‘పార్కింగ్’ వంటి ఛార్జీలు ఏమీ ఉండవు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ పథకాన్ని ప్రోత్సహించడం, విమాన ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేసే లక్ష్యంతో అక్టోబర్ 21, 2016న UDAN సేవను ప్రారంభించింది.