Viral: ఏ తండ్రికీ రాకూడని కష్టం.. కూతురి ముందు అవమానంతో మోకరిల్లి కన్నీటిపర్యంతం!
ABN , Publish Date - May 23 , 2024 | 10:19 PM
కూతురికి ఐఫోన్ కొన్నివ్వలేని ఓ తండ్రి ఆమె ముందు సిగ్గుతో కూలబడ్డ ఉదంతం చైనాను కుదిపేస్తోంది. ఈ ఘటన నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్.. ఓ లగ్జరీ.. ఓ స్టేటస్ సింబల్. ఐఫోన్ లేకపోతే జీవితంలో ముఖ్యమైంది ఏదో లేదన్నట్టు ఫీలైపోతుంటారు నేటి యువత. ఐఫోన్లు కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతుంటారు. పిల్లల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక తమలో తామే మథనపడే తల్లిదండ్రులు ఎందరో లెక్కేలేదు. తాజాగా చైనాలో (China) ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
ఓ టీనేజ్ కూతురు తన తండ్రిని ఐఫోన్ కొనిపెట్టమని ఒత్తిడి చేయసాగింది. అంత ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న తండ్రి చివరకు నడి రోడ్డు మీద నిస్సహాయంగా కూతురి ముందు మోకరిల్లాడు. తన నిస్సహాయతన క్షమించమంటూ సాగిలపడ్డాడు. తండ్రి అంత దీనస్థితిలో ఉన్నా కనికరించని కూతురు అతడిని లేవమంటూ గద్దించింది. ఈ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే తన పరువు పోతుందని గయ్యిమంది (Chinese Man Kneels In Shame For Being Unable To Buy Daughter An iPhone).
Viral: చైనా హోటల్‌లో భారతీయుడికి ఊహించని అనుభవం.. నెట్టింట వీడియో వైరల్!
అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా రికార్డు చేసిన నెట్టింట పంచుకున్నాడు. సోషల్ మీడియా, లగ్జరీనే పరమావధిగా బతుకుతున్న నేటి తరానికి తల్లిదండ్రుల కష్టాలు తెలియట్లేదని వాపోయాడు. అమ్మానాన్నలంటే పిల్లలకు కోరింది ఇచ్చే బానిసలుగా మారిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ దృశ్యం చూసి తన కడుపు తరుక్కుపోయిందని, ఆమెను అప్పటికప్పుడే చెంప ఛెళ్లుమనిపించాలని భావించినట్టు చెప్పాడు.
చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉదంతంపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లు, సోషల్ మీడియా వెరసి చిన్నారుల హృదయాలను కలుషితం చేశాయని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల త్యాగాలు గుర్తించలేని స్థితిలో నేటి తరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఒత్తిడికి లొగిపోకుండా తల్లిదండ్రులు కాస్తంత కఠినంగా ఉండాలని, పిల్లలకు మంచి చెడులు చెబుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని కొందరు అభిప్రాయపడ్డారు.