Viral: వామ్మో.. ఇలాంటి వాళ్లు వస్తే ఫైవ్ స్టార్ హోటళ్లూ మూసేసుకోవాల్సిందే!
ABN , Publish Date - Nov 30 , 2024 | 08:58 PM
హోటల్‌ళ్లల్లో అపరిశుభ్రత పేరు చెప్పి బెదిరింపులకు దిగే ఓ యువకుడు యాజమాన్యాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. పది నెలల్లో ఏకంగా 63 హోటళ్లను ఇలా మోసం చేయడంతో అప్రమత్తమైన సిబ్బంది అతడి బండారం బయటపెట్టి ఊచలు లెక్కపెట్టేలా చేశారు. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఓ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి! ఫీజులకు డబ్బుల్లేక భారీ స్కామ్ వేసిన అతడు పలు హోటళ్లను బ్లాక్ మెయిల్ చేసి కుదిరినంత వసూలు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 హోటళ్ల యాజమాన్యాలను బెదిరించాడు. చివరకు అతడి బండారం బటయపడటంతో జైలు పాలయ్యాడు. చైనాలో వెలుగు చూసిన ఈ ఘటన వైరల్‌గా మారడంతో జనాలు నివ్వెరపోతున్నారు. ఇలాంటోళ్లు ఉంటే ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా మూతపడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నాడు (Viral).
షాకింగ్! పెళ్లివేదికపై ఉన్న ఈ వరుడు ఫోన్‌లో ఏం చూస్తున్నాడో తెలిస్తే..
జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల జియాంగ్ అనే యువకుడు హోటళ్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజటానికి అలవాటు పడ్డాడు. యూనివర్సిటీ ఫీజులు కట్టుకునేందుకు ఈ దారి పట్టిన అతడు బలవంతంగా డబ్బులు వసూలు చేయడంలో ఆరితేరిపోయాడు. ముందు అతడు తన లగేజీలో చచ్చిన బొద్దింకలు ఇతర పురుగులను తీసుకుని ఏదోక హోటల్‌లో దిగేవాడు. ఆ తరువాత తన గదిలో వాటిని విసిరేసి గదంతా అపరిశుభ్రంగా ఉందంటూ నానా యాగీ చేసేవాడు. ఈ విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానంటూ బెదిరించేవాడు.
తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని భయపడిపోయే హోటల్ యాజమాన్యాలు చివరకు కాళ్ల బేరానికి వచ్చేవి. అతడికి తాయిలాలు ఇచ్చి శాంతింపజేసేందుకు ప్రయత్నించేవి. అతడికి కలిగిన అసౌకర్యానికి పరిహారంగా కొన్ని హోటళ్లు డబ్బులు ఇస్తే మరికొన్ని ఉచిత వసతి సౌకర్యం కల్పించేవి. ఇలా ఏకంగా 63 హోటళ్ల నుంచి అతడు అందినగాడికి డబ్బు వసూలు చేసుకుని తన అవసరాలు తీర్చుకునేవారు. ఇలా వరుసగా ఘటనలు వెలుగు చూడటంతో హోటల్ యాజమాన్యాలు అప్రమత్తమయ్యయి.
Viral: ఊహించని ట్విస్ట్! భార్య కోసం రూ.3.4 లక్షల బంగారు నగలు కొంటే..
ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు జియాంగ్.. పాత పద్ధతిలో ఓ హోటల్ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఎలర్ట్‌గా ఉన్న సిబ్బంది అతడి ప్రయత్నాన్ని ఆదిలోనే భగ్నం చేశారు. యువకుడి లగేజీలోని చచ్చిన బొద్దింకలు, ఇతర కీటకాలు, వెంట్రుకలను వెలికి తీసి అతడి బండారం బయటపెట్టారు. దీంతో, అతడు జైలుపాటు కాకతప్పలేదు.
‘‘గత 10 నెలల్లోనే అతడు ఏకంగా 63 హోటళ్ల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేశాడు. కొన్ని సందర్భాల్లో ఒకే రోజు మూడు నాలుగు హోటళ్లలో దిగి వారిపై బెదిరింపులకు పాల్పడేవాడు. పరిశుభ్రతాలోపాలున్నట్టు నమ్మించేవాడు. సోషల్ మీడియాలో పరువు తీస్తానంటూ బెదిరించేవాడు’’ అని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఉదంతం వైరల్ కావడంతో జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కస్టమర్లు ఉంటే ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా మూతబడతాయని కామెంట్ చేస్తున్నారు.