Viral: షాకింగ్.. చితిలో సగం కాలిన మృతదేహం.. అసలు కథ ఇది!
ABN , Publish Date - Jul 23 , 2024 | 08:28 PM
ఎవరైనా చితిలో కాలుతున్న మృతదేహాన్ని బయటకు తీస్తారా? హిందూ సంప్రదాయాల ప్రకారం అలా అస్సలు చేయకూడదు. కానీ.. ఇలాంటి షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చితిలో ఓ మహిళ మృతదేహం..
ఎవరైనా చితిలో కాలుతున్న మృతదేహాన్ని బయటకు తీస్తారా? హిందూ సంప్రదాయాల ప్రకారం అలా అస్సలు చేయకూడదు. కానీ.. ఇలాంటి షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటు చేసుకుంది. చితిలో ఓ మహిళ మృతదేహం కాలుతుండగా.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయినా పోలీసులు ఇలా ఎందుకు చేశారనేగా మీ సందేహం? ఆ వివరాలు మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం పదండి.
రాజ్‌గఢ్ జిల్లాలోని తాండిఖుర్ద్ గ్రామానికి చెందిన రీనా (25) అనే మహిళకు లక్ష్మణపురకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. అయితే.. కొంతకాలానికే ఆమె మృతి చెందింది. అత్తమామలు ఈ విషయాన్ని రీనా కుటుంబ సభ్యులకు చెప్పకుండా.. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. స్థానికుల ద్వారా రీనా సోదరుడికి సమాచారం అందింది. దీంతో.. అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన సోదరి మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితమే రీనా తన అత్తారింటికి వెళ్లిందని, తమతో ఉన్నప్పుడు ఆమె సంతోషంగానే ఉందని తెలిపాడు. కానీ.. అత్తారింటికి వెళ్లాక రీనా చనిపోవడం, తమకు తెలియజేయకుండా అంత్యక్రియలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నాడు. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తొలుత పోలీసులు అత్తారింటికి వెళ్లగా.. అప్పటికే మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని.. దహన సంస్కారాలను మధ్యలోనే నిలిపివేశారు. సగం కాలిన రీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అసలు రీనా ఎలా చనిపోయిందని అత్తమామల్ని ప్రశ్నించగా.. ఆమెకు ఏదో విష జీవి కుట్టిందని, దాని వల్లే ఆమె మరణించిందని తెలిపారు. కోడలి మృతిలో ఎలాంటి కుట్రకోణం లేదని కొట్టిపారేశారు. మరి.. రీనా చనిపోయిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించగా, అందుకు వాళ్లు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఈ వ్యవహారాన్ని తమదైన శైలిలో అధికారులు విచారిస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు సాగుతుందని తెలిపారు.
Read Latest Prathyekam News and Telugu News