Viral: ఎంత క్రమశిక్షణ.. ఈ కుక్కను చూసైనా మనుషులకు బుద్ధొస్తే బాగుండును!
ABN , Publish Date - Jun 07 , 2024 | 05:20 PM
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడ్డాకే ఓ కుక్క రోడ్డు దాటిన ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి షాకైపోతున్న జనాలు కుక్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను చూస్తే కొందరికి అసహనం. పసుపు పచ్చ లైట్ పడగానే వాహనాలు వేగం పంచి సిగ్నల్ దాటేయాలని కొందరు ఉవ్విళ్లూరుతుంటారు. మరికొందరేమో రెడ్ సిగ్నల్ పడినా లెక్క చేయక వాహనాలతో దూసుకెళ్లిపోతుంటారు. కొందరు పాదచారులదీ ఇదే తీరు. సిగ్నల్స్‌ను ఏమాత్రం గౌరవించరు. ఇలా యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందరో! అయినా జనాల్లో పూర్తి మార్పు రాలేదు. కానీ, ఓ వీధి కుక్క మాత్రం ఇందుకు బిన్నంగా క్రమశిక్షణతో నడుచుకుంటూ జనాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది.
Viral: నేను పిల్లల్ని కనాలంటే.. కాబోయే వాడికి యువతి షరతులు చూసి జనాలు షాక్
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఓ కుక్క అక్కడే కూర్చుండిపోయింది. అసలేమాత్రం కంగారు పడకుండా గ్రీన్ సిగ్నల్ పడే వరకూ ఎదురు చూసింది. కుక్క పక్కనే ఉన్న మహిళ మాత్రం తెగ హడావుడి పడిపోయింది. రెడ్ సిగ్నల్ పడినా లెక్క చేయక రోడ్డు దాటేసింది. తొలుత రోడ్డు దాటాలా వద్దా అని రెండు మూడు సార్ల సంశయించిన మహిళ చివరకు ధైర్యం చేసి రోడ్డు దాటేసింది. వాహనాలకు అడ్డం పడుతూనే ముందుకు కదిలింది. కానీ కుక్క మాత్రం అలా చేయలేదు. మహిళ వెళ్లిపోతున్నా లెక్కచేయకుండా జీబ్రా క్రాసింగ్ వద్దే ఆగిపోయింది. గ్రీన్ సిగ్నల్ పడ్డాకే రోడ్డు దాటింది (Dog crossing street only after signal turns green in viral Video).
వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. ఇలాంటి కుక్కను తామెప్పుడూ చూడలేదని అంటున్నారు. సిగ్నల్స్ మధ్య తేడాలను తెలుసుకునే తెలివితేటలు కుక్కలకు ఉంటాయా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం కుక్క క్రమశిక్షణ చూసి షాకైపోతున్నారు. ఇలాంటి డిసిప్లీన్ మనుషులకు ఎందుకు ఎండదోనని నిర్వేదం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు చూశాక కొందరిలోనైనా మార్పొస్తే బాగుండని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ గా మారింది.