Elephant Tax: జంగిల్ ట్యాక్స్ కడితేనే ఎంట్రీ.. తల్లీకూతుళ్ల డిమాండ్
ABN , Publish Date - Jan 16 , 2024 | 05:44 PM
వన్యప్రాణులకు నిలయమైన అడవి మనకు ఎంతో ఇచ్చింది. ప్రాణవాయువు దగ్గర నుంచి పండ్లుఫలాలు, ఇతర అవసరాలను ఇప్పటికీ తీరుస్తోంది. అలాంటప్పుడు.. ఆ అడవిలోని జంతవులకు ట్యాక్స్ కింద రిటర్న్ గిఫ్టులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మానవులదే.
వన్యప్రాణులకు నిలయమైన అడవి మనకు ఎంతో ఇచ్చింది. ప్రాణవాయువు దగ్గర నుంచి పండ్లుఫలాలు, ఇతర అవసరాలను ఇప్పటికీ తీరుస్తోంది. అలాంటప్పుడు.. ఆ అడవిలోని జంతవులకు ట్యాక్స్ కింద రిటర్న్ గిఫ్టులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మానవులదే. ఒకవేళ మనం కట్టకపోతే.. ఆ వన్యప్రాణులే ఎలాగోలా ట్యాక్స్ వసూలు చేస్తుంటాయి. రహదారులపై వెళ్లే ట్రక్కులను ఆపి మరీ.. పండ్లుఫలాలు వసూలు చేస్తుంటాయి. ముఖ్యంగా.. ఏనుగులు ఇలాంటి పనులు చేస్తుంటాయి. తమకు ఆకలి వేసినప్పుడు.. రహదారులపై ట్రక్కుల్ని ఆపి, తమ తొండంతో పండ్లు తీసుకొని వెళ్లిపోతాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే మరొకటి ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చింది. నారింజ పండ్లతో నిండి ఉన్న ట్రక్కుని గమనించిన ఓ ఏనుగుల సమూహం.. వెంటనే అక్కడికి చేరుకొని, దొరికినన్ని పండ్లు తీసుకెళ్లాయి. ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. నారింజ పండ్లతో నిండిన ఒక పెద్ద ట్రక్కు అడవి ప్రాంతం మీదుగా నగరానికి బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో ఒక టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో.. ఆ ట్రక్కు డ్రైవర్లు టైర్ మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఒక ఏనుగుల సమూహం ఆ ట్రక్కు వద్దకు దూసుకొని వచ్చింది. తొలుత ఈ ఏనుగుల్ని చూసి డ్రైవర్లు భయపడ్డారు. అయితే.. అవి నారింజ పండ్లను శాంతియుతంగా ఆస్వాదించడం చూసి, ఆ డ్రైవర్లు ఊపిరి పీల్చుకున్నారు. వాటి పనికి ఏమాత్రం ఆటంకం కలిగించకుండా.. ఆ డ్రైవర్లు మళ్లీ ఆ ట్రక్కుని సరిచేసే పనిలో బిజీ అయ్యారు. ఈ మొత్తం తతంగాన్ని డ్రైవర్లలో ఒకరు తన ఫోన్‌లో రికార్డ్ చేసి నెట్టింట్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఆ ఏనుగులు దోపిడీ చేశాయని పేర్కొంటే.. మరికొందరేమో అవి జంగిల్ ట్యాక్స్ వసూలు చేశాయని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంకొందరేమో.. ఆ వాహనం మరోసారి దెబ్బతినకుండా ఉండేందుకు నారింజ పండ్ల లోడ్ తగ్గించి, ఏనుగులు సహాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. మన భారతదేశంలోనూ రెండు ఏనుగులు సరిగ్గా ఇలాగే ట్యాక్స్ వసూలు చేశాయి. చెరకు రవాణా చేస్తున్న వాహనాన్ని రెండు ఏనుగులు (తల్లి, దాని పిల్ల) అడ్డగించాయి. ఎంతసేపటికి అవి అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. కొన్ని చెరకు గుత్తల్ని అతడు వేశాడు. ఆ తర్వాత ఆ ఏనుగులు పక్కకు తప్పుకున్నాయి. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.