Musk - Gates: అదే జరిగితే.. బిల్ గేట్స్ దివాలా తీస్తారు: ఎలాన్ మస్క్
ABN , Publish Date - Dec 12 , 2024 | 09:17 PM
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా టెస్లా అవతరిస్తే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దివాలా తీసే అవకాశం ఉందని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్ తాజాగా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా టెస్లా అవతరిస్తే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దివాలా తీసే అవకాశం ఉందని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్ తాజాగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. దీంతో, నెటిజన్లు బిల్ గేట్స్, మస్క్ మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న విభేదాలను గుర్తు చేసుకుంటున్నారు. 2022లో టెస్లా స్టాక్‌పై షార్ట్ పొజిషన్ తీసుకున్న బిల్ గేట్స్ అప్పట్లో ఏకంగా 1.5 బిలియన్ డాలర్లు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు (Viral).
Viral: యాచకుడిలా నటించిన వ్లాగర్ ! రోజంతా భిక్షాటనతో ఎంతొచ్చిందంటే..
‘‘ప్రపంచంలో టెస్లా అత్యంత విలువైన కంపెనీగా అవతరిస్తే సంస్థ స్టాక్స్‌పై షార్ట్ పొజిషన్ తీసుకున్న వారు బిల్ గేట్స్ దివాలా తీయొచ్చు’’ అని మస్క్ తాజాగా పోస్టు పెట్టారు. 2023లో మస్క్ చేసిన ఓ పోస్టును ప్రస్తావిస్తు ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు. బిల్ గేట్స్ చేసినట్టు టెస్లాపై షార్టు పొజిషన్ తీసుకుని ఉంటే సంస్థ దివాలా తీసినప్పుడు మాత్రమే లాభాలు వస్తాయని మస్క్ అప్పట్లో పేర్కొన్నారు. టెస్లా కష్టాల్లో ఉన్న సమయంలో గేట్స్ సంస్థ దివాలా తీస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి పందేనికి సిద్ధమయ్యారని అన్నారు. అంత భారీ స్థాయిలో షార్ట్ పొజిషన్ షేర్ల ధరలను భారీగా తగ్గిస్తుందని, రోజువారి ఇన్వెస్టర్లపై ప్రభావం పడుతుందని వెల్లడించారు.
Viral: షాకింగ్ వీడియో! ఈ భారతీయ యువకుడు బంగ్లాదేశ్‌లో ఏం చేశాడో చూస్తే..
‘‘నాకు తెలిసి గేట్స్ ఇప్పటికీ టెస్లా దివాలా తీయొచ్చనే ఉద్దేశంతో షార్ట్ పొజిషన్ కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఈ విషయంలో ఆయన్ను ప్రశ్నించాలి. పైపై మెరుగుల కోసం చేపట్టే సామాజిక కార్యక్రమాలకు కోసం గేట్స్ నన్ను విరాళం అడిగేందుకు నిజంగా ధైర్యం ఉండాలి’’ అని మస్క్ వ్యాఖ్యానించారు.
కాగా, 2021 నాటి ఇంటర్వ్యూలో గేట్స్‌కు తన పెట్టుబడులకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. అయితే, తన పెట్టుబడుల వివరాలు వెల్లడించని గేట్స్.. టెస్లా విజయాలను మాత్రం ప్రశంసించారు.
Britain: క్రిమినాలజీ విద్యార్థి దారుణం! హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని..
నిపుణులు చెప్పేదాని ప్రకారం, షార్ట్ పొజిషన్ అంటే స్టాక్ మార్కెట్‌లో లాభాల కోసం అనుసరించే ఓ వ్యూహం. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు భవిష్యత్తులో పతనమయ్యే అవకాశం ఉండే షేర్లను అప్పుగా తీసుకుని వాటిని భవిష్యత్తులో మళ్లీ తక్కువ ధరకు తిరిగిపొందాలనే తలంపుతో అప్పటి మార్కెట్ ధరకు మార్కెట్లో విక్రయిస్తారు. ఈ తరహా వ్యూహంలో అమ్మకం ధర కంటే తిరిగి కొనే ధర తక్కువగా ఉన్నప్పుడు భారీగా లాభాలు కళ్లచూడొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. షార్ట్ పొజిషన్ అంటే ఓ కంపెనీ షేర్ల ధర భవిష్యత్తులో పడిపోతుందన్న అంచనాతో పందెం కాయడం లాంటిది. అంచనాలు తప్పితే మాత్రం భారీగా నష్టం మిగులుతుంది.
టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ 1.251 బిలియన్ డాలర్లని మస్క్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ3.729 బిలియన్ డాలర్లు. యాపిల్‌ను అధిగమించాలంటే టెస్లా వృద్ధి ఏకంగా 200 శాతం ఉండాలనేది నిపుణుల అంచనా.