Viral: ఒక్క పైసా కోసం బ్యాంకు దోపిడీ! చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 05 , 2024 | 09:56 PM
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక్క పెన్నీ దోపిడీ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన ఓ నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక్క పెన్నీ (మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పైసా) దోపిడీ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన ఓ నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. ఛేజ్ అనే బ్యాంకులో జూన్ 29న ఈ ఘటన వెలుగు చూసింది (Viral).
పూర్తి వివరాల్లోకి వెళితే, నిందితుడు మైఖేల్ ఫ్లెమింగ్ బ్యాంకుకు వచ్చిన విత్ డ్రా ఫారంపై ఒక పైసా అని రాసి కౌంటర్‌లోని ఉద్యోగికి ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ఉద్యోగి ఆ మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘‘అయితే, ఆ మాట వింటే గానీ డబ్బు ఇవ్వవన్న మాట’’ అని మైఖేల్ బెదిరింపు ధోరణిలో అన్నాడు. దీంతో, అపాయం తప్పదని భయపడ్డ ఉద్యోగి అతడికి తెలీకుండా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద తుపాకీ గానీ మరే ఇతర ఆయుధం గానీ అభ్యం కాలేదు (Florida bank robber fills out withdrawal slip for one penny).
Viral: వేల కోట్ల ఆస్తి ఉన్నా.. 30 ఏళ్లుగా చీరలు కొనని సుధామూర్తి! ఎందుకంటే..
ఇక పోలీసులు జరిపిన దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్లెమింగ్ అసలు టార్గెట్ ఛేజ్ బ్యాంక్ కాదని బయటపడింది. తొలుత నిందితుడు మరో బ్యాంక్‌లో పైసా దోచుకునేందుకు వెళ్లాడని, అది మూసి ఉండటంతో ఛేజ్‌కు వచ్చాడని పోలీసులు గుర్తించారు. దోపిడీ యత్నం చేసి అరెస్టవ్వాలన్నదే తన లక్ష్యమని నిందితుడు పోలీసులకు చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘సాధారణంగా దోపిడీ సందర్భాల్లో బ్యాంకు సిబ్బంది నిందితులకు అడిగిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. దీంతో, వారి నుంచి పైసా పుచ్చుకున్నాక పోలీసులు వచ్చే వరకూ అక్కడే ఉండాలనేది అతడి ప్లాన్’’ అని పోలీసులు తెలిపారు. అయితే, ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు బ్యాంకింగ్ వ్యవస్థపై ఏదైనా సెటైర్ వేయదలిచి ఉండొచ్చని కొందరు అన్నారు. అతడి మానసికస్థితిపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.