Share News

వారి భూములకు దేవుడే యజమాని!

ABN , Publish Date - Oct 06 , 2024 | 06:40 AM

ఒక నగరం లేదా గ్రామం ‘ఉత్తమ’ంగా నిలిచిందంటే అందులో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఉన్నట్టే కదా. రాజస్థాన్‌లోని ‘దేవ్‌మాలీ’ అనే గ్రామం వైపు ఇప్పుడు అంతా దృష్టి సారించారు. ఎందుకంటే... ఇటీవల అది దేశంలోనే ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికైంది. నవంబర్‌ 7న కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇండియాస్‌ బెస్ట్‌ టూరిస్ట్‌ విలేజ్‌’ అవార్డు అందుకోనుంది.

వారి భూములకు దేవుడే యజమాని!

ఒక నగరం లేదా గ్రామం ‘ఉత్తమ’ంగా నిలిచిందంటే అందులో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఉన్నట్టే కదా. రాజస్థాన్‌లోని ‘దేవ్‌మాలీ’ అనే గ్రామం వైపు ఇప్పుడు అంతా దృష్టి సారించారు. ఎందుకంటే... ఇటీవల అది దేశంలోనే ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికైంది. నవంబర్‌ 7న కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇండియాస్‌ బెస్ట్‌ టూరిస్ట్‌ విలేజ్‌’ అవార్డు అందుకోనుంది.

దేవ్‌మాలీ గ్రామ కూడలిలోని ‘ఐ లవ్‌ దేవ్‌మాలీ’ అనే బోర్డు ముందు నిలబడి ఫొటోలు, సెల్ఫీలు దిగటానికి పర్యాటకులు ఎగబడుతున్నారు. దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎంపిక కావటంతో అజ్మీర్‌ను సందర్శించటానికి వెళ్లినవాళ్లు పనిలో పనిగా అక్కడికి సమీపంలో ఉన్న ఈ గ్రామాన్ని చూసి వెళ్తున్నారు. అజ్మీర్‌కు అరవై కిలోమీటర్ల దూరంలో బీవార్‌ జిల్లాలో కొండల మధ్య విసిరేసినట్లుండే ఈ గ్రామం... ఒక్కసారిగా అందరితో ‘వాహ్‌.. దేవ్‌మాలీ’ అనిపించుకుంటోంది.

c


ప్రత్యేకతలివే...

చిన్న గ్రామమే కానీ దేవ్‌మాలీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ గ్రామ ప్రజలు దేవనారాయణ్‌ స్వామిని పూజిస్తారు. ఊరంతా మట్టి మిద్దెలు, గడ్డి కొట్టాలు లేదా పెంకుటిల్లు మాత్రమే కనిపిస్తాయి. షిర్డీ సమీపంలోని శని షింగ్నాపూర్‌లాగే ఇక్కడ కూడా ఏ ఇంటికి తాళాలు వేయరు. దొంగతనం జరగదనే భరోసా మరి. గ్రామస్తులంతా కిరోసిన్‌, కట్టెలతోనే వంట చేసుకుంటారు. అద్భుతమైన విషయం ఏమిటంటే... ఊరు ఊరంతా తమ పొలాలను, స్థలాలను దేవునికి రాసిచ్చారు. ఎవరి పేరు మీద భూమి పట్టా అనేదే ఉండదు. అంటే ఊరివాళ్ల మూడు వేల ఎకరాలు దేవుడి మాన్యం కిందనే ఉన్నాయి. అందులోనే వ్యవసాయం చేసుకుంటూ... ఎవరికి వారు పండించుకుని తినటమే వీరి జీవన విధానం. పాడి పశువులతో సంతోషంగా జీవిస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి సంస్కృతిని ఎవరూ ఊహించరు. అందుకే ఈ విశేషాల్ని చూడటానికి టూరిస్టులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు.


పూర్తి శాకాహారులు...

ఈ గ్రామం కట్టుబాటు ఏమిటంటే అందరూ ఒకే మాట మీద ఉంటారు. ఎవరూ ఎవరితో గొడవపడరు. ఊరు ఊరంతా... ఒకరిమీద మరొకరికి అపారమైన నమ్మకం ఉంది కాబట్టే ఇళ్లకు తాళాలతో పనిలేదు. దొంగతనాలనేవి జరగవు కాబట్టి పోలీసులే అక్కర్లేదు. ఇకపోతే వీరు మాంసాహారాన్ని అస్సలు ముట్టరు. పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లినా శాకాహారాన్నే భుజిస్తారు. మద్యం జోలికి వెళ్లరు. ప్రకృతిని ప్రేమించి కాపాడతారు. సామాజిక సంబంధాలతో పాటు ఆర్థికంగా కూడా ఆనందంగా ఉన్నారు. వీటినే ప్రామాణికంగా తీసుకుని ‘దేవ్‌మాలీ’ గ్రామాన్ని దేశంలోనే ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ గా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.

mag1.2.jpg


ప్రకృతి చిత్రం

ఊరికి ఒక పక్కన కొండ మీద దేవనారాయణన్‌ గుడి ఉంటుంది. కింద చూస్తే మట్టి మిద్దెలు, పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా చెట్లు, పశుపక్ష్యా దులతో ఊరు మనోహరంగా కనిపిస్తుంది. అందుకే విదేశీయులు సైతం అక్కడికి వెళ్తుంటారు. స్థానికులు ఎక్కువగా జొన్న రొట్టెలు, కారం తింటారు. మగవాళ్లు తలపాగా ధరిస్తారు. పెళ్లయిన మహిళలు పలుచటి చున్నీలను ముఖంపై కప్పుకుంటారు. ఏ ఇంటిలో చూసినా గొర్రెలు, బర్రెలుంటాయి. అచ్చమైన గ్రామానికి అసలైన చిరునామాగా కనిపించే ‘దేవ్‌మాలీ’ని టూరిజం సంస్థలు బకెట్‌ లిస్ట్‌లో ఉంచుకుని యాత్రికులకు చూపిస్తున్నాయి.

Updated Date - Oct 06 , 2024 | 06:42 AM