Viral: రూ.118 కోట్ల లాటరీ గెలిచాడు.. కానీ ఈలోపే ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్.. చివరకు!
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:47 PM
‘అదృష్టం వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చేలోపే దురదృష్టం వచ్చి లిప్‌కిస్ పెట్టేసింది’ అని ఒక సినిమాలో అన్నట్టుగా.. ఒక్కోసారి అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి మాయమవుతుంటుంది. జీవితం ఇక మలుపు తిరిగిందని..
‘అదృష్టం వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చేలోపే దురదృష్టం వచ్చి లిప్‌కిస్ పెట్టేసింది’ అని ఒక సినిమాలో అన్నట్టుగా.. ఒక్కోసారి అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి మాయమవుతుంటుంది. జీవితం ఇక మలుపు తిరిగిందని ఆనందించేలోపే.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఆ దెబ్బతో లైఫ్ ఒక్కసారిగా తలక్రిందులు అవుతుంది. ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. తాను వంద కోట్లకు పైగా లాటరీ గెలిచానని సంతోషించేలోపే.. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ వెలుగు చూసింది. దీంతో.. అతనికి తీవ్ర నిరాశే మిగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
లోటో లాటరీ
ఆ వ్యక్తి పేరు మార్క్ ఫ్లెచర్. యూకేకు చెందిన అతని వయసు 49 సంవత్సరాలు. ఫ్లెచర్ తన మొబైల్ ఫోన్‌లో లోటో (Lotto App) అనే లాటరీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. కొంతకాలం నుంచి అందులో నంబర్లను తనిఖీ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే.. తనకు 11 మిలియన్ పౌండ్ల (భారతీయ కరెన్సీలో రూ.118 కోట్ల పైనే) లాటరీ తగిలిందని అనుకున్నాడు. దాంతో అతను ఎగిరి గెంతులేశాడు. ఇక తాను కోటీశ్వరుడినని, తాను నచ్చినట్టుగా విలాసవంతమైన జీవితం గడపొచ్చని భావించాడు. ఆ డబ్బులు అందుకోవడం కోసం.. వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పుడే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది.
అసలు ఫ్లెచర్ లాటరీ టిక్కెట్టే కొనుగోలు చేయలేదు. ఏదో సాంకేతిక లోపం కారణంగా.. అతను లాటరీ గెలిచినట్లు తప్పుడు మెసేజ్ వచ్చిందంతే. దాదాపు 45 నిమిషాల పాటు కస్టమర్‌తో మాట్లాడిన తర్వాత.. తనకు లాటరీ తగల్లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. దీనిపై ఫ్లెచర్ మాట్లాడుతూ.. తాను లాటరీ గెలిచినట్లు యాప్‌లో చూపించిందని, కానీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినప్పుడు తాను ఎలాంటి లాటరీ గెవలేదని వాళ్లు తెలిపారని అన్నాడు. పోనీ సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా అని అడిగితే.. ఎలాంటి లోపం లేదంటూ వాళ్లు తిరస్కరించారని అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
నమ్మకం పోయింది
ఇన్నాళ్లూ ఇదొక నమ్మదగిన సర్వీస్ అని భావించి తాను లోటో యాప్ వాడుతున్నానని.. కానీ తనకు జరిగిన పరిణామంతో దానిపై తనకు నమ్మకం పోయిందని ఫ్లెచర్ పేర్కొన్నాడు. తన పట్ల వాళ్లు ఎలాంటి సానుభూతి చూపించలేదని.. ఇది తనని ఎంతో ప్రభావితం చేసిందని వాపోయాడు. ‘నేను ఈ లాటరీ నిజంగానే గెలిచి ఉంటే ఏమై ఉండేదా?’ అని ఒకటే ఆలోచన చేస్తూ కూర్చున్నానన్నాడు. ఇకపై తాను లాటరీల జోలికి వెళ్లనని తెగేసి చెప్పాడు. తాను చాలా దారుణంగా మోసపోయానంటూ ఫ్లెచర్ చెప్పుకొచ్చాడు.
Read Latest Prathyekam News and Telugu News