Share News

Viral Video:స్కూల్ అంటేనే తెలీదు.. 6 భాషల్లో అదరగొట్టేస్తోంది..

ABN , Publish Date - Dec 23 , 2024 | 09:20 PM

చదువుకున్నవారే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతుంటారు. అలాంటిది, స్కూల్ మొహమే చూడని ఓ పాకిస్థానీ చిన్నారి ఇంగ్లీష్ సహా ఏకంగా 6 భాషల్లో గలగలా మాట్లాడేస్తోంది. అదెలా అనుకుంటున్నారా..

Viral Video:స్కూల్ అంటేనే తెలీదు.. 6 భాషల్లో అదరగొట్టేస్తోంది..
Shumaila

చదువుకున్నవారే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతుంటారు. అలాంటిది, స్కూల్ మొహమే చూడని ఓ పాకిస్థానీ చిన్నారి ఇంగ్లీష్ సహా ఏకంగా 6 భాషల్లో గలగలా మాట్లాడేస్తోంది. ఇది చూసి ముచ్చటపడిన ఓ వ్లోగర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. అక్షరాలు రాయడమే రాని ఈ అమ్మాయి ఎంత తెలివైందో కదా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.


పాకిస్థాన్‌కు చెందిన షుమైలాది నిరుపేద కుటుంబం. పొట్టకూటి కోసం బడిబాట వదిలిపెట్టింది తండ్రికి తోడుగా పనిచేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్‌దిర్ ప్రాంతంలో తిరుగుతూ వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు అమ్ముతుంటుంది. ఎప్పుడూ పాఠశాలలో అడుగుపెట్టకపోయినా, పట్టుదలతో ఆరు భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. అనర్గళంగా మాట్లాటం నేర్చుకుంది. ఉర్దూ, ఇంగ్లీష్, చిత్రాలీ, సిరాయికి, పంజాబీ, పాష్టో భాషలు గలగలా మాట్లాడేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.


హుషారుగా వీధుల్లో కలియతిరుగుతూ వివిధ భాషల్లో పర్యాటకులను పలకరిస్తున్న షుమైలా వేరుశనగలు అమ్మేందుకు పాకిస్థానీ వ్లోగర్ జీషన్ దగ్గరికొచ్చింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన జీషన్ షుమైలా ప్రతిభకు ముచ్చటపడి మరిన్ని వివరాలు అడిగింది. ఆమెకు ఇంగ్లీష్ సహా 6 రకాల భాషలు వచ్చని తెలుసుకుని అబ్బురపడింది. బడి మొహమే చూడని ఈ అమ్మాయి వివిధ భాషల్లో ఎలా మాట్లాడేస్తోందో చూడండంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.


పాకిస్థానీ వ్లోగర్ జీషన్ వీడియోలో తనను తాను పరిచయం చేసుకోమని అడగ్గా, దానికి షుమైలా ఇలా సమాధానమిస్తుంది. "మా నాన్న 14 భాషలు మాట్లాడతారు. నాకు ఆరు భాషలు వచ్చు. నేను స్కూల్‌కి వెళ్లను, మా నాన్నే నాకు ఇంట్లో నేర్పిస్తారు" అని చెప్పింది. తన పని గురించి అడిగినప్పుడు షుమైల ఒక చిరునవ్వు నవ్వేస్తూ "నేను వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు అమ్ముతాను. మీరు కొన్ని కొనాలనుకుంటే, నాకు తెలియజేయండి అని చెప్తుంది. వీడియోలో వరసగా 6 భాషలు మాట్లాడేస్తూ కనిపిస్తుంది షుమైలా.


జీషన్ పోస్ట్ చేసిన మరో వీడియోలో తన ఇల్లు, కుటుంబం గురించి చెప్పింది షుమైలా." నాకు 5 మంది తల్లులు ఉన్నారని, మేం మొత్తం 30 మంది తోబుట్టువులమని అంటున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 23 , 2024 | 09:21 PM