Viral: గూగుల్‌ను కోర్టుకు ఈడ్చీ.. 2 బిలియన్ పౌండ్ల జరిమానా పడేలా చేసి..
ABN , Publish Date - Oct 28 , 2024 | 03:01 PM
మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగ పరిచిన గూగుల్‌పై యూకే దంపతులు సుదీర్ఘ న్యాయం పోరాటంతో విజయం సాధించారు. గుగూల్ బండారం బయటపెట్టడంతో సంస్థపై ఏకంగా 2 బిలియన్ పౌండ్ల జరిమానా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతులకు ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. దీంతో, వారు 2006లో ఎన్నో ఆశలతో తమ వెబ్‌సైట్ ప్రారంభించారు. పేరు ఫౌండెమ్. వివిధ వెబ్‌సైట్లలో వస్తువుల ధరలు పోల్చి చెప్పే సైట్ అది. తమ ఐడియా అద్భుతంగా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి తలకిందులైంది. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వారి వెబ్‌సైట్ చిట్టచివరి పేజీల్లో కనిపించేది. అసలేం జరుగుతోందో ఆరా తీసిన వారు గూగుల్ తప్పు చేస్తోందని ఆరోపించారు. చివరకు గూగుల్‌పై 15 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం చేసి దానికి తాజాగా 2 బిలియన్ పౌండ్ల జరిమానా విధించేలా చేశారు. ఇలా అవిశ్రాంత పోరాటంతో విజయ సాధించిన ఆ జంట పేరు ఆడమ్ రాఫ్, షివోన్ (Viral).
Viral: రోడ్డుపై దొరికిన కరెన్సీ నోటుతో లాటరీ టిక్కెట్ కొంటే..
ఆడమ్, షివోన్ దంపతులది అలుపెరగని పోరాటం. వెబ్‌సైట్ ప్రారంభమైన కొంత కాలానికి తమ సైట్‌ను వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటం వారు గమనించారు. గూగుల్ ఆల్గోరిథమ్ పొరపాటున తమను స్పామ్‌గా గుర్తించిందని అనుకున్నారు. ఇదే విషయాన్ని సంస్థ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అటువైపు నుంచి సమాధానం రాలేదు. అసలు తమను ఖాతరు చేసేదే లేదన్నట్టు గూగుల్ వ్యహారం ఉందని వారు భావించారు. అదే సమయంలో ఇతర సెర్చ్ ఇంజిన్లలో మాత్రం వారి వెబ్‌సైట్ ర్యాంకు మెరుగ్గా కనిపించింది. దీంతో వారికి గూగుల్‌పై అనుమానం మొదలైంది. గూగుల్ తన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కావాలనే ప్రత్యర్థి సైట్లకు గుర్తింపు రాకుండా, వాటిని తన సెర్చ్ రిజల్ట్స్‌లోని చివరి పేజీల్లో చేరుస్తోందని అంచనాకు వచ్చారు. ఆ తరువాత బ్రిటన్‌తో పాటు ఈయూ సమాఖ్యలో కూడా కేసు దాఖలు చేశారు. ఈ విషయమై 2010లో ఐరోపా కమిషన్ దర్యాప్తునకు ఆదేశించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సెర్చ్ ఇంజెన్ మార్కెట్‌పై గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగపరుస్తూ ఫౌండెమ్ లాంటి ప్రత్యర్థి కంపెనీలకు నష్టం చేసినట్టు ఐరోపా కమిషన్ తేల్చింది. చివరకు కమిషన్ 2017లో 2.4 బిలియన్ పౌండ్ల జరిమానా విధించింది.
Hyderabad: రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..
కానీ షివోన్, రాఫ్ పోరాటం అక్కడితో ఆగలేదు. గూగుల్ తన శక్తినంతా ఉపయోగిస్తూ ఈ తీర్పుపై పలు దశల్లో అప్పీలు చేసింది. కానీ, ఆ ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. ఇటీవలే యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ కూడా జరిమానా విధింపును సమర్థించింది. గూగుల్ అప్పీళ్లను తిరస్కరించింది.
ఇదిలా ఉంటే, తమకు కలిగిన నష్టానికి గాను రాఫ్, షివోన్‌లను గూగుల్‌పై ప్రైవేటు సివిల్ కేసు కూడా దాఖలు చేశారు. 2026లో దీనిపై విచారణ మొదలు కానుంది. ఈ సందర్భంగా రాఫ్, షివోన్ దంపతులు మాట్లాడుతూ ఇంత సుదీర్ఘపోరాటం చేయాలని ముందే తెలిసుంటే అసలు తాము ఇందులో కాలుపెట్టే వాళ్లమే కాదని చెప్పుకొచ్చారు. అయితే, తాము బెదిరింపులకు లొంగే వాళ్లం కాదని తేల్చి చెప్పారు. ఇక ఐరోపా కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు ఐటీ రంగంలో కీలక మైలురాయిగా మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.